
విప్లవ వీరుడు అల్లూరి
ఒంగోలు టౌన్ : అల్లూరి సీతారామరాజు జీవితం, పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని స్థానిక మంగమ్మ కాలేజీ రిటైర్డు ప్రిన్సిపాల్ ఏవీ పుల్లారావు పేర్కొన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ నగర కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎన్‌ఆర్‌ఐ జూనియర్ కాలేజీ ఆవరణలో అల్లూరి సీతారామరాజు 118వ జయంతి నిర్వహించారు. సీతారామరాజు నేతృత్వంలో 1922 జనవరి నుండి 1924 మే వరకు సాగిన రంప విప్లవం జాతీయోద్యమ చరిత్రలో ఉత్తమ ఘట్టంగా నిలిచిందన్నారు. ఈ విప్లవం తెలుగుజాతి పౌరుషాగ్నిని, దేశభక్తి స్ఫూర్తిని ప్రజ్వలింప చేసిందన్నారు.
బ్రిటీష్ పాలకుల గుండెల్లో దడ పుట్టిందని.. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలకే పరిమితమైనప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపిందన్నారు. ఈ తిరుగుబాటు ద్వారా అల్లూరి సీతారామరాజు ఆంధ్రుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. గిరిజనుల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించిన అల్లూరి జీవితం విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని వెల్లడించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మాజీ కార్యదర్శి బీ రఘురామ్ మాట్లాడుతూ బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా మన్యం ప్రాంతాల్లో అనేక పోరాటాలు నిర్వహించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ నగర కార్యదర్శి పీ రాంబాబు అధ్యక్షతన జరిగిన సదస్సులో నాయకులు ఎన్. నవీన్, మహేంద్రరెడ్డి, ఎన్‌ఆర్‌ఐ కాలేజీ ప్రిన్సిపాల్, అధ్యాపకులు పాల్గొన్నారు.