
సాక్షి, అమరావతి: అమరావతిలోని వీఐటీ–ఏపీ యూనివర్సిటీని అమెరికన్ కాన్సులేట్ బృందం గురువారం సందర్శించింది. యూనివర్సిటీలో ల్యాబ్స్ , లైబ్రరీ, తరగతి గదులను పరిశీలించింది. అమెరికాలోని పర్ డ్యూ, న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీ, రోచెస్టర్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్, మిచిగాన్ డీర్ బోర్న్ యూనివర్సిటీలతో పాటు పలు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో తమ వర్సిటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని ఈ సందర్భంగా వీఐటీ–ఏపీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శేఖర్ విశ్వనాథన్ వివరించారు.
ఇంటర్నేషనల్ ట్రాన్సఫర్ ప్రోగ్రాం ద్వారా బీటెక్ రెండు సంవత్సరాలు వీఐటీ ఏపీలో, మిగతా రెండేళ్లు అమెరికాలో చదివేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో చదివే విద్యార్థుల్లో ఎక్కువ మంది భారతీయులేనని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేవారే అధికమని కాన్సులెట్ వైస్ కౌన్సిల్ చార్లెస్ స్పెక్ట్ అన్నారు.
రాబోయే రోజుల్లో అమెరికాలో విద్యని అభ్యసించేందుకు అవసరమైన స్కాలర్‌షిప్‌లపై అవహగాన కల్పించేందుకు విఐటీ–ఏపీతో కలిసి పని చేయనున్నట్లు కల్చరల్ అఫైర్స్ అసిస్టెంట్ సెంథిల్‌కుమార్ చెప్పారు. ఈ కార్యక్రమంలో కల్చరల్ అఫైర్స్ అసిస్టెంట్ సెంథిల్ కుమార్, యూఎస్ ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ రీజనల్ ఆఫీసర్ మోనికా సేటియా, వీఐటీ–ఏపీ వర్సిటీ వైస్‌చాన్సలర్ డాక్టర్ శుభకర్, రిజిస్ట్రార్ డాక్టర్ సిఎల్వీ శివకుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment