
సాక్షి, అమరావతి: ప్రైవేట్ సంస్థలు చేయాల్సిన పనికి ఏకంగా ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా రెట్టింపు ధరలకు సెట్‌టాప్ బాక్సులను విక్రయిస్తూ తాజాగా ఈక్విటీ పేరుతో మరో దోపిడీ వ్యవహారానికి సర్కారు తెరతీయటంపై అధికారవర్గాలు నివ్వెరపోతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు సన్నిహితుడైన వేమూరి రవికుమార్‌కు చెందిన టెరా సాఫ్ట్‌వేర్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం రూ. కోట్ల విలువైన ఫైబర్ గ్రిడ్, సెట్‌టాప్ బాక్సుల ప్రాజెక్టును అప్పగించడం తెలిసిందే. తొలుత కేవలం రూ.300 కోట్లతో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రారంభించి ఇప్పుడు అంచనా వ్యయాన్ని రూ.5,200 కోట్లకు చేర్చడం గమనార్హం. ఇందులో రూ.200 కోట్లకు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే గ్యారెంటీ ఇచ్చి బ్యాంకు నుంచి అప్పు ఇప్పించింది. మరో రూ.వంద కోట్లను మైనింగ్ కార్పొరేషన్ నుంచి ఇప్పించింది. ఈ ప్రాజెక్టులో భారీ ఎత్తున అంటే ఏకంగా రూ.2000 కోట్లు ప్రభుత్వ పెద్దలకు చేరుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఏకంగా ఖజానా నుంచే జేబులు నింపేసుకోవటాన్ని చూసి ఉన్నతాధికార వర్గాలు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. ఈ ప్రాజెక్టులో భారీ అవినీతికి పాల్పడుతున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అజేయకల్లం ఇటీవలే వ్యాఖ్యానించడం తెలిసిందే.
రూ.రెండు వేల కోట్ల దోపిడీకి స్కెచ్
ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును ఆర్థికశాఖ ఆదిలోనే గట్టిగా వ్యతిరేకించింది. ప్రైవేట్ సంస్థలు చేయాల్సిన పనిని రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరీ అప్పగించడాన్ని తప్పుబట్టింది. మరోవైపు ఈ ప్రాజెక్టు వ్యయాన్ని ఇప్పుడు ఏకంగా రూ.5,200 కోట్లకు పెంచేయడం గమనార్హం. ఈ ప్రాజెక్టును అనుబంధంగా ఫైబర్ గ్రిడ్ కనెక్షన్ ద్వారా ఇళ్లలో టీవీలకు సెట్‌టాప్ బాక్సులను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నాసిరకం చైనా బాక్సులను రెట్టింపు ధరలకు వినియోగదారులకు అంటగట్టి రూ.2,000 కోట్ల దోపిడీకి ‘ముఖ్య’నేత బినామీ స్కెచ్ వేశారు. రాష్ట్ర ప్రజలపై అప్పులు భారం మోపడంతో పాటు ఖజానాను కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు. సెట్‌టాప్ బాక్సుల ఏర్పాటు కోసం ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ రూ.4,000 కోట్ల అప్పు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. దీనికి ప్రభుత్వమే గ్యారెంటీ కూడా ఇచ్చింది.
ఖజానా నుంచి మరో రూ.1,200 కోట్లు కాజేసే ఎత్తుగడ..
ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకు తాజాగా రూ.4,000 కోట్ల రుణం తీసుకోవడానికి గ్యారంటీ ఇచ్చిన సర్కార్ అంతటితో ఆగలేదు. కార్పొరేషన్ చేసే అప్పునకు ఈక్విటీ కింద రూ.1,200 కోట్లు మంజూరు చేయాలంటూ ఇటీవల ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు అందాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈక్విటీ కింద రూ.1,200 కోట్లు ఇస్తేనే బ్యాంకుల నుంచి రుణం మంజూరు అవుతుందని కార్పొరేషన్ పేర్కొంది. దీనిపై ఆర్థిక శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే 95 శాతం ఇళ్లలో టీవీలకు కేబుల్ కనెక్షన్లున్నాయని, అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా అప్పులు చేసి, ఖజానా నుంచి నిధులు కూడా ఇచ్చి సెట్‌టాప్ బాక్సులు సరఫరా చేయాల్సిన అవసరం ఏమిటని అధికారులు ప్రశ్నిస్తున్నారు. దాదాపు కోటి ఫైబర్ కనెక్షన్లు ఇవ్వడంతో పాటు కోటి సెట్‌టాప్ బాక్సులను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఫైబర్ గ్రిడ్ కనెక్షన్లు తీసుకోవాల్సిందిగా గృహ వినియోగదారులపై ఒత్తిడి తేవడంతోపాటు ఇప్పటికే కేబుల్ కనెక్షన్లు ఇచ్చిన కేబుల్ ఆపరేటర్లను అధికారుల ద్వారా బెదిరిస్తోంది. ఫైబర్ గ్రిడ్ కనెక్షన్ తీసుకుంటే నెలకు రూ.148కే టీవీ, ఫోన్, వైఫై అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వినియోగదారులు ఆసక్తి చూపడం లేదు. వైఫై వస్తుందనే ఉద్దేశంతో కొందరు కనెక్షన్లు తీసుకున్నా టీవీ సరిగా రాకపోవడం, ఇంటర్నెట్ పనిచేయకపోవడంతో ఆ కనెక్షన్లను తొలగించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు.
వినియోగదారులపై రూ.800 కోట్ల వడ్డీ భారం..
ఫైబర్ గ్రిడ్ కనెక్షన్, సెట్‌టాప్ బాక్సుల పేరుతో వినియోగదారులపై రాష్ట్ర ప్రభుత్వం రూ.800 కోట్ల వడ్డీ భారాన్ని మోపుతోంది. సెట్‌టాప్ బాక్సు ఖరీదు రూ.4,000ను వినియోగదారులు నాలుగేళ్లలో వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒక్కో వినియోగదారుడు నాలుగేళ్లలో రూ.4,800 చొప్పన చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినట్లుగా కోటి కనెక్షన్లు, సెట్‌టాప్ బాక్సులను లెక్కలోకి తీసుకుంటే వినియోగదారులు నాలుగేళ్లలో వడ్డీ కింద రూ.800 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఫైబర్ గ్రిడ్ కనెక్షన్, సెట్‌టాప్ బాక్సు రెండూ తీసుకుంటే కనెక్షన్‌కు రూ.148తో పాటు బాక్సు ఖరీదు కింద రూ.100 చొప్పున ప్రతి నెలా మొత్తం రూ. 248 వంతున వినియోగదారులు చెల్లించాలి. అయితే ఫైబర్ గ్రిడ్ కనెక్షన్లు తీసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపడం లేదని ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులోనే తేలింది. దీంతో టార్గెట్ పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా జిల్లాకు ఒకరు చొప్పున 13 మంది సీనియర్ మేనేజర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించడం కొసమెరుపు.
నాసిరకం బాక్సులు..
చైనా నుంచి నాసిరకం సెట్‌టాప్ బాక్సులను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఈ విషయాన్ని కొద్ది నెలల క్రితం చెన్నై పోర్టులో తనిఖీల సందర్భంగా సెంట్రల్ ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా ధృవీకరించారు. ఎక్సైజ్ సుంకం చెల్లించకుండా దిగుమతి చేసుకున్న సెట్‌టాప్ బాక్సులను చెన్నై పోర్టులో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి తయారీలో నాణ్యతా ప్రమాణాలను పాటించలేదని నిర్ధారించారు. దీంతో కేసుల భయంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్లోనూ ఆందోళన వ్యక్తమైంది. అప్పటికీ టీడీపీ కేంద్రం ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగుతుండటంతో వ్యవహారం సద్దుమణిగింది.
దోపిడీ ఎలా అంటే...?
మార్కెట్‌లో నాణ్యమైన సెట్‌టాప్ బాక్సులు ఒక్కోటి రూ.1,200 – రూ.1,500కే దొరుకుతున్నాయి. ఇంకా నాణ్యమైన వాటి విలువ రూ.2 వేల వరకు ఉంటుందని లెక్క వేసినా కోటి సెట్‌టాప్ బాక్సుల కొనుగోలు, సరఫరాకు రూ.2000 కోట్ల దాకా వ్యయం అవుతుంది. నిజానికి వీటిని పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తే ఇంకా తక్కువ ధరకే లభిస్తాయి. అయితే ప్రభుత్వ పెద్దలు దేశంలో సెట్‌టాప్ బాక్సులు కొనుగోలు చేయకుండా చైనా నుంచి దిగుమతి చేసుకోవాలని నిర్ణయించి ఒక్కోటి రూ.4,000 చొప్పున కొంటున్నారు. కేవలం రూ.2 వేల లోపే దొరికే సెట్‌టాప్ బాక్సులకు రూ.4 వేల చొప్పున చెల్లిస్తూ దోపిడీకి మార్గం సుగమం చేసుకున్నారు. అంటే కోటి సెట్‌టాప్ బాక్సుల కొనుగోళ్లలో రూ.2,000 కోట్ల అక్రమార్జనకు స్కెచ్ వేసినట్లు తేటతెల్లం అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment