పేద బతుకుల్లో.. పెద్దకష్టం
♦ కొడుకు వైద్యం కోసం ఊర్లు తిరుగుతున్న తల్లిదండ్రులు
♦ అనంతపురం జిల్లా దంపతుల దయనీయ స్థితి
సాక్షి, విజయవాడ బ్యూరో: అసలే పేదరికం.. ఆపై కరువు సీమలో బతుకు దుర్భరం.. ఏడేళ్ల నిరీక్షణతో దక్కిన ఏకైక మగ సంతానం.. ఐదేళ్లుగా నరాల బలహీనతతో ఆ బాలుడి దయనీయ స్థితి.. కన్నకొడుక్కి వైద్యం చేయించలేని నిస్సహాయస్థితిలో ఆ కన్నవారికి ఏడ్చి ఏడ్చి కన్నీరు సైతం ఇంకిపోయింది.. ఇది అనంతపురం జిల్లా పెదవడుగూరు మండలం కండ్లగూడూరు గ్రామానికి చెందిన మక్కాల బాలపెద్దయ్య, అనసూయమ్మ దంపతుల దీనస్థితి.
శుక్రవారం అనంతపురం నుంచి విజయవాడ వచ్చి కనకదుర్గమ్మను దర్శించుకుని, నగరంలో ఎవరైనా సాయం చేయకపోతారా అన్న ఆశతో తిరుగుతున్న వారిని ‘సాక్షి’ పలకరించడంతో తమ దయనీయ స్థితిని గురించి చెప్పుకున్నారు. గ్రామంలో కూలి పని చేసుకుని జీవనం సాగించే బాలపెద్దయ్య, అనసూయమ్మ దంపతులకు ఒకే ఒక మగ సంతానం కలిగింది. ఏడేళ్ల నిరీక్షణ తరువాత కొడుకు పుట్టాడన్నా ఆనందం క్రమేణా ఆవిరవుతూ వచ్చింది. రాన్రాను తల సరిగ్గా నిలబెట్టలేకపోవడం, కాళ్లు, చేతులు సరిగ్గా పనిచేయకపోవడం, తరచు ఫిట్స్ రావడంతో కంగారుపడిన వారు వైద్యులకు చూపించారు.
పిల్లోడు నరాల బలహీనతతో బాధపడుతున్నాడని, ప్రతీ రోజు మందులు వాడుతూ, తగిన వైద్యం చేయిస్తే పరిస్థితి మెరుగవుతుందని వైద్యులు నిర్ధారించారు. నెలవారీగా కనీసం రూ. 4,200 పెట్టి మందులు కొనడం.. కూలి పని చేసుకుని బతికేవారికి భారమైంది. శరీర భాగాలు సైతం కదల్చలేక, తల నిలబెట్టలేని స్థితిలో ఉన్న కుమారుడికి అన్నం తినిపించాలంటే దాదాపు రెండున్నర గంటలపాటు అవస్థలు పడాల్సివస్తోందని వారు ఆవేదన చెందుతున్నారు. అనంతపురం జిల్లాలో బతుకు గడవడమే కష్టమవడంతో పలు జిల్లాలు తిరిగి తమ దీనస్థితిని దాతలకు చెప్పుకుని సాయం కోరుతున్నారు. తమ బిడ్డకు నెలనెల అవసరమైన వైద్యం, మందులు ఇప్పిస్తే మామూలు మనిషి అవుతాడని అందుకు దాతలు సాయం చేయాలని కోరుతున్నారు. సాయం చేసే వారు సెల్ నంబర్ 81870 71012 సంప్రదించాలని వేడుకుంటున్నారు.