
సాక్షి, అనంతపురం : తన పరువుకు భంగం కలిగేలా మాట్లాడిన టీడీపీ నాయకుడు ఎల్.నారాయణచౌదరి, వార్తను ప్రచురించిన ఆంధ్రజ్యోతి దినపత్రికపై వైఎస్సార్‌సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి వేసిన పరువునష్టం కేసులో బాధితునికి రూ.11 లక్షల పరిహారం చెల్లించాలని అనంతపురం జిల్లా కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. ప్రకాష్‌రెడ్డి తరపున వాదించిన సీనియర్ న్యాయవాది ఎస్‌కే నరేంద్రరెడ్డి తెలిపిన వివరాల మేరకు.. ‘పరిటాల పేరు ఉచ్ఛరించడానికి కూడా మీకు అర్హత లేదు’ అనే శీర్షికతో ‘కారుబాంబు కేసులో 27 మంది హత్యకు కారణమైన మీది ఎలాంటి చరిత్రో ప్రజలకు తెలుసు’ అని టీడీపీ నాయకులు ఎల్.నారాయణ చౌదరి చేసిన వ్యాఖ్యలతో ఆంధ్రజ్యోతి దినపత్రిక 2001 ఫిబ్రవరి 28న వార్త ప్రచురించింది.
దీనిపై తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి.. ఎల్.నారాయణచౌదరి పైన, ప్రచురించిన ఆంధ్రజ్యోతి పత్రికపైన 2001లో జిల్లా కోర్టులో రూ.50 లక్షలకు పరువునష్టం దావా వేశారు. 1998లో హైదరాబాద్‌లో కారుబాంబు ఘటన జరిగింది. ఈ కేసులో తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఆయన సోదరులు తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డిలపై హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కేసు నమోదు చేశారు. కేసు విచారించిన ప్రత్యేక కోర్టు 2000 జనవరి 12న వీరిని నిర్దోషులుగా తేల్చింది. ఈ విషయం తెలిసి కూడా తన కుటుంబ పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా ఎల్.నారాయణ చౌదరి మాట్లాడారని దావాలో ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. కేసు విచారణ అనంతరం బాధితుడు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డికి ఎల్.నారాయణచౌదరి రూ.10 లక్షలు, ఆంధ్రజ్యోతి దినపత్రిక రూ.లక్ష చెల్లించాలని జిల్లా జడ్జి శశిధర్‌రెడ్డి తీర్పు చెప్పారు. అది కూడా 2001 నుంచి 9 శాతం వడ్డీతో చెల్లించాలని స్పష్టం చేసినట్లు న్యాయవాది వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment