ఖరీఫ్‌లో నీటి కష్టాలు
=పాడైన నిర్మాణాలు
=రైతులకు సాగునీటి కష్టాలు
=నిరుపయోగంగా నిధులు
=ఎస్ఎంఐ శాఖ నిర్లక్ష్యం
ఖరీఫ్‌లో నీటి కష్టాలు ఎలాగూ తప్పలేదు. కనీసం రబీలోనైనా సమస్య ఉండబోదనుకున్న గిరిజన రైతుల ఆశలు అడియాసలయ్యాయి. ఏజెన్సీలో నిర్మించిన చెక్‌డ్యాంలు శిథిలం కావడంతో వేలాది ఎకరాల్లోని భూములకు సాగునీరందక గిరిజన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవి మొదలైతే పరిస్థితి ఏవిధంగా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.
పాడేరు/అరకులోయ, న్యూస్‌లైన్: ఖరీఫ్ ముగిసిపోవడంతో ఇప్పటికే కొన్ని గ్రామాల గిరిజన రైతులు రబీ సాగుపై దృష్టి కేంద్రీక రించారు. చెక్‌డ్యామ్‌లు పాడైపోవడంతో లబోదిబోమంటున్నారు. పాడేరు డివి జన్‌లోని 11 మండలాల పరిధిలో 615 చెక్‌డ్యాంలు ఉన్నాయి. వీటిలో 476 ప్రస్తుతం మరమ్మతులకు గురయ్యాయి.139 చెక్‌డ్యాంలు మాత్రమే సాగునీటిని అందిస్తున్నాయి. వీటిలో బూదరాళ్ల, తాబేలుగుమ్మి చెక్‌డ్యాంలు పెద్దవిగా గుర్తింపు పొందాయి. ఇవి కూడా శిథిల దశకు చేరుకున్నాయి.
మరికొన్ని పూడిక పేరుకుపోయి ప్రధాన కాల్వలు కూడా పాడయిపోయాయి.146 ఎన్ఆరీఈజీఎస్, 150 ట్రైబల్ సబ్‌ప్లాన్, 180 పునరుద్ధరణ పథకం కింద మరమ్మతులకు అధికారులు ప్రతిపాదనలు పంపినప్పటికీ నిధులు మంజూరు కాలేదు. దీంతో ఈ చెక్‌డ్యాంల పరిధిలోని వేలాది ఎకరాల భూములకు సాగునీరు అందడం లేదు. అలాగే కొత్తగా చెక్‌డ్యాంల నిర్మాణానికి ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం వద్ద ఉన్నాయి.
నిధులు మాత్రం మంజూరు కావడం లేదు. మంజూరైన నిధులను వినియోగంలోకి తీసుకురావడంలో ఎస్ఎంఐ శాఖ అధికారుల నిర్లక్ష్యం కూడా రైతులకు శాపంగా మారింది. శిథిలమైన చెక్‌డ్యాంలకు మరమ్మతు చేసి,అవసరమైన చోట కొత్త వాటిని నిర్మించేందుకు అరకులోయ అసెంబీ నియోజక వర్గం పరిధిలోని అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ,హుకుంపేట,పెదబయలు, ముంచంగిపుట్ మండలాల్లోని చెక్‌డ్యాంల మరమ్మతుకు రెండేళ్ల క్రితం ప్రభుత్వం సుమారు రూ.3 కోట్లు మంజూరు చేసింది.
ఎస్ఎంఐ శాఖ అధికారులు కొన్ని గ్రామాల్లో పనులు ప్రారంభించారు. తర్వాత ఈ పనులు ఏమయ్యాయో తెలియడం లేదు. అరకులోయ మండలంలో సుమారు 65 చెక్ డ్యాంలు ఉండగా,ఏ చెక్‌డ్యాం కూడా పూర్తిస్థాయిలో వినియోగంలోకి లేదు. వర్షపు నీరు కూడా నిల్వ ఉండడానికి వీలులేని పరిస్థితిలో ఇవి ఉన్నాయని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీలం తుఫాన్ సమయంలో కొండల పైనుంచి భారీగా వరద నీరు వచ్చినా నిల్వ చేసుకోలేక పోయామని అంటున్నారు. రబీ రైతుల మేలు కోసం చెక్‌డ్యాంలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.