ప్రత్యేక హోదాతో పాటు ప్యాకేజీ అవసరం
మాజీ మంత్రి, టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్
కొరిటెపాడు(గుంటూరు) : నవ్యాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక హోదాతోపాటు ప్రత్యేక ప్యాకేజీకూడా ఎంతో అవసరమని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు డొక్కా మాణిక్య వరప్రసాదరావు స్పష్టం చేశారు. స్థానిక అరండల్‌పేటలోని హోటల్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల సత్తా చంద్రబాబునాయుడుకు మాత్రమే వుందన్నారు. అభివృద్ధి ఎంత ముఖ్యమో సంక్షేమం కూడా అంతే ముఖ్యమని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలకు ప్రత్యేక ప్యాకేజీ చాలా ఉపయోగకరమన్నారు. ప్రత్యేక హోదా పారిశ్రామిక వేత్తలకు మాత్రమే ఉపయోగకరమని పేర్కొన్నారు.
నూతన రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రతిపక్షాలు తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించారు. రాజధాని ప్రాంతంలో ఉపాధి కోల్పోయిన పేద వర్గాలకు భూములు పంచితే స్థిరమైన ఉపాధి ఉంటుందని, వారికి తప్పక భూములు ఇవ్వాలని కోరారు. పదవులు ఆశించి తాను టీడీపీలో చేరలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా, ప్యాకేజీ కోసం ముఖ్యమంత్రి తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు. సమావేశంలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ యం.డి.హిదాయత్, టీడీపీ నాయకుడు కనపర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.