NTR jalasiri
-
బోరేసి.. దోచేయ్
జలసిరి పథకం టెండర్లలో కాంట్రాక్టర్ల కుమ్మక్కు అధిక ధరతో టెండర్లు రూ. 225 కోట్ల దోపిడీకి వ్యూహం టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజాధనం దోపిడీ విచ్చలవిడిగా సాగుతోంది. అధికారపార్టీ నేతలు, అనుచరులు వారిస్థాయిలో ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. ఇందుకు అధికారులు కూడా సహకారం అందిస్తుండడంతో వీరి పని సులభంగా జరుగుతోంది. జిల్లాలో ఎన్టీఆర్ జలసిరి కింద బోర్లు వేసేందుకు ఇటీవల డ్వామా అధికారులు టెండర్లు నిర్వహించారు. ఇందులో కాంట్రాక్టర్లు కుమ్మక్కై అధిక ధరకు కోట్‌చేసి సుమారు రూ.225 కోట్లు నొక్కేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఉదయగిరి: నెల్లూరు జిల్లాలో ఎన్టీఆర్ జలసిరి కింద ఈ ఏడాది 15500 బోర్లు వేసి మోటార్లు బిగించాలని నిర్ణయించారు. ఒక్కొక్క యూనిట్ ధర రూ.1.20 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో బోరు కోసం రూ.28 వేలు, మోటారు కోసం రూ.55 వేలు, విద్యుత్ సదుపాయం కోసం మరో రూ.50 వేలు కేటాయించారు. ఇందులో ఎస్సీ ఎస్టీలకయితే లబ్ధిదారుడు మొత్తం యూనిట్ ధరలో ఐదు శాతం, బీసీ, ఓసీలయితే 25 శాతం, తమ వాటాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వీటికి బోర్లు వేసేందుకు రిగ్గు ఓనర్లను టెండర్లు పిలిచింది. ఈ టెండర్లు 18 మంది దక్కించుకున్నారు. ఈ టెండర్లలో బోరు తవ్వకానికి మీటరుకు రూ.325, కేసింగ్‌కు రూ.750 కనిష్టంగా కోట్ చేశారు. అధికారులు ఈ ధరనే ఫైనల్ చేశారు. అయితే ప్రస్తుతం జిల్లాలో బోరు వేసేందుకు మీటరుకు రూ.200, కేసింగ్‌కు రూ.350 రిగ్గు ఓనర్లు తీసుకుంటున్నారు. ఒక్కొక్క బోరు 60 మీటర్లు తవ్వాలి. అలాగే కేసింగు 18 మీటర్లు వేయాలి. అంటే బోరు తవ్వకానికి మీటరుకు రూ.120, కేసింగ్‌కు మీటరుకు రూ.400 కాంట్రాక్టరుకు మిగులుతుంది. ప్రస్తుతం మార్కెట్లో నడుస్తున్న ధరకు, కాంట్రాక్టర్లు దక్కించుకున్న టెండరు ధరకు పోలిస్తే ఒక్కో బోరుకు రూ.14,800 మిగులుతుంది. అంటే జిల్లాలో వేస్తున్న 15,500 బోర్లకు సుమారు రూ.225 కోట్లు పైగా కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళుతుంది. ఈ వ్యవహారంలో జిల్లా స్థాయి అధికారుల పాత్ర కూడా ఉందనే విమర్శలున్నాయి ఏజెంట్ల ముసుగులో కాంట్రాక్టర్ల అవతారం జిల్లాలో సుమారు ఇరవై మందికిపైగా బోరు రిగ్గింగ్ ఓనర్లు ఉన్నట్లు సమాచారం. కానీ ఈ టెండర్లలో వింజమూరుకచెందిన ఒక బోరు రిగ్గింగ్ ఓనరు మాత్రమే అవకాశం దక్కింది. మిగతా 17 మంది కేవలం ఏజెంట్లు అని విమర్శలున్నాయి. వీరికి సొంత బోరు మిషన్లు లేవు. వీరు రిగ్గింగ్ ఓనర్లతో అవగాహన కుదుర్చుకుని బోరు తవ్వకానికి మీటరుకు రూ.200 ఇస్తున్నారు. కేసింగ్ వాస్తవంగా మీటరు రూ.350 అవుతుంది. మిగతా రూ.400 కాంట్రాక్టరు జేబుల్లోకి వెళుతుంది. ఈ విధంగా గుట్టుచప్పుడు కాకుండా దోపిడీ జరుగుతోంది. రాయలసీమకంటే అధిక ధరలు సాధారణంగా రాయలసీమలో బోర్లు వేయాలంటే కష్టంతో కూడుకున్న పని. అక్కడ బోరు వేసేందుకు ఎక్కువ ఖర్చవుతుంది. మన జిల్లాలో బోర్లు వేయటం అక్కడితోపోలిస్తే సులువైన పని. ఇక్కడ పెద్దగా రాతినేలలు ఉండవు. రాయలసీమలో రాతినేలలు ఎక్కువ. కానీ అక్కడే ఒక మీటరు బోరు తవ్వకానికి రూ.260, కేసింగ్‌కు రూ.540 చొప్పున వేసేందుకు రిగ్గింగ్ ఓనర్లు ముందుకొచ్చారు. కానీ జిల్లాలో అందుకు భిన్నంగా ఏజెంట్ల రూపంలో ఉన్న కాంట్రాక్టర్లు అధిక ధరలకు కాంట్రాక్టు దక్కించుకుని కోట్లరూపాయలు స్వాహా చేస్తున్నారు. -
పడమటి మండలాల గోడు పట్టదా?
► రెండు నియోజకవర్గాలకే పరిమితమైన ► ఎన్టీఆర్ జలసిరి కరువుకోరల్లో ఉన్నా పడమటి మండలాలను పట్టించుకోని అధికారులు ► రెండు వందల అడుగులకే ప్రభుత్వ నిధులంటూ ఆంక్షలు ► జిల్లాలో వెయ్యి అడుగులు లోతు తవ్వినా నీరుపడని వైనం ఇందిర జలప్రభ పథకాన్ని ఎన్టీఆర్ జలసిరిగా పేరుమార్చిన చంద్రబాబు సర్కార్ జిల్లాలోని కరువు ప్రాంతాలైన పడమటి మండలాలను గాలికొదిలేసింది. ఉచితబోరు బావుల తవ్వకాన్ని తూర్పు మండలాలైన శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లోని 9 మండలాలకే పరిమితం చేయడంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. సాక్షి, చిత్తూరు: జిల్లావ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులకు ఉచితంగా బోరుబావులు తవ్వి మోటారుతో పాటు విద్యుత్ సర్వీసును సైతం ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పింది. ఎన్టీఆర్ జలసిరి పథకాన్ని జిల్లావ్యాప్తంగా కాక కేవలం శ్రీకాళహస్తి, ఏర్పేడు, తొట్టంబేడు, కేవీబీపురం, బీఎన్ కండ్రిగ, పిచ్చాటూరు, నాగలాపురం, సత్యవేడు, వరదయ్యపాళెం మండలాలకే పరిమితం చేసింది. ఈ మండలాల్లో 1020 బోర్లు బావులు తవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఇక పేరుకు ఉచిత బోరుబావుల పథకమని చెప్పి రైతుకు మొక్కుబడి రాయితీ నిధులను మాత్రమే విదిల్చనున్నారు. అది కూడా కేవలం 200 అడుగులకు మాత్రమే అడుగుకు రూ.80 చొప్పున కేవలం రూ.16 వేలను ఉపాధి హామీ పథకం కింద ఇవ్వనున్నారు. దీంతోపాటు 20 మీటర్ల కేసింగ్ పైపుకు రూ.8 వేలు, కరెంట్ సరఫరాకు రూ.50 వేలు, మోటారుకు రూ.40 వేలు మాత్రమే ఇవ్వనున్నారు. ఈ లెక్కన ఒక్కొక్క బోరుబావికి రూ.1.15 లక్షల నిధులను మాత్రమే ప్రభుత్వం ఇవ్వనుంది. 1020 బోరుబావుల తవ్వకానికి రూ.12.24 కోట్లకు పైగా వెచ్చించనున్నారు. మొక్కుబడి రాయితీ జిల్లాలో ఒక్కొక్క బోరు బావి తవ్వకానికి రూ.4 నుంచి 5లక్షల వరకు ఖర్చు అవుతుండగా ప్రభుత్వం కేవలం రూ.1.15 లక్షలు మాత్రమే ఇస్తామని ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో గత 15 ఏళ్లుగా వర్షాలు లేక భూగర్భజలాలు అడుగంటాయి. గత నవంబర్‌లో భారీ వర్షాలు కురవడంతో పరిస్థితి కొంత మెరుగుపడింది. అయినా 200 అడుగుల లోపు బోరు బావులకు నీళ్లు పడే పరిస్థితి లేదు. ఇప్పటికీ జిల్లావ్యాప్తంగా 1000, 1500 అడుగుల వరకు బోరు బావి తవ్వితేనే నీరు పడే పరిస్థితి ఉంది. శ్రీకాళహస్తి, సత్యవేడు ప్రాంతాల్లో మాత్రమే భూగర్భ జలాలు పెరిగాయే తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఆ పరిస్థితి లేదు. ఈ లెక్కన కనీసం వెయ్యి అడుగులైనా బోరు బావి తవ్వాల్సిందే. ప్రభుత్వం ఇస్తానన్న ప్రకారం గణించినా అడుగుకు రూ.80 చొప్పున వెయ్యి అడుగులకు రూ.80 వేల వరకు వెచ్చించాల్సిందే. ఇక బోరుబావి విద్యుత్ సరఫరా కోసం కనీసం రూ.లక్ష నుంచి 2 లక్షల వరకు వెచ్చించాల్సి వస్తోంది. ప్రభుత్వం మాత్రం రూ.50 వేలు మాత్రమే ఇస్తాననడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం రాయితీ కింద ఇచ్చే మొత్తం రైతుకు ఏమూలకు సరిపోదు. మిగిలిన మొత్తాన్ని వెచ్చించే గలిగే స్థోమత ఎస్సీ, ఎసీ, సన్న, చిన్నకారు రైతులకు లేదు. ఈ పథకం కింద ఎలాగూ జిల్లావ్యాప్తంగా మొక్కుబడిగా మాత్ర మే బోరుబావులు తవ్వుతారు కాబట్టి మొత్తం ఖర్చు ను ప్రభుత్వమే భరించాలని, దీంతో పాటు సొంతం గా బోరుబావులు తవ్ని నీరు పడక నష్టపోయిన రైతులకు బీమా సౌకర్యం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఉచిత బోర్ల కోసం పచ్చచొక్కాల పాకులాట ఎన్టీఆర్ జలసిరి కింద ప్రభుత్వం ఉచిత బోరుబావుల తవ్వకానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో బోరుబావులను సొంతం చేసుకునేందుకు పచ్చచొక్క నేతలు రంగం సిద్ధం చేశారు. వాస్తవంగా ఈ పథకానికి అర్హులైన ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్నకారు రైతులను ఎంపిక చేయాల్సి ఉంది. ఈ పథకాన్ని ఆయా మండలాల ఎంపీడీవో, తహశీల్దారు, అగ్రికల్చర్ ఏవో, ఉపాదిహామీ ఏపీవో, ఇరిగేషన్ ఏఈ తదితరుల కమిటీ పర్యవేక్షించనుంది. ఆ తరువాత జిల్లా కలెక్టర్ అధ్యక్షతన డ్వామా పీడీ, నీటిపారుదల శాఖ ఎస్ఈ, గ్రౌండ్‌వాటర్ డీడీ, వ్యవసాయశాఖ జేడీ, ఏపీఎస్ఐడీసీ అధికారుల కమిటీ బోరుబావుల తవ్వే రైతుల జాబితాలను ఎంపిక చేయాల్సి ఉంది. అయితే అధికార పార్టీ నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చి ఇప్పటికే పచ్చపార్టీ కార్యకర్తలను ఎంపిక చేసినట్లు సమాచారం. అర్హులైన ఎస్సీ,ఎస్టీ, పేద, బలహీన వర్గాల కోసమే ఎన్టీఆర్ జలసిరి ఫేజ్ -2 పేరుకు ప్రకటించినా అర్హులైన వారికి అందే పరిస్థితి కనిపించడం లేదు. -
‘జలసిరి’ని వేగవంతం చేశాం
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించిన జిల్లా కలెక్టర్ కర్నూలు(అగ్రికల్చర్) : జిల్లాలో ఎన్టీఆర్ జలసిరి-2 పథకం కింద బోర్లు వేసే కార్యక్రమాన్ని వేగవంతం చేసినట్లు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయడుకు వివరించారు. ముఖ్యమంత్రి బుధవారం విజయవాడ నుంచి ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కర్నూలు నుంచి కలెక్టర్ విజయమోహన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జలసిరి పథకం కింద జిల్లాకు 10223 బోర్లు మంజూరయ్యాయన్నారు. వీటికి అర్హులైన రైతులను గుర్తించే పనులను వేగవంతం చేసినట్లు వివరించారు. గతంలో మూడువేల చెక్‌డ్యామ్‌లకు మరమ్మతులు చేయించామన్నారు. దీంతో తాగునీటి సమస్యలను తీర్చగలుగుతున్నామని వివరించారు. జిల్లాలో నెలకొన్న నీటి సమస్యలను తీర్చేందుకు మెటీరియల్ కాంపోనెంటు కింద ఎక్కువ నిధులు వ్యయం చేసినట్లు వివరించారు. 11 వేల ఫాంపాండ్స్ పనులను చేపట్టామన్నారు. రానున్న ఐదునెలల్లో లక్ష ఫాంపాండ్స్ తవ్విస్తామని తెలిపారు. విజయవాడ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ప్రతి అధికారి అందుబాటులో ఉన్న నిధులను సద్వినియోగం చేసుకొని, స్థానిక వనరులను గుర్తించి ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల్లో పనులు చేపట్టాలని కోరారు. గ్రామ పంచాయతీల్లో సీసీ రోడ్లు, వ్యక్తిగత మరుగు దొడ్లు, నీరు-చెట్టు అమలు, నీటి సంరక్షణ పనులు తదితర వాటిపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కర్నూలు నుంచి కలెక్టర్‌తో పాటు పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ జొవహర్రెడ్డి, జేసీ హరికిరణ్, డీ ఆర్ఓ గంగాధర్‌గౌడ్, సీపీఓ ఆనంద్‌నాయక్, డ్వామా పీడీ పుల్లారెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు పాల్గొన్నారు.