![రెండో టోక్యోగా అమరావతి - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/61464037492_625x300.jpg.webp?itok=MQ9D3_6-)
రెండో టోక్యోగా అమరావతి
- రాజధానిని నిర్మించే బాధ్యత తీసుకోవాలి
- జపాన్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు
సాక్షి, విజయవాడ: జపాన్ కంపెనీలు టోక్యోను మొదటి ఇల్లుగాను, అమరావతిని రెండో ఇల్లుగానూ పరిగణించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. జపాన్ ఆర్థిక, వాణిజ్య మంత్రి యసూకి టకాగి నాయకత్వంలో 80 మంది ప్రతినిధుల బృందం సోమవారం నగరానికి వచ్చింది. విజయవాడ గేట్‌వే హోటల్‌లో ఈ బృందంతో ముఖ్యమంత్రి సమావేశమై మాట్లాడుతూ.. సాంకేతిక విషయాల్లో ఎంతో ముందంజలో ఉన్న జపాన్ నుంచి ఆంధ్రప్రదేశ్ నేర్చుకునే దశలో ఉందన్నారు. టోక్యో మాదిరి అమరావతి అభివృద్ధి చెందేందుకు జపాన్ వాణిజ్య సంస్థలు సహకరించాలని కోరారు. అమరావతి నిర్మాణంలోనూ బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో అమరావతి నుంచి టోక్యోకు నేరుగా విమానాలు నడుపుతామని చెప్పారు. ఈ సందర్భంగా జపాన్ కంపెనీలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చాయి. సార్ట్ గ్రిడ్ ఫీడర్ మేనేజ్‌మెంట్ , స్మార్ట్ గ్రిడ్ మీటర్స్ మేనేజ్‌మెంట్ రెన్యువవబుల్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ అంశాలపై పనిచేసేందుకు ప్యూజీ ఎలక్ట్రిక్ కంపెనీ ముందుకు వచ్చింది.
జపాన్ కంపెనీలకు సీఎం హామీల జోరు
నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు పలు జపాన్ కంపెనీలు ముందుకు వాటికి కావాల్సిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చారు. స్మార్ట్ సిటీ నిర్మాణం, ఎనర్జీ మేనేజ్‌మెంట్‌లలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు హిటాచీ కంపెనీ ఆసక్తి కనబరచగా.. ఏపీలో ఇప్పటికే ఎల్‌ఈడీ బల్బులు, ఎనర్జీసేవింగ్ పంపుసెట్లు అందించామని కొత్త ఆలోచనలతో ముందుకు వస్తే పూర్తిగా సహకరిస్తామని చెప్పారు.
నాణ్యమైన ఉత్పత్తులు లేకే ఆదరణ కరువు
రాష్ట్రంలో పండ్ల ఉత్పత్తిలో నాణ్యత లేకపోవడం, తక్కువ దిగుబడి కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ఆదరణ పొందలేకపోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడ లయోలా కళాశాల ప్రాంగణంలో హార్టికల్చర్ షో, మ్యాంగో ఫెస్టివల్-2016ను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. నాణ్యతతో కూడిన ఉత్తమ ఉద్యాన పంటలను రైతు నుంచి మార్కెట్ స్థాయి వరకు చేరవేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.
నేడు అస్సాంకు చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం అస్సాంకు వెళ్లనున్నారు. అక్కడ ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా సోనోవాల్ పదవీ స్వీకారంలో పాల్గొననున్నారు. ఉదయం ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం ఒంటిగంటకు గువాహటి చేరుకుంటారు. ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న అనంతరం రాత్రికి విజయవాడ చేరుకుంటారు.