సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్కో హామీని నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారు. ప్రాంతాల అభివృద్ధి వేగవంతం కావాలంటే చిన్న జిల్లాలతోనే సాధ్యమని విపక్ష నేతగా గతంలో ప్రకటించారు. అందుకు తొలి అడుగుగా వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుని స్థానంలో పార్లమెంట్ అధ్యక్షులను నియమించారు. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడంతో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మొదలైంది. అందులో భాగంగా జిల్లా యంత్రాంగాన్ని కొంత సమాచారం కోరగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. అధికార వర్గాల సమాచారం మేరకు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలను పరిశీలిస్తే.. అనంతపురం జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలు, 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో 5 రెవెన్యూ డివిజన్లు, 63 మండలాలు, 1029 పంచాయతీలు, 3314 ఆవాస ప్రాంతాలు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లా అనంతపురం. ఇప్పుడు ఈ జిల్లా రెండుగా విడిపోనుంది.
కొత్త జిల్లాల ప్రతిపాదనలు ఇలా..
అనంతపురం, హిందూపురం పార్లమెంట్‌లు రెండు జిల్లాలుగా ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లాకు అనంతపురం జిల్లా కేంద్రంగా, పుట్టపర్తి జిల్లా కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు కాబోతుందని సమాచారం. హిందూపురం పార్లమెంట్‌లోని కదిరి అసెంబ్లీ నియోజకవర్గం మదనపల్లి(చిత్తూరు జిల్లా) కేంద్రంగా ఏర్పాటు కాబోయే జిల్లాలో కలిపే యోచనలో ఉన్నట్లు తెలిసింది. అలాగే అనంతపురం పార్లమెంట్ పరిధిలోని కళ్యాణదుర్గం నియోజకవర్గం కొత్తగా ఏర్పాటు కాబోయే పుట్టపర్తి జిల్లాలో చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు కొత్త జిల్లాలు ఏర్పాటైతే అనంతపురం జిల్లాలో 6 అసెంబ్లీ నియోజకవర్గాలు, పుట్టపర్తి జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేఅవకాశం ఉంది. అలాగే పుట్టపర్తి జిల్లాలో 19.17 లక్షల జనాభా, అనంతపురం జిల్లాలో 18.13లక్షల జనాభా ఉండొచ్చు. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి అసెంబ్లీల పునర్విభజన జరిగే అవకాశం కనిపిస్తోంది. అప్పుడు పార్లమెంట్ పరిధిలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది. ఈ లెక్కన రెండు పార్లమెంట్‌ల పరిధిలో 4 అసెంబ్లీ నియోజకవర్గాలు కొత్తగా ఏర్పాటు కానున్నాయి.
అనంతపురం జిల్లాలో ఒకే రెవెన్యూ డివిజన్
ప్రస్తుతం జిల్లాలో 5 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. అనంతపురం, కళ్యాణదుర్గం, పెనుకొండ, ధర్మవరం, కదిరి డివిజన్లుగా పాలన సాగుతోంది. కొత్త జిల్లాలు ఏర్పాటైతే పెనుకొండ, ధర్మవరం, కళ్యాణదుర్గం డివిజన్లు పుట్టపర్తి జిల్లాలో ఉండే అవకాశం ఉంది. కదిరి డివిజన్ మదనపల్లి జిల్లాలో చేరే వీలుంది. దీంతో అనంతపురం జిల్లాలో కేవలం అనంతపురం రెవెన్యూ డివిజన్ మాత్రమే ఉంటుంది. ఈ క్రమంలో గుంతకల్లు కేంద్రంగా మరో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. అయితే పుట్టపర్తి కాకుండా పెనుకొండను జిల్లా కేంద్రంగా చేస్తే మడకశిర, హిందూపురం, పుట్టపర్తి, ధర్మవరంతో పాటు అన్ని ప్రాంతాలకు ‘సెంటర్ పాయింట్’ అవుతుందని, పెనుకొండను జిల్లా కేంద్రంగా చేసే అవకాశాలను పరిశీలించాలని మరో నివేదికను కూడా అధికారులు పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఇవన్నీ ప్రాథమిక దశలోని అంశాలే. తుది నివేదిక తర్వాత ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగానే కొత్త జిల్లాల ఏర్పాటు జరగనుంది.
ప్రభుత్వానికి వివరాలు పంపాం
ప్రభుత్వం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాలు, ఒకే మండలం రెండు నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే వాటి వివరాలు, రెవెన్యూ డివిజన్లతో పాటు మరికొన్ని వివరాలు అడిగారు. ప్రభుత్వం అడిగిన మేరకు వివరాలను పంపించాం. – ఎంవీ సుబ్బారెడ్డి,జిల్లా రెవెన్యూ అధికారి
అనంతపురం జిల్లా
అనంతపురం, రాయదుర్గం, శింగనమల, గుంతకల్లు, తాడిపత్రి, ఉరవకొండ జనాభా: 18.13 లక్షలు
పుట్టపర్తి జిల్లా
హిందూపురం, మడకశిర,పుట్టపర్తి, ధర్మవరం, పెనుకొండ, రాప్తాడు, కళ్యాణదుర్గంజనాభా: 19.17 లక్షలు
కదిరి
మదనపల్లి(చిత్తూరు జిల్లా) కేంద్రంగా ఏర్పాటు కానున్న జిల్లాలో కలిపే యోచన
Comments
Please login to add a commentAdd a comment