వైభవంగా అమ్మవారి తెప్పోత్సవాలు
- తొలిరోజు తెప్పపై విహరించిన శ్రీకృష్ణుడు
- నేత్రపర్వంగా అభిషేకం
తిరుచానూరు, న్యూస్‌లైన్: తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు జరిగే తెప్పోత్సవాల్లో తొలిరోజు రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి పుష్కరిణిలో తెప్పపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ఇందులో భాగంగా స్వామిని తెల్లవారుజామున 5 గంటలకు సుప్రభాతంతో మేల్కొలిపి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు స్వామిని సన్నిధి నుంచి వేంచేపుగా శ్రీకృష్ణస్వామి ముఖమండపానికి తీసుకొచ్చి కొలువుదీర్చారు.
అనంతరం వేదపారాయణం, మంగళవాయిద్యాల నడుమ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో ఆలయ అర్చకులు నేత్రపర్వంగాఅభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు ఉభయదేవేరులతో సహా స్వామిని వేంచేపుగా ఆలయం నుంచి అమ్మవారి పుష్కరిణికి తీసుకొచ్చి తెప్పపై కొలువుదీర్చారు.
అనంతరం సర్వాంగ శోభితుడైన స్వామి ఉభయదేవేరులతో సహా తెప్పపై కొలువై మూడు పర్యాయాలు పుష్కరిణిలో విహరిస్తూ భక్తులను ఆశీర్వదించారు. రాత్రి 7.30 గంటలకు తిరుచ్చిపై తిరువీధుల్లో ఊరేగారు. ఆయాకార్యక్రమాల్లో ఆలయ స్పెషల్‌గ్రేడ్ డెప్యూటీ ఈవో భాస్కర్‌రెడ్డి, ఏఈవో నాగరత్న, సూపరింటెండెంట్లు కేపీ.వెంకటరత్నం, ధర్మయ్య, ఆర్జితం, ప్రసాదం ఇన్‌స్పెక్టర్లు గురవయ్య, ఆంజనేయులు, ఏవీఎస్‌వో రామకృష్ణ, వీఐ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.
తెప్పోత్సవాల్లో నేడు
తెప్పోత్సవాల్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం 3గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత సుందరరాజస్వామికిఅభిషేకం, సాయంత్రం 6.30 గంటలకు తెప్పోత్సవం, రాత్రి 7.30 గంటలకు తిరుచ్చి ఉత్సవం జరుగుతాయి.