రైతు వ్యతిరేక విధానాల వల్లే..
సీఎం సభలో రైతు
ఆత్మహత్యాయత్నంపై
వైఎస్సార్‌సీపీ నేత అంబటి విమర్శ
హైదరాబాద్: సాక్షాత్తు సీఎం చంద్రబాబు పాల్గొన్న బహిరంగ సభలోనే రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు అనుసరించిన విధానాలే ఇందుకు కారణమని ఆరోపించింది. పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. విజయనగరం జిల్లాలో చంద్రబాబు పాల్గొన్న బహిరంగ సభలో రాము అనే రైతు విషం తాగి ఆత్మహత్యాయత్నం చేస్తే.. ముఖ్యమంత్రి ‘అక్కడేమీ లేదు.. కూర్చొండి’ అంటూ సభికులకు సూచించడం శోచనీయమని రాంబాబు అన్నారు. తన వెంట ఉండే అంబులెన్స్ ద్వారానైనా వైద్య సదుపాయం కల్పించలేదని దుయ్యబట్టారు. రైతు ఆత్మహత్యాయత్నంపై చంద్రబాబు, టీడీపీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు.
రాజకీయం చేస్తే విమర్శిస్తాం..
ఖాకీ దుస్తుల ముసుగులో రాజకీయం చేసే వారిని, చంద్రబాబుకు ఊడిగం చేసే పోలీసు అధికారులను ప్రతిపక్షమైన వైఎస్సార్‌సీపీ విమర్శిస్తూనే ఉంటుందని అంబటి చెప్పారు. డీజీపీనుద్దేశించి తమ పార్టీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం నేతలు మోతాదు మించి మాట్లాడారన్నారు. పోలీసు వ్యవస్థను జగన్ ఎక్కడా కించపరచడంగానీ, విశ్వాసం సన్నగిలేలా మాట్లాడటంగానీ చేయలేదన్నారు.