బోరేసి.. దోచేయ్
Published Mon, Aug 15 2016 3:37 PM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM
జలసిరి పథకం
టెండర్లలో కాంట్రాక్టర్ల కుమ్మక్కు
అధిక ధరతో టెండర్లు
రూ. 225 కోట్ల దోపిడీకి వ్యూహం
టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజాధనం దోపిడీ విచ్చలవిడిగా సాగుతోంది. అధికారపార్టీ నేతలు, అనుచరులు వారిస్థాయిలో ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. ఇందుకు అధికారులు కూడా సహకారం అందిస్తుండడంతో వీరి పని సులభంగా జరుగుతోంది. జిల్లాలో ఎన్టీఆర్ జలసిరి కింద బోర్లు వేసేందుకు ఇటీవల డ్వామా అధికారులు టెండర్లు నిర్వహించారు. ఇందులో కాంట్రాక్టర్లు కుమ్మక్కై అధిక ధరకు కోట్‌చేసి సుమారు రూ.225 కోట్లు నొక్కేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
ఉదయగిరి: నెల్లూరు జిల్లాలో ఎన్టీఆర్ జలసిరి కింద ఈ ఏడాది 15500 బోర్లు వేసి మోటార్లు బిగించాలని నిర్ణయించారు. ఒక్కొక్క యూనిట్ ధర రూ.1.20 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో బోరు కోసం రూ.28 వేలు, మోటారు కోసం రూ.55 వేలు, విద్యుత్ సదుపాయం కోసం మరో రూ.50 వేలు కేటాయించారు. ఇందులో ఎస్సీ ఎస్టీలకయితే లబ్ధిదారుడు మొత్తం యూనిట్ ధరలో ఐదు శాతం, బీసీ, ఓసీలయితే 25 శాతం, తమ వాటాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వీటికి బోర్లు వేసేందుకు రిగ్గు ఓనర్లను టెండర్లు పిలిచింది. ఈ టెండర్లు 18 మంది దక్కించుకున్నారు. ఈ టెండర్లలో బోరు తవ్వకానికి మీటరుకు రూ.325, కేసింగ్‌కు రూ.750 కనిష్టంగా కోట్ చేశారు. అధికారులు ఈ ధరనే ఫైనల్ చేశారు.
అయితే ప్రస్తుతం జిల్లాలో బోరు వేసేందుకు మీటరుకు రూ.200, కేసింగ్‌కు రూ.350 రిగ్గు ఓనర్లు తీసుకుంటున్నారు. ఒక్కొక్క బోరు 60 మీటర్లు తవ్వాలి. అలాగే కేసింగు 18 మీటర్లు వేయాలి. అంటే బోరు తవ్వకానికి మీటరుకు రూ.120, కేసింగ్‌కు మీటరుకు రూ.400 కాంట్రాక్టరుకు మిగులుతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో నడుస్తున్న ధరకు, కాంట్రాక్టర్లు దక్కించుకున్న టెండరు ధరకు పోలిస్తే ఒక్కో బోరుకు రూ.14,800 మిగులుతుంది. అంటే జిల్లాలో వేస్తున్న 15,500 బోర్లకు సుమారు రూ.225 కోట్లు పైగా కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళుతుంది. ఈ వ్యవహారంలో జిల్లా స్థాయి అధికారుల పాత్ర కూడా ఉందనే విమర్శలున్నాయి
ఏజెంట్ల ముసుగులో కాంట్రాక్టర్ల అవతారం
జిల్లాలో సుమారు ఇరవై మందికిపైగా బోరు రిగ్గింగ్ ఓనర్లు ఉన్నట్లు సమాచారం. కానీ ఈ టెండర్లలో వింజమూరుకచెందిన ఒక బోరు రిగ్గింగ్ ఓనరు మాత్రమే అవకాశం దక్కింది. మిగతా 17 మంది కేవలం ఏజెంట్లు అని విమర్శలున్నాయి. వీరికి సొంత బోరు మిషన్లు లేవు. వీరు రిగ్గింగ్ ఓనర్లతో అవగాహన కుదుర్చుకుని బోరు తవ్వకానికి మీటరుకు రూ.200 ఇస్తున్నారు. కేసింగ్ వాస్తవంగా మీటరు రూ.350 అవుతుంది. మిగతా రూ.400 కాంట్రాక్టరు జేబుల్లోకి వెళుతుంది. ఈ విధంగా గుట్టుచప్పుడు కాకుండా దోపిడీ జరుగుతోంది.
రాయలసీమకంటే అధిక ధరలు
సాధారణంగా రాయలసీమలో బోర్లు వేయాలంటే కష్టంతో కూడుకున్న పని. అక్కడ బోరు వేసేందుకు ఎక్కువ ఖర్చవుతుంది. మన జిల్లాలో బోర్లు వేయటం అక్కడితోపోలిస్తే సులువైన పని. ఇక్కడ పెద్దగా రాతినేలలు ఉండవు. రాయలసీమలో రాతినేలలు ఎక్కువ. కానీ అక్కడే ఒక మీటరు బోరు తవ్వకానికి రూ.260, కేసింగ్‌కు రూ.540 చొప్పున వేసేందుకు రిగ్గింగ్ ఓనర్లు ముందుకొచ్చారు. కానీ జిల్లాలో అందుకు భిన్నంగా ఏజెంట్ల రూపంలో ఉన్న కాంట్రాక్టర్లు అధిక ధరలకు కాంట్రాక్టు దక్కించుకుని కోట్లరూపాయలు స్వాహా చేస్తున్నారు.
Advertisement
Advertisement