కుచేలులకే కష్టాలు
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి
గుంటూరు (పట్నంబజారు): నోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో నల్ల కుబేరులంతా బాగానే ఉన్నారని, ప్రజలు మాత్రం కుచేలుడిలా ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులోని ఓ హోటల్‌లో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ నిర్ణయం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అర్థ కాని పరిస్థితులు ఉన్నాయన్నారు. నల్లధనం వెలికతీతకు తాము వ్యతిరేకం కాదన్నారు. అయితే సామాన్యులు పడుతున్న ఇబ్బందులపై దృష్టి సారించాలని చెప్పారు. సీఎం చంద్రబాబు, ఆయన పక్కనే ఉన్న నల్ల కుబేరులపై కేంద్రం ఎందుకు దృష్టి పెట్టడంలేదని ఈ సందర్భంగా అంబటి ప్రశ్నించారు. అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు వారి నియోజకవర్గాల్లో కార్యకర్తలకు రూ.10 నుంచి రూ.20 లక్షల వరకు పెద్ద నోట్లు ఇచ్చి మార్చాలని ఆదేశాలిచ్చారని తెలుస్తోందన్నారు. నోట్లు మార్చే పనిలో మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, స్పీకర్ కోడెల శివప్రసాదరావు, చంద్రబాబు, లోకేశ్ తాబేదార్లు ఉన్నారని ఆరోపించారు.
బాబు లేఖ వెనుక మర్మమిదేనా..?
ప్రధాని నిర్ణయం ముందస్తుగా తెలిసి ఆయన ప్రకటనకు ముందే కొంతమంది పెద్ద నోట్లు మార్చుకున్నారని, చంద్రబాబు కూడా అందుకే లేఖ రాశారనే వార్తలు వినవస్తున్నాయన్నారు. తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డబ్బును మడిగెలపై దాచారని మంత్రి దేవినేని ఉమా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. నల్లధనంపై తాను లేఖ రాస్తేనే పెద్ద నోట్లు రద్దు చేసినట్టు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. మంత్రి రావెల కిషోర్‌బాబు కొన్న భూములు వైటా..లేక బ్లాకా అని ప్రశ్నించారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, మురళీమోహన్, కావూరి సాంబశివరావు నల్లకుబేరులు కాదని చెప్పే దమ్ము టీడీపీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు.