కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం పంచుకుంటూ బీజేపీతో చెట్టాపట్టాలేసి నడుస్తున్న తెలుగుదేశం నాయకులు రాష్ట్రంలో విపక్షంపై అర్థంలేని ఆరోపణలు చేస్తూ ఆశ్చర్యకరంగా మాట్లాడుతున్నారని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు.
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం పంచుకుంటూ బీజేపీతో చెట్టాపట్టాలేసి నడుస్తున్న తెలుగుదేశం నాయకులు రాష్ట్రంలో విపక్షంపై అర్థంలేని ఆరోపణలు చేస్తూ ఆశ్చర్యకరంగా మాట్లాడుతున్నారని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో, ముఖ్యంగా రాజధానికి నిధుల విషయంలో అన్యాయం చేసినా విపక్షనేత జగన్మోహన్‌రెడ్డి విమర్శించలేదని తెలుగుదేశం నేతలు ఆరోపించడాన్ని ఆయన తప్పుబట్టారు. అక్కడి బీజేపీ ప్రభుత్వంలో టీడీపీ, ఇక్కడి టీడీపీ ప్రభుత్వంలో బీజేపీ భాగం పంచుకుంటూ కూడా ఒకర్నొకరు పల్లెత్తు మాటనుకోకుండా నాటకాలాడుతున్నది వారేనని ఒక ప్రకటనలో రాంబాబు నిశితంగా విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా అధికారంలో ఉండీ నోరుమెదపకుండా ఉన్న వారే నిస్సిగ్గుగా విపక్షాన్ని విమర్శిస్తున్నారని నిందించారు.
బడ్జెట్ వెలువడిన వెంటనే పార్టీ సీనియర్ నాయకుడు సోమయాజులు కేంద్ర ప్రభుత్వాన్ని నిశితంగా విమర్శించారని, అది పార్టీ అధినేత అభిప్రాయం కాకుండా పోతుందా అని ఆయన గుర్తు చేశారు. అంతెందుకు, కేంద్ర బడ్జెట్ తీవ్రంగా నిరాశపరిచిందని తాజాగా మంగళవారం రాజధాని ప్రాంతంలో పర్యటిస్తూ కూడా పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి విమర్శించిన విషయం ఈ నాయకుల మెదళ్లకెక్కదా? అని కూడా ఆయన ప్రశ్నించారు.