
ఆళ్లగడ్డ ఉపఎన్నికకు మోగిన నగారా
సాక్షి ప్రతినిధి, కర్నూలు:
వైఎస్సార్‌సీపీ నాయకురాలు శోభానాగిరెడ్డి మృతితో ఖాళీ ఏర్పడిన ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చే నెల 8న ఉప ఎన్నికను నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో ఈ నియోజకవర్గంలో మళ్లీ ఎన్నికల సందడి మొదలుకానుంది. అయితే ఆళ్లగడ్డ ఉప ఎన్నికలో టీడీపీ పోటీ చేస్తుందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది.
నందిగామ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేదు. మానవతా దృక్పథంతో పోటీ నుంచి తప్పుకున్నట్లు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీకి దిగిన భూమా శోభా నాగిరెడ్డి ఏప్రిల్ 24న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అయితే అప్పటికే ఈవీఎంలలో శోభా నాగిరెడ్డి పేరు నమోదై ఉండటంతో పోటీ నుంచి ఆమె పేరును తొలగించడం సాధ్యం కాదని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. అత్యధిక ఓట్లు వస్తే శోభా నాగిరెడ్డి గెలిచినట్లు ప్రకటించి, ఆ తరువాత ఉప ఎన్నిక నిర్వహిస్తామని కూడా ప్రకటించింది.
అయితే అభ్యర్థి శోభా నాగిరెడ్డి మరణించినందున ఆమెకు అత్యధిక ఓట్లు వచ్చినా ఆమె ఎన్నిక చెల్లదని, రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థిని గెలిచినట్లు ప్రకటించాలని రుద్రవరం మండలం చిన్నకంబలూరు గ్రామానికి చెందిన జంగా వినోద్‌కుమార్‌రెడ్డి, యర్రగుడిదిన్నె గ్రామానికి చెందిన హర్షవర్ధన్‌రెడ్డి.. హైకోర్టులో పిటిషన్లు దాఖలుచేశారు. రాష్ట్రంలో ఖాళీ ఏర్పడిన నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆగస్టు 16న షెడ్యూల్‌ను విడుదల చేసింది.
కానీ హైకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున ఆళ్లగడ్డ స్థానాన్ని నాటి షెడ్యూలులో చేర్చలేదు. దీంతో అళ్లగడ్డ ఉప ఎన్నిక నిర్వహించాలని కోరుతూ నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఉప ఎన్నిక నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసింది.
14 నుంచి నామినేషన్లు: ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు ఈ నెల 14 నుంచి 21 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 22న నామినేషన్ల పరిశీలన, 24న నామినేషన్ల ఉప సంహరణ ఉంటుంది. నవంబర్ 8న ఎన్నిక, అదే నెల 12న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన జన్మభూమి- మా ఊరు కార్యక్రమం కొనసాగుతుందా లేదా అని సందేహాలు తలెత్తుతున్నాయి. బుధవారం జన్మభూమి కార్యక్రమాలను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు.
ఎన్నిక కోడ్ జిల్లా అంతటికి వర్తిస్తుందా లేదా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమవుతుందా అనే దానిపై స్పష్టత కోసం కలెక్టర్ విజయమోహన్ మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. వారి నుంచి వచ్చే సమాచారం మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. కాగా.. ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపటంతో ఓటర్లు శోభా నాగిరెడ్డి కుటుంబానికి మరోసారి ఓట్లతో నివాళి అర్పించడానికి ఉత్సాహంగా ఉన్నారు.
15లోపు ఆధార్ నెంబర్లు అందజేయండి
కర్నూలు(రాజ్‌విహార్): విద్యుత్ వినియోగదారులు తమ ఆధార్ కార్డు నెంబర్‌ను ఈ నెల 15 లోపు అందజేయాలని ఎస్‌పీడీసీఎల్ కర్నూలు డివిజినల్ ఇంజినీర్(ఆపరేషన్స్) ఎం.ఉమాపతి కోరారు. మంగళవారం స్థానిక పవర్ హౌస్‌లోని తన కార్యాలయంలో ఏడీఈలు, ఏఈలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు ఆధార్ నెంబర్లతో పాటు సెల్‌ఫోన్ నెంబర్లను విద్యుత్ కనెక్షన్ సర్వీసు నెంబర్లకు అనుసంధానం చేస్తున్నామన్నారు. ఈ నెల 2వ తేదీ నుంచే నెల వారీ బిల్లులు అందజేస్తున్నట్లు చెప్పారు.
స్పాట్ బిల్లింగ్‌కు వచ్చే సిబ్బందికి ఆదార్, సెల్‌ఫోన్ నెంబర్ల ఇచ్చి సహకరించాలన్నారు. లేని పక్షంలో ఈఆర్‌ఓ, సెక్షన్(ఏఈ) కార్యాలయాల్లో ఆధార్ కార్డు జిరాక్స్ కాపీపై విద్యుత్ సర్వీసు కనెక్షన్ నెంబర్, సెల్‌ఫోన్ నెంబరు రాసి అందివ్వాలని సూచించారు. యజమానులు అందుబాటులో లేకపోతే వారసులు, లేదా అద్దెకుంటున్న వారి ఆధార్ నెంబర్ ఇవ్వొచ్చన్నారు.
ఈ నెల 15 లోపు ఆధార్ నెంబర్లు ఇవ్వని పక్షంలో విద్యుత్ కనెక్షన్లు తొలగించి సరఫరా నిలిపేస్తామని హెచ్చరించారు. కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకునే వారి నుంచి అన్ని ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్ నెంబర్ ఇస్తేనే కనెక్షన్ మంజూరు చేయాలని ఆదేశించారు. సమావేశంలో కర్నూలు ఏడీఈలు -1, 2 విజయసారథి, ఈదన్న, ఏఈలు పాల్గొన్నారు.