
టీడీపీలో ఆనం సోదరులు?
లోకేష్ వద్దకు పంచాయితీ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీలో చేరాలని ఉవ్విళ్లూరుతున్న మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఆయన సోదరుడు వివేకానందరెడ్డిల కోరిక ఫలించే అవకాశం కనబడుతోంది. ఈ మేరకు ఆనం సోదరులు నాలుగు రోజుల క్రితం సీఎం చంద్రబాబును కలుసుకున్నారు. అయితే పార్టీలో వారి చేరికపై సీనియర్ నాయకులు, ముఖ్యంగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. జిల్లాకే చెందిన మంత్రి నారాయణ ఓకే చెప్పినప్పటికీ పార్టీలోకి వస్తే ఆనం సోదరుల ఆధిపత్యం పెరిగిపోతుందని సోమిరెడ్డి ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో కొంతకాలం వరకు వారికి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వని చంద్రబాబు.. ఇటీవల కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చొరవతో ఆనం సోదరులతో సమావేశమైనట్లు సమాచారం. ఆనం సోదరుల విషయాన్ని పరిశీలించాలని పార్టీ వ్యవహారాలు చూస్తున్న లోకేష్‌కు చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆనం సోదరులతో లోకేష్ ఫోన్లో సంభాషించినట్లు సమాచారం. ఈనెల 24న చంద్రబాబు నెల్లూరు రానున్నారు. ఆలోపే ఆనం సోదరుల వ్యవహారాన్ని తేల్చాలని లోకేష్ భావిస్తున్నట్లు తెలిసింది.