‘జలసిరి’ని వేగవంతం చేశాం
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించిన జిల్లా కలెక్టర్
కర్నూలు(అగ్రికల్చర్) : జిల్లాలో ఎన్టీఆర్ జలసిరి-2 పథకం కింద బోర్లు వేసే కార్యక్రమాన్ని వేగవంతం చేసినట్లు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయడుకు వివరించారు. ముఖ్యమంత్రి బుధవారం విజయవాడ నుంచి ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కర్నూలు నుంచి కలెక్టర్ విజయమోహన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జలసిరి పథకం కింద జిల్లాకు 10223 బోర్లు మంజూరయ్యాయన్నారు. వీటికి అర్హులైన రైతులను గుర్తించే పనులను వేగవంతం చేసినట్లు వివరించారు. గతంలో మూడువేల చెక్‌డ్యామ్‌లకు మరమ్మతులు చేయించామన్నారు. దీంతో తాగునీటి సమస్యలను తీర్చగలుగుతున్నామని వివరించారు. జిల్లాలో నెలకొన్న నీటి సమస్యలను తీర్చేందుకు మెటీరియల్ కాంపోనెంటు కింద ఎక్కువ నిధులు వ్యయం చేసినట్లు వివరించారు.
11 వేల ఫాంపాండ్స్ పనులను చేపట్టామన్నారు. రానున్న ఐదునెలల్లో లక్ష ఫాంపాండ్స్ తవ్విస్తామని తెలిపారు. విజయవాడ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ప్రతి అధికారి అందుబాటులో ఉన్న నిధులను సద్వినియోగం చేసుకొని, స్థానిక వనరులను గుర్తించి ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల్లో పనులు చేపట్టాలని కోరారు. గ్రామ పంచాయతీల్లో సీసీ రోడ్లు, వ్యక్తిగత మరుగు దొడ్లు, నీరు-చెట్టు అమలు, నీటి సంరక్షణ పనులు తదితర వాటిపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కర్నూలు నుంచి కలెక్టర్‌తో పాటు పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ జొవహర్‌రెడ్డి, జేసీ హరికిరణ్, డీ ఆర్‌ఓ గంగాధర్‌గౌడ్, సీపీఓ ఆనంద్‌నాయక్, డ్వామా పీడీ పుల్లారెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు పాల్గొన్నారు.