సాగునీరందక ‘అనంత’లో రైతన్నల అగచాట్లు | Anantapur Farmers Did Not Get Irrigation Water | Sakshi
Sakshi News home page

నీళ్లు.. కన్నీళ్లు!

Published Thu, Mar 14 2019 10:32 AM | Last Updated on Thu, Mar 14 2019 10:33 AM

Anantapur Farmers Did Not Get Irrigation Water - Sakshi

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం  రోటరీపురం పొలాల్లో ప్రభుత్వ పాలనపై చర్చిస్తున్న రైతులు

నీళ్లున్నా ఐదేళ్లుగా ఇయ్యిలేదు...
‘నేను రెండు వేలు పింఛన్‌ ఇచ్చాండా..!
మీరంతా మాకు అండగా ఉండాలి అంటాండారు. మాకు కావల్సింది రెండు వేలు పింఛన్‌ కాదయ్యా! 
మా పొలాలకు నీళ్లు.. నీళ్లు ఇత్తే అట్టాంటి రెండు వేల కాగితాలు మేమే పదిమందికి దానం ఇత్తాం!
నాలుగేళ్ల పొద్దయింది!
సాగునీళ్లు లేవు. వరిమడి ఏత్తే ఎండిపోవడమే!
శనక్కాయన్న ఏత్తామని దిగితే వర్షం రాక అదీ ఎండిపాయ!
వర్షం లేక, సాగునీళ్లు లేక శానా ఇబ్బంది పడతాండాం. మా మనసును శానా బాధ పెట్టేదేందంటే... ఏటా హంద్రీ–నీవా నీళ్లు వత్తాండాయి. ఐదేళ్ల నుంచి వత్తాన్నా ఎవరాకూ నీళ్లు ఇయ్యిలేదయ్యా!
నీళ్లు సూచ్చే గుండె తరుక్కుపోతాది. మాకు ఏమీ సేయొద్దు!  మా పొలాలకు సాగునీళ్లు ఇచ్చే సాలు...’’
– ఇదీ కరువు జిల్లా ‘అనంత’ రైతన్నల ఆవేదన

అనంతపురం రైతులకు తెలిసినంతగా రాష్ట్రంలో బహుశా దేశంలోనే మరే జిల్లాకు నీళ్ల విలువ తెలియదంటే అతిశయోక్తి కాదేమో! సాగునీళ్లు లేక, పంటలు పండక 2014 జూన్‌లో టీడీపీ ప్రభుత్వం కొలువుదీరిన రోజు నుంచి ఇప్పటి వరకూ 273 మంది అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే ఇక్కడ సాగు సంక్షోభం ఎంత ప్రమాదకరంగా ఉందో బోధపడుతోంది. రాష్ట్రంలో రైతన్నలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు? కష్టాల కడగండ్ల పాలైనవారికి ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం అందిందా? మొత్తంగా ఐదేళ్ల టీడీపీ పాలనపై సంతృప్తిగా ఉన్నారా? ఎన్నికల తరువాత ఎలాంటి నాయకుడు, ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు? అనే అంశాలపై అన్నదాతల మనోగతాన్ని తెలుసుకునేందుకు ‘సాక్షి’ ప్రయత్నించింది. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం రోటరీపురం గ్రామంలో పొలాలకు వెళ్లి పలువురు రైతులను ‘సాక్షి’ ప్రతినిధి పలకరించారు. పుచ్చ తోట సాగు చేస్తున్న నాగరాజుతో మాట్లాడుతుండగా మరో 15 మంది రైతులు అక్కడకు వచ్చారు. పొలం గట్టున వేప చెట్టు కింద వారితో సంభాషణ కొనసాగింది. ‘ఏం పెద్దాయనా..? వ్యవసాయం ఎట్టుండాది! గిట్టుబాటు అయితాండాదా? రుణమాఫీ అయిందా? సాగు నీళ్లు అందుతున్నాయా...?’ అన్న ప్రశ్నలకు అంతా చెప్పిన సమాధానం ఒక్కటే!... ‘ఎక్కడయ్యా! నీళ్లు లేక శానా ఇబ్బందిగుండాది! అంతా రైతుల గురించే మాట్టాడతారు. కానీ గత ఐదేళ్లలో రైతుకు సేసిన అన్నాయం సూత్తే కడుపు తరుక్కుపోతాది.. రుణమాఫీ దేవుడెరుగు. అది వడ్డీలకు కూడా సరిపోక అప్పుల్లో కూరుకుపోయాం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  


అనంతపురం చెరువులో నీళ్లు ఎండిపోవడంతో  పశువుల మేత కోసం దున్నుతున్న రైతు 

  • నాగరాజు 12 ఎకరాల పొలంలో టమాటా, ఆముదం, వరి, వేరుశనగ సాగు చేస్తాడు. ఐదేళ్లుగా హెచ్చెల్సీ కాలువకు నీళ్లు సరిగా వదలకపోవడంతో ఏటా పంట నష్టపోతూనే ఉన్నాడు. వరికి బదులుగా పుచ్చకాయలు సాగు చేసినా నీళ్లు చాలక అది కూడా చేతికి అందలేదని వాపోయాడు.
     
  • మల్లిఖార్జున వరికి నీళ్లు చాలక నష్టాలు రావడంతో మొక్కజొన్న సాగు చేశాడు. పెట్టుబడి కోసం బ్యాంకులో తీసుకున్న రూ.60 వేల రుణం సరిపోకపోవడంతో బయట రూ.2 వడ్డీ చొప్పున  రూ.30 వేలు తీసుకున్నాడు. మొక్కజొన్నకూ నీళ్లు చాలక నష్టపోయాడు. రూ.90 వేల అప్పు మిగిలింది. వడ్డీలు అదనం. నాలుగేళ్లలో రూ.3 లక్షలు అప్పు చేశాడు. పంట పండితే కానీ అప్పు తీరదు... సాగు నీళ్లు వత్తేగానీ పంట పండదు’ అని ఆక్రోశించాడు. 


ఇది మోసం కాదా?: రైతు నాగరాజు 
‘2012లోనే జిల్లాకు హంద్రీ–నీవా నీళ్లు వచ్చినాయి. 2014 నుంచి ఏటా 20–30 టీఎంసీలొత్తాండాయిని పేపర్లో రాత్తాండారు. మాకు తెలిసి ఈ నీళ్లతో 2–3 లక్షల ఎకరాల వరి మడి పండుతాది. ఆరుతడి పంటలైతే 4 లక్షల ఎకరాలకు ఇవ్వొచ్చు. కానీ ఐదేళ్లలో ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదు! సాగు నీరిత్తామని 2014 నుంచి మంత్రులు, ఎస్‌ఈలు ఏటా పేపర్లో ప్రకటనలు ఇత్తాండారు. కానీ ఇవ్వలేదు. ఇది మోసం చేయడం కాదా? అసలు ఇన్ని నీళ్లు ఏం సేసినారు? పోనీ చెరువుల కింద ఆయకట్టుకైనా ఇచ్చినారా అంటే అదీ లేదు’ అని రైతు నాగరాజు సూటిగా ప్రశ్నించాడు.  

రైతులకు నీళ్లివ్వకుండా రాజకీయాలా?
నాగభూషణం రైతు జోక్యం చేసుకుంటూ ‘ఒక్క టీఎంసీ నీళ్లు మల్యాల నుంచి జిల్లాకు రావాలంటే రూ.14 కోట్లు కరెంటు బిల్లు అవుతుందట! ఈ లెక్కన ఏటా 25 టీఎంసీలు వచ్చినా రూ. 350 కోట్లు నీళ్లుకు ఖర్చవుతుంది. ఇంత విలువైన నీళ్లు రైతులకు ఇవ్వలేదు.. ఏ ఎమ్మెల్యేకు బలం ఉంటే వాళ్ల చెరువులకు తీసుకుపోయి రాజకీయాలు సేయడం మినహా ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదు...’ అని వ్యాఖ్యానించాడు.

కొట్టినోన్ని, పెట్టినోన్ని ఎప్పటికీ మర్సిపోం...
‘కరెంటు బకాయిలుంటే కరెంటోళ్లు, పోలీసోళ్లు వరి పొట్టమీద ఉన్నపుడు వచ్చి స్టాటర్లు తీసుకెళ్లారు. డబ్బులు కట్టలేక, నీళ్లు లేక పంటలు ఎండిపోయి ఎంత నష్టపోయామో మాకు తెలుసు..’ అని విలపించాడు వెంకటేశ్‌ అనే రైతు. అన్నదాతల కష్టాలు గుర్తించిన దివంగత వైఎస్‌ కరెంటు బకాయిలు పూర్తిగా మాఫీ చేశారు. దీనివల్ల రైతులు వెంకటేశ్‌కు రూ.18 వేలు నాగరాజుకు రూ.10 వేలు, మల్లిఖార్జునకు రూ.11 వేలు చొప్పున ఇలా ప్రతివారికీ మాఫీ అయినట్లు చెప్పారు. ఈరోజు కరెంటోళ్లు చేను కాడికి రావడం లేదంటే ఆ మహానుభావుడు ఉచితంగా ఇచ్చిన కరెంటు పుణ్యమే.. అంటూ వైఎస్సార్‌ను తలచుకుంటూ రెండు చేతులెత్తి నమస్కరించాడు నారాయణ అనే పెద్దాయన.  

‘రైతు భరోసా’తో చిగురిస్తున్న ఆశలు..
తాము అధికారంలోకి రాగానే రైతు భరోసా ద్వారా ఏడాదికి రూ.12,500 చొప్పున పెట్టుబడి సాయం కింద అందచేస్తామని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీపై నారాయణరెడ్డి అనే రైతు స్పందిస్తూ.. ‘పెట్టుబడికి ఉపయోగపడతాది. జగన్‌ శానా మంచిపని సేత్తానంటాండాడు..’ అని చెప్పాడు. 

రుణమాఫీ, సాగునీళ్ల సంగతి సరే..! కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కిందా? అని అడిగితే రైతు నాగభూషణం మాట్లాడుతూ.. ‘నాకు నాలుగు ఎకరాలుంది. 2017లో వేరుశనగ వేసింటిని. నాకు బాగా గుర్తు... క్వింటాలు రూ.4,400 రేటుతో కొనుగోలు సేత్తామని ప్రభుత్వం ప్రకటించింది. పంట పండిన రెండు నెలలకు కూడా కొనుగోలు కేంద్రం ఏర్పాటు సేయలేదు. జిల్లాలో 12 లక్షల క్వింటాళ్ల దిగుబడి వత్తే కేవలం 2 లక్షల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు సేసినారు. దీంతో 3,400కి అమ్మినా! ఇక 2015, 2016, 2018లో అసలు కొనుగోలు కేంద్రమే ఏర్పాటు చేయలేదు. ఇదీ రైతులపై చంద్రబాబుకు ఉన్న ప్రేమ! 

దేవున్ని మొక్కుతాండానయ్యా...!
 ‘నాకు 20 ఎకరాల పొలం ఉంది. నీళ్లు లేక కంది పంట మొత్తం ఎండిపోయింది. ఒంట్లో సత్తువ తగ్గడంతో మా పిల్లోళ్లు వ్యవసాయం సేత్తాండారు. ఇన్నేండ్లు వ్యవసాయం సేసినా నేను సంపాదించింది ఏమీ లేదు. నా పిల్లోళ్లు కూడా నాలాగే ఇబ్బంది పడతారా? అని భయమేత్తాంది. నాకు ఆరు మంది పిల్లోళ్లు! జగన్‌ వచ్చాడు నాయనా! సాగునీళ్లు ఇత్తాడు. పంటలకు భయం ఉండదని పిల్లోల్లంతా సెబుతాండారు. ఆ మహానుభావుడే రావాలని దేవున్ని మొక్కుతాండానయ్యా...!’ – నారాయణ, రైతు, రోటరీపురం

కచ్చితంగా నీళ్లు ఇవ్వాల్సిందే!
హెచ్చెల్సీ నుంచి ఐదేళ్లుగా సాగు నీరు ఇవ్వలేదు. మేం నీటి తీరువా కడుతున్నాం! కచ్చితంగా నీళ్లు ఇవ్వాల్సిందే! హెచ్చెల్సీకి నీరు ఇబ్బంది అయితే హంద్రీ–నీవా నీళ్లను హెచ్చెల్సీకి మళ్లించి పంటలకు ఇవ్వాలి. రైతులకు మేలు చేయాలి’ – వెంకటేశ్, రైతు, రోటరీపురం

అప్పు కట్టలేక మోటర్‌ అమ్మేసినా...!
నాకు 1.90 ఎకరాల భూమి ఉంది. బోరు మోటార్‌కు రూ.35 వేలు, పైపులకు రూ.15 వేలు ఖర్సయింది. ఏడాదికే బోరు ఎండిపోయింది. అప్పు తీర్చేందుకు మోటార్‌ అమ్మితే రూ.18 వేలకు కొన్నారు. అప్పు అలాగే మిగిలిపోయింది. అందుకే మాకు సాగు నీళ్లు ఇచ్చే నాయకుడు కావాలి.– ఎర్రిస్వామి, రైతు, రోటరీపురం
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement