
శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల్లో గోల్డా...రోల్డేనా...?
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి దేవస్థానానికి చెందిన ఆభరణాలు భారతీయస్టేట్ బ్యాంకు లాకర్లలో ఏళ్ల తరబడి మగ్గుతున్నాయి. కనీసం బ్రహ్మోత్సవాల్లోనైనా పాతకాలం నాటి హారాలు, బంగారు కిరీటాలు, పాదాలు, కర్ణాలు, పెద్ద పెద్ద హారాలు, పచ్చలు పొదిగిన నగలు, చేతి కడియాలు తదితర స్వర్ణాభరణాలు కనువిందు చేస్తాయని భక్తులు నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నారు.
అయితే ప్రతిఏటా.. ఈ ఏడాది భద్రతా ఇబ్బందులున్నాయి...వచ్చే ఏడాది బంగారు నగలు తప్పక అలంకరిస్తాం.....అంటూ ఉత్సవాల నాటి ఈవోలు కాలంగడిపేస్తు వెళ్లిపోతున్నారు. భక్తులు ప్రశ్నించేందుకు వచ్చే ఏడాది ఆ ఈవోలు ఉండడంలేదు...(వరుసగా రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించిన ఈవోలు లేరు..) బదిలీపై వెళ్లిపోతున్నారు. దీంతో ఏటా గిల్టు నగలతోనే ఉత్సవాలు ముగిస్తున్నారు. భక్తులు మాత్రం తీవ్రమైన నిరాస చెందుతున్నారు. ఈ ఏడాది ఈవో కార్యాలయంలో జరిగిన పలు సమావేశాల్లో పలువురు పుర పెద్దలు బ్రహ్మోత్సవాల్లో బంగారు నగలు స్వామి, అమ్మవార్లకు అలంకరించి ఊరేగింపు చేయాలని విన్నవించారు. ఉత్సవమూర్తులను స్వర్ణాలంకారణతో దర్శించే భాగ్యం భక్తులకు కల్పించాలని కోరారు. ఈసారైనా ఆ అదృష్టం లభిస్తుందో.. లేదో? వేచిచూడాల్సి ఉంది.
’ అదిభిక్షువు వాడినేమి కోరేది... బూడిదిచ్చేవాడినేమి అడిగేది...అంటూ ఒక సినీ కవి పరమశివుడ్ని భిక్షువుతో పోల్చాడు. అయితే శ్రీకాళహస్తీశ్వరుడు ఆది నుంచి భిక్షువు కాదు. రాజులు, జమీందారులు ఆయనకు అపురూపమైన దివ్యాభరణాలను కానుకగా ఇచ్చారు. విజయనగరాధీశుడు శ్రీకృష్ణదేవరాయలు కూడా వాయులింగేశ్వరునికి ఆభరణాలు కానుకగా ఇచ్చారు. శ్రీకాళహస్తి రాజు సుమారు 14వేల ఎకరాల కైలాసగిరులను ఇచ్చారు. అయితే ఆనాటి ఆభరణాలు ఇప్పటికీ చెక్కచెదరకుండా ఉన్నాయి. దేవస్థానం చేయించిన వజ్రకిరీటంతో పాటు కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్థనరెడ్డి కుటుంబీకులు స్వామి, అమ్మవార్లకు ఇచ్చిన ఆభరణాలు కూడా ఉన్నాయి. టీటీడీకి తప్ప జిల్లాలోని మిగిలిన ఏ ఆలయాలకు ఈ స్థాయిలో ఆభరణాలు లేవు. అయినా భక్తులు వాటిని దర్శించే భాగ్యం కలగడంలేదు.
అభరణాలు వాడకంపై నిర్ణయం తీసుకోలేదు...
బ్రహ్మోత్సవాల్లో ఉత్సవమూర్తులకు ఆలయ బంగారు ఆభరణాలు అలంకరిండంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. గతంలో భద్రతా ఇబ్బందులతో అలంకరించలేదని తెలుస్తోంది. పలువురు పుర పెద్దలు బంగారు నగలు ఉత్సవాల్లో వినియోగించాలని సూచించిన మాట వాస్తవమే. భద్రతాధికారులతో మరోసారి బంగారు అభరణాలపై చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం. -రామిరెడ్డ్డి,ఆలయ ఈవో