సాక్షి, కరీంనగర్ : తెలంగాణ తండ్లాటను జా తీయ స్థాయిలో, వివిధ భాషల్లో ప్రకటించాలన్న లక్ష్యంతో ఏర్పడిన అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక మహాసభలకు కరీంనగర్ వేదిక అయ్యింది. ఈ నెల 22న వేదిక రెండవ మహాసభలకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తెలంగాణ ఏ ర్పాటు ప్రకటన వెలువడినా, రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ముం దుకుసాగని సందర్భంలో జరుగుతున్న ఈ మహాసభలు తెలంగాణరచయితలకు, కళాకారులకు దిశానిర్దేశం చేయనున్నాయి. తెలంగాణ పునర్నిర్మాణంలో రచయితల బాధ్యతను నిర్వచించనున్నాయి. 22న రోజంతా నాలుగు దఫాలుగా సభలు జరుగుతాయి. వివిధ రాష్ట్రాల నుంచి రచయితలు, ప్రవాస తెలంగాణవాసులు హాజరవుతున్నారు.
మహాసభల వేదికకు సిద్ధప్ప వరకవి పేరు పెట్టారు. ఉదయం 9గంటలకు ప్రారంభసభ జరుగుతుంది. గోవా లోకాయుక్త జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, జాతీయ సాహిత్య అకాడమీ తెలుగు విభాగం కన్వీనర్ డాక్టర్ ఎన్.గోపి పాల్గొంటారు. 10 గంటలకు జరిగే ప్రవాస తెలంగాణ సదస్సులో మైసూర్ తెలుగు సాంస్కృతిక మండలికి చెందిన సీఎన్.రెడ్డి. బరోడాకు చెందిన గట్టు నారాయణగురూజీ, షోలాపూర్ నుంచి డాక్టర్ బొల్లి లక్ష్మీనారాయణ, ముంబై నుంచి యెల్ది సుదర్శన్, సంగవేణి రవీంద్ర, నడిమెట్ల ఎల్లప్ప, డిల్లీకి చెందిన పెరుక రాజు, భీవండికి చెందిన గండూరి లక్ష్మీనారాయణ పాల్గొంటారు. ఈ సభల్లో 12 పుస్తకాలను, రెండు ఆడియో సీడీలను ఆవిష్కరిస్తున్నారు.
ఈ సమావేశంలో జార్ఖండ్ జన సాంస్కృతిక మంచ్ నేత అనిల్ అంశుమన్ పాల్గొంటారు. ఉడాన్‌తోపాటు, ఆకలి, ఆక్రమణ్ కభ్‌కో హోచుకా, వస్త్రగాలం, నవనీతం, పెద్దకచ్చురం, ఎన్నీల ముచ్చట్లు, జగిత్యాల జైత్రయాత్ర, సంచలనం, కవితారాధన, నాకలం తెలంగాణ కోసమే, ఏడూర్ల చెరువు పుస్తకాలను, నెత్తుటి గాయాలు, ఆరు గొంతుకల గానం సీడీలను ఆవిష్కరిస్తారు. ఈ సభల్లో ప్రముఖ రచయితలు అల్లం రాజయ్య, జూలూరి గౌరీశంకర్, సూరెపల్లి సుజాత, జూకంటి జగన్నాథం, నందిని సిధారెడ్డి, అల్లం నారాయణ, కే.శ్రీనివాస్, డాక్టర్ పత్తిపాక మోహన్, నాళేశ్వరం శంకరం, అన్నవరం దేవేందర్, గాజోజు నాగభూషణం తదితరులు పాల్గొంటారు.
ఉద్యమానికి జాతీయ గుర్తింపు సాధించడానికే : నలిమెల
‘తెలంగాణ అస్థిత్వ పరివేదనను దేశమంతటా వినిపించాలని అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక ఏర్పడింది. అంతకుముందు తెలంగాణ భాషాసంస్కృతుల పట్ల కొనసాగిన వివక్షకు వ్యతిరేకంగా పన్నెండేళ్ల క్రితం తెలంగాణ రచయితల వేదిక ఆవిర్భవించింది. మలిదశ ఉద్యమంలో వేదిక మహోన్నతపాత్ర నిర్వహించింది. ఉద్యమానికి జాతీయ గుర్తింపు సాధించడానికీ, ఇక్కడి సాహిత్యాన్ని అన్ని ప్రాంతాలకు పరిచయం చేయడానికీ అఖిల భారత వేదికను ఏర్పాటు చేశాం’ అని వివరించారు అఖిల భారత తెరవే అధ్యక్షుడు డాక్టర్ నలిమెల భాస్కర్. బరంపురంలో జరిగిన జాతీయ సాహిత్య సభల్లో తెరవే వ్యవస్థాపక అధ్యక్షుడు నందిని సిధారెడ్డిని అవమానించడంతో తెలంగాణ ఆత్మగౌరవ వేదిక గా ఈ సంస్థ ఏర్పడిందని అన్నారు. తెరవే ఆ ధ్వర్యంలో 2010లోనే అఖిల భారత స్థాయిలో ఒక మహాసభ జరిగిందని, ఏడాది క్రితం అఖి ల భారత తెరవే ఏర్పడిందని చెప్పారు.
ఇది జాతీయ స్థాయిలో జరుగుతున్న రెండవ మహాసభ అని వివరించారు. మలిదశ ఉద్యమ కాలంలో వచ్చిన వేలాది కవితల్లో 52 కవితలను ఎంపిక చేసి హిందీలో ‘ఉడాన్’ పేరిట సంకలనాన్ని ఈ సభల్లో ఆవిష్కరించనున్నట్టు చెప్పారు. వేదిక అఖిల భారత కార్యదర్శి మచ్చ ప్రభాకర్ ఉద్యమ నేపధ్యాన్ని మరాఠీలో తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నారని తెలిపారు. తెలంగాణ సాహిత్యసారాన్ని ఇతర భాషల్లోకి తీసుకుపోవడానికి కృషి చేస్తున్నామన్నారు. పరి మితమైన వనరుల మధ్య ప్రభావవంతంగా తెలంగాణ సాహితీ సాంస్కృతిక వైభవాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పారు.
తెలంగాణ అస్తిత్వ పతాక
Published Fri, Sep 20 2013 3:13 AM | Last Updated on Fri, Sep 1 2017 10:51 PM
Advertisement
Advertisement