ఇఫ్తార్‌ విందుకు సర్వం సిద్ధం | All Set For Iftar Dinner in Guntur | Sakshi
Sakshi News home page

ఇఫ్తార్‌ విందుకు సర్వం సిద్ధం

Published Mon, Jun 3 2019 1:40 PM | Last Updated on Mon, Jun 3 2019 1:40 PM

All Set For Iftar Dinner in Guntur - Sakshi

పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో సిద్ధమవుతున్న ఇఫ్తార్‌ విందు వేదిక

పట్నంబజారు(గుంటూరు): పవిత్ర రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు వేదికగా ముస్లింలకు సోమవారం ఇఫ్తార్‌ విందు ఇవ్వనున్నారు. ఈ క్రమంలో ఆదివారం పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరుగుతున్న ఏర్పాట్లును వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పరిశీలించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమం కోసం దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి ఎంతో కృషి చేశారని, ఆయన మాదిరిగానే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కూడా పాటుపడతారన్నారు. కార్యక్రమంలో మంగళగిరి, గుంటూరు తూర్పు, ప్రత్తిపాడు, పొన్నూరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముస్తఫా, సుచరిత, రోశయ్య, వైఎస్సార్‌ సీపీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అప్పిరెడ్డి, సమన్వయకర్త మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్, నగర అ«ధ్యక్షుడు  రమేష్‌గాంధీ, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నంతో పాటు పార్టీ నేతలు ఏర్పాట్లును పరిశీలించి, అధికారులతో మాట్లాడారు.

పటిష్ట బందోబస్తు..
గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఇఫ్తార్‌ విందు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సారి గుంటూరులో జరిగే ఈ కార్యక్రమంలో సోమవారం పాల్గొననున్నారు. ఇఫ్తార్‌ విందుకు వేదికైన పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. తొలుత బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా, శనివారం కురిసిన వర్ష కారణంగా వేదికను పోలీస్‌ పురేడ్‌ గ్రౌండ్స్‌కు మార్పు చేయాలని కలెక్టర్‌ కోన శశిధర్‌ ఆదేశించారు. జిల్లా ఉన్నతాధికారుల కార్యాలయాలన్నీ దాదాపుగా అటువైపు ఉండటంతో పోలీసులు ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేలా నిఘా వర్గాల సూచనలు, సలహాలతో కలెక్టర్‌ పర్యవేక్షణలో అర్బన్‌ ఎస్పీ సీహెచ్‌ విజయారావు పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాట్లను చేయిస్తున్నారు. 

అధికారులతో సమావేశం..
జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్‌హాలులో బందోబస్తు విధులకు కేటాయించిన అధికారులతో ఎస్పీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు  పాటించాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. నగరంలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.  నిఘా వర్గాల సూచనల అమలుపై సుదీర్ఘంగా చర్చజరిగింది.

రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు..
బందోబస్తు విధులకు మొత్తం 820 మంది అధికారులు, సిబ్బందిని కేటాయించారు. వారిని పర్యవేక్షించేందుకు ముగ్గురు ఏఎస్పీలను నియమించారు. ఆదివారం ఉదయం నుంచి పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో బాంచ్‌ అండ్‌ డాగ్‌ స్క్వాడ్‌లు రంగంలోకి దిగాయి. అణువణువునా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.  ఏరియా డామినేషన్‌ పార్టీలు, రూఫ్‌ టాప్‌ పార్టీలు, హైవే పెట్రోలింగ్, రోప్‌ పార్టీలను సిద్ధంగా ఉంచారు. నిరంతరం అధికారుల పర్యవేక్షణతో పాటుగా డ్రోన్‌ల ద్వారా కార్యక్రమం ముగిసే వరకూ ఆయా ప్రాంతాలను సునిశితంగా పరిశీలించేందుకు రెండు డ్రోన్‌ కెమేరాలను సిద్ధం చేశారు. ఇప్పటికే స్పెషల్‌ బ్రాంచ్, ఇంటెలిజెన్స్, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి ఉన్నతాధికారులకు చేరవేస్తున్నారు. కేటగిరీల వారీగా పాసులను కేటాయించారు. పాసులు ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతించనున్నారు. ముఖ్యమంత్రి కార్యక్రమానికి వచ్చి వెళ్లే మార్గాల్లోని ట్రాఫిక్‌ను దారిమళ్లించనున్నారు.

 అధికారులకు స్పష్టమైన ఆదేశాలు: కలెక్టర్‌ 
గుంటూరు వెస్ట్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పవిత్ర రంజాన్‌ సందర్భంగా ముస్లింలకు ఇవ్వనున్న ఇఫ్తార్‌ విందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ చెప్పారు. ఆదివారం రాత్రి కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో అధికారులు, వైఎస్సార్‌ సీపీ ముఖ్య నాయకులతో  సమీక్ష నిర్వహించారు. సుమారు 5 వేల మంది ఈ విందులో పాల్గొంటున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ముస్లిం మత పెద్దల కోసం ప్రత్యేక ఆహ్వానాలను సిద్ధం చేశామన్నారు. సోమవారం రాత్రి జరగనున్న కార్యక్రమానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రాక సందర్భంగా ట్రాఫిక్, భద్రత, మంచినీరు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై ఆయా విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు ముస్తఫా, అర్బన్‌ ఎస్పీ విజయరావు, జాయింట్‌ కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, జాయింట్‌ కలెక్టర్‌–2 సత్యనారాయణ, డీఆర్వో శ్రీలత, గుంటూరు ఆర్డీవో వి.వీరబ్రహ్మం పాల్గొన్నారు.

నాలుగు వైద్య బృందాల ఏర్పాటు  
గుంటూరు మెడికల్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం గుంటూరులో ఇఫ్తార్‌ విందులో పాల్గొంటున్న దృష్ట్యా నాలుగు ప్రత్యేక వైద్య బృందాలను జిల్లా వైద్యాధికారులు ఏర్పాటు చేశారు. సూపర్‌స్పెషాలిటి వైద్యులతో కూడిన రెండు ప్రత్యేక వైద్య బృందాలు ముఖ్యమంత్రి కాన్వాయ్‌ వెంట ఉంటాయని, రెండు వైద్య బృందాలు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌ వద్ద ఉంటాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement