ఆశావహులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. ఇక ప్రతి వార్డులో ఎన్నికల హడావిడి జోరందుకోనుంది. రాజకీయ పార్టీల గుర్తులపైనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో రాజకీయ పార్టీల్లో కదలిక మొదలైంది.
ప్రధాన పార్టీలు రానున్న అసెంబ్లీ ఎన్నికలకు మున్సిపోల్స్‌ను రిహార్సల్‌లా తీసుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపిక మొదలు చైర్మన్ ఎన్నిక వరకు ప్రతి ఘట్టం ఆసక్తికరంగా మారనుంది.
మునిసిపల్ ఎన్నికల ‘కోడ్’ కూసింది. సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఎలాంటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయరాదు. జిల్లాలో కడప కార్పొరేషన్‌తో పాటు 8 మునిసిపాలిటీలు ఉన్నాయి. వీటిలో రాజంపేట మునిసిపాలిటీ ఎన్నికలు మాత్రం వాయిదా పడ్డాయి. రాజంపేట మునిసిపాలిటీలో పంచాయతీల విలీనానికి సంబంధించిన కేసు కోర్టులో నడుస్తుండటంతో ఎన్నికల నిర్వహణకు బ్రేక్ పడింది. ఈ ఏడాది కొత్తగా మునిసిపాలిటీల జాబితాలో చేరిన మైదుకూరుతో పాటు ఎర్రగుంట్ల నగర పంచాయతీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి. అన్ని మునిసిపాలిటీలకు ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 2న ఫలితాలు వెలువడనున్నాయి.
అభ్యర్థుల ఖర్చు రూ. లక్ష- 1.50 లక్షలు:
మునిసిపాలిటీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ఎన్నికల ఖర్చుగా లక్ష రూపాయలు మాత్రమే ఖర్చు చేయాలి. అలాగే కార్పొరేషన్ పరిధిలోని అభ్యర్థులు 1.50లక్షల వరకూ ఎన్నికల వ్యయంగా నిర్ణయించారు. నిబంధనల మేరకు ఈ పరిధిని దాటి ఖర్చు చే సినట్లు ఎన్నికల కమిషన్‌కు ఆధారిత ఫిర్యాదులు అందితే అనర్హులుగా వేటు పడే ప్రమాదముంది.
41 నెలల పాటు ప్రత్యేక పాలనలో:
జిల్లాలో బద్వేలు మినహా తక్కిన కడప కార్పొరేషన్, ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటి, జమ్మలమడుగు, పులివెందుల మునిసిపాలిటీల పాలకవర్గాల పదవీ కాలం 2010 సెప్టెంబరు 29తో ముగిసింది. దీంతో అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలనతో మునిసిపాలిటీలు నడుస్తున్నాయి. ఎన్నికలు నిర్వహించాలని పలుమార్లు కోర్టు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది. చివరకు 41 నెలల తర్వాత ఈ నెల మార్చి 30న ఎన్నికలు జరగనున్నాయి. కాగా బద్వేలు మున్సిపాలిటీ పదవీకాలం కూడా గత ఏడాది జూన్10తో పూర్తయింది.