భర్త మృతి..కొన ఊపిరితో భార్య
అప్పులు బాధలు తట్టుకోలేక అఘాయిత్యం
లక్ష్మీపురంలో విషాదం
చోడవరం టౌన్: అప్పుల బాధలు దంపతుల ఆత్మహత్యాయత్నానికి దారితీశాయి. భర్త మృతి చెందగా.. భార్య కొన ఊపిరితో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ విచారకర సంఘటన మండలంలోని లక్ష్మీపురంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. మహారాజు అప్పారావు(36) కుటుంబం గ్రామంలోని కల్లాలు వద్ద నివాసముంటోంది. కల్లం దిబ్బ తప్ప అతనికి సెంటు భూమిలేదు. ఏటా కౌలు సాగుతో నెట్టుకొస్తున్నాడు. పెట్టుబడులు పెరిగిపోవడం, పంట కలిసిరాకపోవడంతో సుమారు రూ. 2 లక్షల వరకు అప్పులు చేశాడు. హుద్‌హుద్ ధాటికి తీవ్రంగా నష్టపోయాడు. అప్పుల బాధలు తట్టుకోలేక ఇటీవల మద్యానికి అలవాటు పడ్డాడు. దీంతో తరచూ భార్యాభర్తలు గొడవ పడేవారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇంటి సమీపంలోని పశువుల పాకలో ఇద్దరూ పురుగుమందు తాగారు. స్థానికులు గుర్తించి చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిం చారు.
చికిత్సపొందుతూ అప్పారావు చనిపోయాడు. భార్య లక్ష్మి(30) పరిస్థితి విషమంగా ఉండటంతో108లో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని బంధువులు తెలిపారు. వీరికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అప్పారావుకు లక్ష్మి మూడో భార్య. మొదటి భార్య కామెర్లుతో చనిపోయింది. ఆమెకు పుట్టిన కొడుకు, కుమార్తె తాతగారి ఇంట ఉంటున్నారు. రెండో భార్య విడాకులు తీసుకొని వెళ్లిపోయింది. అనంతరం లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రమణయ్య తెలిపారు.
దంపతుల మధ్య దారుణ చిచ్చు
Published Sat, Feb 28 2015 1:01 AM | Last Updated on Wed, Jul 10 2019 8:00 PM
Advertisement
Advertisement