వైభవంగా అవతారోత్సవాలు
పెద్దశేషునిపై సుందరరాజ స్వామి దివ్యదర్శనం
తిరుచానూరు : పద్మావతీ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువైన సుందరరాజ స్వామి వారి వార్షిక అవతారోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు రాత్రి స్వామి వారు పెద్దశేషవాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు. ప్రతి ఏటా జ్యేష్టమాసంలో వచ్చే ఉత్తరాభాద్ర నక్షత్రం ముగిసే సమయానికి స్వామివారికి మూ డు రోజుల పాటు అవతారోత్సవాలు నిర్వహిసా ్తరు. అవతారోత్సవాల్లో భాగంగా స్వామివారిని వేకువనే సుప్రభాతంతో మేల్కొల్పి నిత్యకైంకర్యాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారినిఆలయ ముఖమండపడంలోకి వేంచేపు చేసి, కొలువుదీర్చారు. అనంతరం మంగళవాయిద్యాలు, వేదపారాయణం నడుమ ఉభయదేవేర్లతో సహా స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకించారు. సాయంత్రం 5.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారికి ఊంజల్‌సేవను కన్నులపండువగా నిర్వహించారు. రాత్రి 7.15 గంటలకు స్వామి వారిని వాహన మండపంలోకి వేంచేపు చేసి, పెద్దశేష వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం దివ్యాలంకార శోభితుడైన స్వామి వారు ఉభయదేవేర్లతో సహా పెద్దశేష వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దివ్యదర్శనం కల్పించారు.
అవతారోత్సవాల్లో నేడు
అవతారోత్సవాల్లో భాగంగా రెండో రోజైన మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు అభిషేకం, సాయంత్రం 5.30 గంటలకు ఊంజల్‌సేవ, రాత్రి 7.15 గంటలకు హనుమంత వాహన సేవ జరుగుతుంది.