
పుర‘పోరు’ తొలిఘట్టం నేటి నుంచే
నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు
మూడు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌లో
91 వార్డులు, 50 డివిజన్లకు ఎన్నికలు
ఆశావహుల కసరత్తులు ముమ్మరం
అభ్యర్థుల ఎంపికలో ప్రధాన పార్టీలు బిజీ
కామారెడ్డి, న్యూస్‌లైన్:
పుర‘పోరు’లో తొలిఘట్టమైన నామినేషన్ల దాఖలు ప్రక్రియ సోమవారం నుంచి మొదలు కానుంది. జిల్లాలో కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలకు ఈ నెల 30వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్‌లో 50 డివిజన్లుండగా, కామారెడ్డి మున్సిపాలిటీలో 33 వార్డులు, బోధన్‌లో 35, ఆర్మూర్‌లో 23 వార్డులు న్నాయి. కార్పొరేషన్‌లో ఈ నెల 10 నుంచి 13 వరకు నామినేషన్లు దాఖలు చేయడానికి అవకాశం కల్పించారు. మున్సిపాలిటీలలో ఈనెల 10 నుంచి 14 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. నామినేషన్ల పరిశీలన ఈ నెల 15న జరుగనుంది. మార్చి 18 ఉపసంహరణకు చివరి తేదీగా ప్రకటించారు. నామినేషన్ల దాఖలు కోసం మున్సిపాలిటీలలో మూడు వార్డులకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో ఎన్నికల అధికారిని నియమించారు. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లోనే నామినేషన్లు స్వీకరించనున్నారు.
అభ్యర్థుల ఎంపికకు పార్టీల కుస్తీ
వార్డులు, డివిజన్‌లలో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఆయా పార్టీలు కుస్తీపడుతున్నాయి. ముందుగానే వార్డుల వారీగా ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన ప్రధాన పార్టీలు వాటిని పరిశీ లిస్తున్నాయి. కొందరు అభ్యర్థిత్వం ఖరారుకాకముందే ప్రచారం మొదలుపెట్టారు. ఎలాగైనా తమకు టికెట్టు వస్తుందన్న ధీమా తో ఉన్నవారు వార్డుల్లో తిరుగుతున్నారు. మరికొందరు టికెట్ల చక్కర్లలో ఉన్నారు. టికెట్టు ఖరారైన తర్వాతనే వార్డుల్లో తిరగాలని భావిస్తున్నారు. అయితే ప్రధాన పార్టీలకు కొన్ని వార్డుల్లో ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతున్న పరిస్థితులలో వారి మధ్య రాజీ కుదిర్చి ఎవరో ఒకరిని ఎంపిక చేయడం తలకుమించిన భారంగా మారింది. టికెట్లు దక్కనివారు ఇతర పార్టీలకు జంప్ కావడమో, రెబెల్‌గా బరిలోకి దిగడానికో సిద్ధమవుతున్నారు. నామినేషన్ల ఘట్టానికి ముందే చాలా మంది పార్టీలు ఫిరాయించారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయితే మరికొంతమంది గోడ దూకే అవకాశాలున్నాయి.