పడమటి మండలాల గోడు పట్టదా?
► రెండు నియోజకవర్గాలకే పరిమితమైన
► ఎన్‌టీఆర్ జలసిరి కరువుకోరల్లో ఉన్నా పడమటి మండలాలను పట్టించుకోని అధికారులు
► రెండు వందల అడుగులకే ప్రభుత్వ నిధులంటూ ఆంక్షలు
► జిల్లాలో వెయ్యి అడుగులు లోతు తవ్వినా నీరుపడని వైనం
ఇందిర జలప్రభ పథకాన్ని ఎన్‌టీఆర్ జలసిరిగా పేరుమార్చిన చంద్రబాబు సర్కార్ జిల్లాలోని కరువు ప్రాంతాలైన పడమటి మండలాలను గాలికొదిలేసింది. ఉచితబోరు బావుల తవ్వకాన్ని తూర్పు మండలాలైన శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లోని 9 మండలాలకే పరిమితం చేయడంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
సాక్షి, చిత్తూరు: జిల్లావ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులకు ఉచితంగా బోరుబావులు తవ్వి మోటారుతో పాటు విద్యుత్ సర్వీసును సైతం ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పింది. ఎన్‌టీఆర్ జలసిరి పథకాన్ని జిల్లావ్యాప్తంగా కాక కేవలం శ్రీకాళహస్తి, ఏర్పేడు, తొట్టంబేడు, కేవీబీపురం, బీఎన్ కండ్రిగ, పిచ్చాటూరు, నాగలాపురం, సత్యవేడు, వరదయ్యపాళెం మండలాలకే పరిమితం చేసింది. ఈ మండలాల్లో 1020 బోర్లు బావులు తవ్వాలని అధికారులు నిర్ణయించారు.
ఇక పేరుకు ఉచిత బోరుబావుల పథకమని చెప్పి రైతుకు మొక్కుబడి రాయితీ నిధులను మాత్రమే విదిల్చనున్నారు. అది కూడా కేవలం 200 అడుగులకు మాత్రమే అడుగుకు రూ.80 చొప్పున కేవలం రూ.16 వేలను ఉపాధి హామీ పథకం కింద ఇవ్వనున్నారు. దీంతోపాటు 20 మీటర్ల కేసింగ్ పైపుకు రూ.8 వేలు, కరెంట్ సరఫరాకు రూ.50 వేలు, మోటారుకు రూ.40 వేలు మాత్రమే ఇవ్వనున్నారు. ఈ లెక్కన ఒక్కొక్క బోరుబావికి రూ.1.15 లక్షల నిధులను మాత్రమే ప్రభుత్వం ఇవ్వనుంది. 1020 బోరుబావుల తవ్వకానికి రూ.12.24 కోట్లకు పైగా వెచ్చించనున్నారు.
మొక్కుబడి రాయితీ
జిల్లాలో ఒక్కొక్క బోరు బావి తవ్వకానికి రూ.4 నుంచి 5లక్షల వరకు ఖర్చు అవుతుండగా ప్రభుత్వం కేవలం రూ.1.15 లక్షలు మాత్రమే ఇస్తామని ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో గత 15 ఏళ్లుగా వర్షాలు లేక భూగర్భజలాలు అడుగంటాయి. గత నవంబర్‌లో భారీ వర్షాలు కురవడంతో పరిస్థితి కొంత మెరుగుపడింది. అయినా 200 అడుగుల లోపు బోరు బావులకు నీళ్లు పడే పరిస్థితి లేదు. ఇప్పటికీ జిల్లావ్యాప్తంగా 1000, 1500 అడుగుల వరకు బోరు బావి తవ్వితేనే నీరు పడే పరిస్థితి ఉంది. శ్రీకాళహస్తి, సత్యవేడు ప్రాంతాల్లో మాత్రమే భూగర్భ జలాలు పెరిగాయే తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఆ పరిస్థితి లేదు.
ఈ లెక్కన కనీసం వెయ్యి అడుగులైనా బోరు బావి తవ్వాల్సిందే. ప్రభుత్వం ఇస్తానన్న ప్రకారం గణించినా అడుగుకు రూ.80 చొప్పున వెయ్యి అడుగులకు రూ.80 వేల వరకు వెచ్చించాల్సిందే. ఇక బోరుబావి విద్యుత్ సరఫరా కోసం కనీసం రూ.లక్ష నుంచి 2 లక్షల వరకు వెచ్చించాల్సి వస్తోంది. ప్రభుత్వం మాత్రం రూ.50 వేలు మాత్రమే ఇస్తాననడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం రాయితీ కింద ఇచ్చే మొత్తం రైతుకు ఏమూలకు సరిపోదు. మిగిలిన మొత్తాన్ని వెచ్చించే గలిగే స్థోమత ఎస్సీ, ఎసీ, సన్న, చిన్నకారు రైతులకు లేదు. ఈ పథకం కింద ఎలాగూ జిల్లావ్యాప్తంగా మొక్కుబడిగా మాత్ర మే బోరుబావులు తవ్వుతారు కాబట్టి మొత్తం ఖర్చు ను ప్రభుత్వమే భరించాలని, దీంతో పాటు సొంతం గా బోరుబావులు తవ్ని నీరు పడక నష్టపోయిన రైతులకు బీమా సౌకర్యం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఉచిత బోర్ల కోసం పచ్చచొక్కాల పాకులాట
ఎన్టీఆర్ జలసిరి కింద ప్రభుత్వం ఉచిత బోరుబావుల తవ్వకానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో బోరుబావులను సొంతం చేసుకునేందుకు పచ్చచొక్క నేతలు రంగం సిద్ధం చేశారు. వాస్తవంగా ఈ పథకానికి అర్హులైన ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్నకారు రైతులను ఎంపిక చేయాల్సి ఉంది. ఈ పథకాన్ని ఆయా మండలాల ఎంపీడీవో, తహశీల్దారు, అగ్రికల్చర్ ఏవో, ఉపాదిహామీ ఏపీవో, ఇరిగేషన్ ఏఈ తదితరుల కమిటీ పర్యవేక్షించనుంది. ఆ తరువాత జిల్లా కలెక్టర్ అధ్యక్షతన డ్వామా పీడీ, నీటిపారుదల శాఖ ఎస్‌ఈ, గ్రౌండ్‌వాటర్ డీడీ, వ్యవసాయశాఖ జేడీ, ఏపీఎస్‌ఐడీసీ అధికారుల కమిటీ బోరుబావుల తవ్వే రైతుల జాబితాలను ఎంపిక చేయాల్సి ఉంది. అయితే అధికార పార్టీ నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చి ఇప్పటికే పచ్చపార్టీ కార్యకర్తలను ఎంపిక చేసినట్లు సమాచారం. అర్హులైన ఎస్సీ,ఎస్టీ, పేద, బలహీన వర్గాల కోసమే ఎన్టీఆర్ జలసిరి ఫేజ్ -2 పేరుకు ప్రకటించినా అర్హులైన వారికి అందే పరిస్థితి కనిపించడం లేదు.