అమరావతిలో అంబేడ్కర్ స్మృతివనం
20 ఎకరాల్లో రూ. 98 కోట్లతో 125 అడుగుల విగ్రహం
సాక్షి, అమరావతి బ్యూరో/అమరావతి: రాజధాని అమరావతిలోడాక్టర్ అంబేడ్కర్ స్మృతివనం నిర్మాణానికి సీఎం చంద్రబాబు శుక్రవారం భూమిపూజ చేశారు. అంబేడ్కర్ 126వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సచివాలయం సమీపంలోని శాఖమూరు రెవెన్యూ పరిధిలోని 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న అంబేడ్కర్ స్మృతి వనానికి రూ. 98 కోట్లు ఖర్చుచేయనున్నట్లు సీఎం ప్రకటించారు.
ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. బౌద్ధమత ఆచార సంప్రదాయాలతో అంబేడ్కర్ జన్మస్థలం మౌని గ్రామంతో పాటు ఢిల్లీలోని పార్లమెంట్, మరో పది బౌద్ధారామాల నుంచి తీసుకొచ్చిన మట్టి, నీటితో స్మృతివనం నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. సభ ప్రారంభానికి ముందు టెక్ మహీంద్ర కంపెనీతో స్కిల్ డెవలప్‌మెంట్‌పై అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు.
నా రుణమాఫీ జరగలేదు: ‘రెండో విడత రుణమాఫీ జరగలేదు. నా భూమి సమస్యపై సీఎంకు ఐదుసార్లు వినతి చేసినా నా సమస్య తీరలేదు. ప్రకాశం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు ఎన్నికల సమయంలో ఇచ్చిన రోడ్డు హామీ పట్టించుకోలేదు’... సీఎం స్వయంగా చదవి వినిపించిన అంశాలివి. ‘కనెక్ట్ ఏపీ సీఎం’ యాప్ ప్రారంభం సందర్భంగా శుక్రవారం ‘కైజాలా’ యాప్‌కు వచ్చిన పోస్టింగ్‌ల్లో కొన్నింటిని చదివి వినిపించారు. ‘కనెక్ట్ ఏపీ సీఎం’ యాప్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.