ఏకపక్ష ఎంపికపై అధికార పార్టీలోనూ అంతర్గత పోరు
సబ్సిడీ రుణాల ఎంపికలో స్క్రీనింగ్ కమిటీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
ఉదయగిరి: ఎస్సీ, ఎస్టీ ఇతర వర్గాల సబ్సిడీ రుణాలకు సంబంధించి అధికార టీడీపీ స్క్రీనింగ్ కమిటీ పేరుతో తమ వారికే లబ్ధి చేకూరేలా తీసుకున్న నిర్ణయంలో ఆ పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ లబ్ధిదారుల ఎంపికలో అధికార పార్టీ నేతల మధ్య తీవ్ర విభేదాలు పొడచూపుతున్నాయి. యూనిట్లు తక్కువగా ఉండటం, సబ్సిడీ అధికంగా ఉండటంతో వీటిని దక్కించుకునేందుకు తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆ పార్టీలో హవా నడుస్తున్న వారిదే పైచేయి కావడంతో కింది స్థాయి నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. జిల్లాలో ఇప్పటికే ఎస్సీకార్పొరేషన్ ద్వారా విడుదలయ్యే సబ్సిడీ రుణాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. గురువారం నుంచి జిల్లాలో బీసీలు మైనార్టీలు, ఐటీడీఏకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుంది. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రూ.16 కోట్లు, బీసీ కార్పొరేషన్‌కు సంబంధించి రూ.25 కోట్లు సబ్సిడీ రుణాలకు లబ్ధిదారులకు అందజేయనున్నారు.
ఒక్కొక్క యూనిట్‌కు సబ్సిడీ 50-60 శాతం ఉండటంతో వీటి కోసం పోటీ తీవ్రంగా ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్క్రీనింగ్ కమిటీ తమకు అనుకూలమైన వ్యక్తుల పేర్లనే సూచించడంతో అర్హులైన అనేక మంది నిరాశకు గురయ్యారు. దీంతో టీడీపీలోనే తీవ్ర అంతర్గత విభేదాలు నెలకొన్నాయి. వరికుంటపాడు మండలంలో ఎస్సీ లబ్ధిదారుల ఎంపికలో తమకు అన్యాయం జరిగిందని అదే పార్టీకి చెందిన ఎస్సీ వర్గాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఎస్సీ, ఎస్టీ రుణాలకు సంబంధించి లబ్దిదారుల ఎంపికలో కీలకపాత్ర పోషిస్తున్న స్క్రీనింగ్ కమిటీలో సభ్యులు ఎస్సీ, ఎస్టీలు కాకుండా ఇతర కులాలు ఉండటం ఏమిటని టీడీపీకి చెందిన ఎస్సీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు సంబంధించిన కమిటీల్లో ఒక్క ఎస్సీ, ఎస్టీ సభ్యుడు కూడా లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
బీసీ రుణాల ఎంపికలో కూడా అదేబాట
బీసీ కార్పొరేషన్‌కు సంబంధించిన రుణాల ఎంపికలోనూ స్క్రీనింగ్ కమిటీదే పైచేయి కానుంది. ఈ కమిటీలో కూడా సభ్యులుగా ఓసీలు ఉండటం పట్ల టీడీపీకి చెందిన బీసీ నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. మా రుణాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికలో ఓసీల పెత్తనం ఏమిటని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ రుణాల ఎంపికలో సభ్యులుగా ఎంపీడీఓ, మండల సమాఖ్య అధ్యక్షురాలు, బ్యాంకర్లు ఉన్నప్పటికీ వారి మాట చెల్లుబాటు కాకపోవడం పట్ల పలువురు బ్యాంకు అధికారులు కూడా ఈ కమిటీలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బ్యాంకుల్లో క్రమ శిక్షణతో ఆర్థిక లావాదేవీలు నడిపే వారికి రుణాలు ఇవ్వాలని తాము సూచిస్తున్నప్పటికీ, లబ్ధిదారులుగా టీడీపీకి చెందిన కార్యకర్తల పేర్లనే సూచిస్తూ వీటినే కచ్చితంగా ఎంపిక చేయాలని పట్టుబట్టడం బ్యాంకర్లకు కూడా తొలనొప్పిగా మారింది. దీంతో పలువురు బ్యాంకర్లు కూడా కమిటీ సమావేశాలకు సక్రమంగా పాల్గొనలేదు. పైగా కమిటీలు సూచించిన లబ్ధిదారుల్లో చాలా మంది డిఫాల్టర్లుగా ఉన్నారు. వీరికి సబ్సిడీ మంజూరైనా నిబంధనల మేరకు గ్రౌండింగ్ సమయంలో రుణాలు మంజూరు చేయడం కష్టంగా మారుతుందని బ్యాంకర్లు చెబుతున్నారు.
స్క్రీనింగ్ కమిటీల ఎంపికపై హైకోర్టులో పిటిషన్
చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ రుణాల ఎంపికలో స్క్రీనింగ్ కమిటీ పేరుతో తమ పార్టీకి చెందిన కార్యకర్తలను నియమించడంపై రాయలసీమకు చెందిన ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో కోర్టు ఈ రుణాల ఎంపికలో ప్రభుత్వ కమిటీల జోక్యం అవసరం ఎందుకో వివరించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నెల 22వ తేదీకి కేసును వాయిదా వేసింది. కమిటీల నియామకంలో ప్రభుత్వ జోక్యంపై కూడా హైకోర్టు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో కమిటీలు ఎంపిక చేసిన జాబితాపై కూడా అధికారుల్లో ఓ రకమైన గందరగోళ పరిస్థితి నెలకొంది. కమిటీల ఎంపికపై హైకోర్టు నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రావచ్చని అధికారులు సైతం భావిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సబ్సిడీ రుణాల లబ్ధిదారుల ఎంపికలో ప్రభుత్వం తమ పార్టీ కార్యకర్తలను స్క్రీనింగ్ కమిటీ పేరుతో నియమించి పచ్చ చొక్కాలకే ప్రయోజనం చేకూరే విధంగా వ్యవహరించడంపై ప్రతి పక్షాలతోనే కాకుండా సొంత పార్టీ నుంచి కూడా వ్యతిరేకత రావడం గమనార్హం.
తమ్ముళ్ల మధ్య చిచ్చురేపిన సబ్సిడీ రుణాలు
Published Thu, Dec 18 2014 5:29 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement