సాక్షి, అనంతపురం అగ్రికల్చర్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తొలిసారిగా 2019–20 రాష్ట్ర బడ్జెట్ శుక్రవారం ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర అర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బడ్జెట్‌పై ‘అనంత’ ఎన్నో ఆశలు పెట్టుకుంది. గత చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లుగా ప్రవేశపెడుతున్న బడ్జెట్‌తో ‘అనంత’ అన్ని విధాలుగా అన్యాయానికి గురవుతూ వచ్చింది. ఈ క్రమంలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో తొలిసారిగా ఆర్థికమంత్రి ప్రవేశపెడుతున్న బడ్జెట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
గత ప్రభుత్వం దారుణంగా మోసం
గత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు 2014లో కళ్యాణదుర్గానికి మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాంను తీసుకువచ్చారు. దేశంలో అత్యంత దుర్భిక్ష ప్రాంతమైన ‘అనంత’ అభివృద్ధిపై ఆశలు రేకెత్తేలా వరాలు గుప్పించారు. జిల్లా అభివృద్ధి కోసం 21 హామీలను గుప్పించినా ఒకటి అరా మినహా అన్నింటినీ గాలికివదిలేశారు. ఏ బడ్జెట్‌లోనూ జిల్లాకు న్యాయం చేయకుండా మోçసం చేశారు. ప్రధానంగా హంద్రీ–నీవాను ఏడాదిలోపు పూర్తి చేసి ఆయకట్టుకు నీరిస్తామని ప్రకటించినా ఐదేళ్లయినా ఒక ఎకరా ఆయకట్టుకు కూడా నీళ్లివ్వలేదు. హంద్రీ–నీవా ఫేజ్–1 ద్వారా 2012లో, ఫేజ్–2లో 2016లో గొల్లపల్లి రిజర్వాయర్‌కు కృష్ణాజలాలు వచ్చాయి.
అయితే డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేయలేదు. డిస్ట్రిబ్యూటరీలు చేయొద్దని 2015 ఫిబ్రవరిలో జీవో 22 జారీ చేయడంతో ఆయకట్టు ఒట్టిపోయింది. ఇపుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమైనా 33, 34, 36 ప్యాకేజీలు, డిస్ట్రిబ్యూటరీలు పూర్తీ చేయడంతో పాటు గొల్లపల్లి, మారాల, చెర్లోపల్లి రిజర్వాయర్లకు నీళ్లిచ్చి ఆయకట్టుకు నీరివ్వాలని రైతులు కోరుకుంటున్నారు. అలాగే బీటీపీ, పేరూరు ప్రాజెక్టులకు వీలైనంత త్వరగా పూర్తీ చేయాలని ఆశిస్తున్నారు. హెచ్చెల్సీ ఆధునికీరణ పనులు పూర్తికావల్సి ఉంది. మొత్తం మీద బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి ‘అనంత’లో పంటలు పండిచేందుకు సాగునీరు ఇస్తే చాలనే ఆశలో ‘అనంత’ రైతాంగం ఉంది.
పరిశ్రమలపై ఆశలు
గత ప్రభుత్వం అనంతను స్మార్ట్‌సిటీ చేస్తామని, టైక్స్‌టైల్‌పార్క్, ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామన్నారు. పారిశ్రామికకారిడార్, పెనుకొండలో ఇస్కాన్ ప్రాజెక్టు, పుట్టపర్తిలో విమానాల మరమ్మతుల కేంద్రం, కుద్రేముఖ్ ఇనుప ఖనిజ ఆధారిత ప్రాజెక్టును పూర్తి చేయడంపై హామీలు ఇచ్చారు. కనగానపల్లి మండలం దాదులూరులో గోరుచిక్కుడు ప్రాసెసింగ్ యూనిట్, ఎన్‌పీ కుంటలో వేరుశనగ పరిశోధన కేంద్రం, బుక్కరాయసముద్రం మండలంలో నూనెగింజల పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నా... ఏవీ కార్యరూపం దాల్చకుండా ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ఈ పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తారా లేదంటే జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీల మేరకు కొత్త ప్రాజెక్టులు, పరిశ్రమలకు నిధులు కేటాయించనున్నారా అనేది ఆసక్తి కలిగిస్తోంది.
ప్రధానంగా ట్రైపార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న కుద్రేముఖ్ ఉక్కుపరిశ్రమ ఏర్పాటుకు సానుకూలత వ్యక్తమయ్యే పరిస్థితి ఉంది. అలాగే లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఏర్పాటుపై జిల్లా వాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక వ్యవసాయ మిషన్ కింద జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. 2014 నుంచి 2018 వరకు పెండింగ్ ఇన్‌పుట్‌సబ్సిడీ రూ.1,000 కోట్లకు పైగా రావాల్సివుంది. రైతులకు నయాపైసా కట్టకుండా పంటల బీమా ప్రీమియం పూర్తీ చెల్లింపు, ఉచిత బోర్లు, గత ఐదేళ్లలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున పరిహారం చెల్లింపు నిధులు కేటాయిస్తే దాదాపు 250 మందికి పైగా బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర బడ్జెట్‌లో జిల్లాకు కేటాయింపులపై అన్ని వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
నిధులు కేటాయించాలి
రాయదుర్గం ని యోజకవర్గంలో తాగు, సాగు నీటికి బడ్జెట్టులో నిధులు కేటాయించాలని కో రనున్నా. బీటీపీకి కృష్ణా జలాలు చేర్చడంపై కూడా ప్రస్తావించనున్నా. నియోజకవర్గాంలోని రోడ్ల అభివృద్ది, ప్రభుత్వాసుపత్రుల అప్‌గ్రేడ్‌కు నిధులు చాలా అవసరం. ఈ అంశాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతా. జలధార పథకానికి రూ.200 కోట్లు మంజూరుకు అనుమతులతో పాటు బొమ్మనహాళ్, కణేకల్లు మండలాల్లో ఎడారి నివారణకు నిధులు మంజూరుకు విన్నవించనున్నా. – కాపు రామచంద్రారెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్
పారిశ్రామిక అభివృద్ధి కోరుతా
గుంతకల్లు ఏసీఎస్ మిల్లు మూతపడటంతో కార్మికులు, చిరు వ్యాపారుల జీవస్థితిగతులు చిన్నాభిన్నమయ్యాయి. ప్రత్యామ్నాయంగా పరిశ్రమలను నెలకొల్పి స్థానిక నిరుద్యోగ యువత, కార్మికులకు ఉపాధి కల్పించాలని సభాపతి ద్వారా సీఎం వైఎస్.జగన్‌ను కోరనున్నా. అలాగే హంద్రీనీవా ద్వారా కృషాŠఝ జలాలతో నియోజకవర్గంలోని అన్ని చెరువులనూ నింపాలని సీఎంకు విన్నవించనున్నా.
– వై.వెంకట్రామిరెడ్డి, గుంతకల్లు ఎమ్మెల్యే
సాగునీటి సాధనే ప్రధానం
రైతాంగాన్ని ఆదుకునే విధంగా సాగునీటి సాధనే లక్ష్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వాదన వినిపిస్తాం. హంద్రీనీవా ద్వారా పేరూరు డ్యాంకు నీరు అందించడంతో పాటు నియోజకవర్గంలో కొత్తగా సాగునీటి రిజర్వాయర్లు, పిల్లకాలువల ఏర్పాటుకు ఈ బడ్జెట్‌లో నిధులు కోరనున్నాం. అలాగే రాప్తాడు నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీర్చేందుకు రూ. కోటి నిధులు కేటాయించాలని అసెంబ్లీలో కోరుతాం.
– తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే
నీటి సమస్య తీరుస్తా
నియోజకవర్గంలో తాగు, సాగునీరు సమస్య పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరాం. ఈ మేరకు తాగునీటి అవసరాల కోసం ఇప్పటికే రూ. కోటి మంజూరు చేస్తామని పేర్కొన్నారు. విద్యావ్యవస్థలో సమూల మార్పులకు సీఎం చర్యలు చేపట్టారు. దీని వల్ల నియోజకవర్గంలోని ప్రతి పాఠశాల అభివృద్ధి చెందుతుందనే నమ్మకం ఉంది. బడ్జెట్‌లో నియోజకవర్గ అభివృద్ధికి ఎక్కువ నిధులు వస్తాయని ఆశిస్తున్నా.
– జొన్నలగడ్డ పద్మావతి, శింగనమల ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment