
అనుకోని అతిథి..!
పెళ్లంటే నూరేళ్ల పంట... ప్రతి వ్యక్తి జీవితంలో మరుపురాని, మర్చిపోలేని తీపి జ్ఞాపకం పెళ్లి..
జగన్‌మోహన్‌రెడ్డి రాకతో
పరవసించిన పెళ్ళి ఇళ్లు
సామాన్యుల పెళ్ళికి జననేత
రావడంతో పట్టలేని సంతోషం
సాక్షి, గుంటూరు: పెళ్లంటే నూరేళ్ల పంట... ప్రతి వ్యక్తి జీవితంలో మరుపురాని, మర్చిపోలేని తీపి జ్ఞాపకం పెళ్లి.. అటువంటి పెళ్ళి తమ జీవితకాలం గుర్తుండిపోతుంది. ఆ పెళ్ళికి వారు ప్రాణంగా అభిమానించే నాయకుడు స్వయంగా వచ్చి దీవెనలు అందజేసి వారి ఆతిథ్యం స్వీకరిస్తే ఇక ఆ జంటకు ఆ మధుర జ్ఞాపకాలు కలకాలం నిలిచిపోతాయి. అలా పెళ్లి చేసుకున్న జంటలు తుళ్ళూరు మండలం ఉద్దండరాయునిపాలెం, వడ్డమాను గ్రామాలకు చెందిన వారు కాగా వారి పెళ్ళికి హాజరైన విశిష్ట అతిథి, అభిమాన నాయకులు వై.ఎస్.జగన్‌మోహనరెడ్డి. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తుళ్ళూరు మండలం ఉద్దండరాయునిపాలెం, వడ్డమాను గ్రామాల్లో సామాన్య కార్యకర్తల వివాహ వేడుకలకు హాజరయ్యారు. తుళ్ళూరు మండల యువజన విభాగం కన్వీనర్ నందిగం సురేష్ మేనల్లుడు చలివేంద్రం నాగేంద్రబాబు, ఝాన్సీ వివాహం, అదేమండలం వడ్డమాను గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త గొట్టం శివారెడ్డి కుమారుడు గొట్టం చంద్రశేఖరరెడ్డి అనురాధ వివాహాలకు జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. అనుకోని అతిథి తమ ఇంట్లో వివాహానికి హాజరుకావడంతో ఆనందంతో వారు ఉబ్బితబ్బిబయ్యారు. ప్రతిపక్ష నేత సామాన్యుల పెళ్ళికి జననేత జగన్ రావడంతో గ్రామం మొత్తం పెళ్ళింటి వద్దకు చేరుకొని ఆయన్ను చూసేందుకు, కరచాలనం చేసేందుకు, పోటీ పడ్డారు.
జన్మలో మర్చిపోలేను
నా మేనల్లుడు వివాహానికి వస్తానంటూ వైఎస్ జగన్‌మోహనరెడ్డి మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సామాన్య కార్యకర్తలమైన మా ఇంట్లో జరిగే వివాహానికి ఆయన హాజరుకావడం అత్యంత అద్భుతంగా ఉంది. కలలో కూడా ఆయన వస్తారని ఊహించలేదు. ఆ రోజును నేను నా జన్మలో మర్చిపోలేను. -నందిగం సురేష్, మండల పార్టీ కన్వీనర్