వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. తాను రైతు పక్షపాతినని మరోసారి నిరూపించుకున్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని వాటినీ నెరవేరుస్తూ రైతు సంక్షేమానికి కృషి చేస్తున్నారు. 2018 ఖరీఫ్, రబీలో పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతులకు అపారనష్టం కలిగింది. అప్పడు అధికారంలో ఉన్న టీడీపీ సర్కార్ రైతుకు మొండిచేయి చూపగా..రైతు కష్టం తెలిసిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రైతుకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకున్నారు. 2018 ఖరీఫ్, రబీకి సంబంధించి రూ. 984.23 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేయగా... కరువుసీమ రైతన్నలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
సాక్షి, అనంతపురం : జగన్ సర్కార్ రైతులకు తీపి కబురు చెప్పింది. 2018 ఖరీఫ్, రబీలో జరిగిన పంట నష్టానికి సంబంధించిన పెట్టుబడిరాయితీ (ఇన్‌పుట్‌సబ్సిడీ) ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పంట నష్టం టీడీపీ హయాంలోనే జరిగినా..రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని పరిహారం మంజూరు చేస్తున్నట్లు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఈ నెల 14న నిర్వహించిన వ్యవసాయ మిషన్ సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు.
చంద్రబాబు తీరుకు భిన్నంగా...
2013 ఖరీఫ్‌లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో పంటలకు అపార నష్టం జరిగింది. మొత్తంగా రూ.643 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ రైతులకు ఇవ్వాల్సి ఉంది. కానీ 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పరిహారం ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. తన హయాంలో పంట నష్టం జరగలేదంటూ ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వకుండా మోసం చేశారు. కానీ... జగన్ సర్కారు గతానికి భిన్నంగా రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుండటంతో త్వరలోనే గత ఖరీఫ్, రబీకి సంబంధించిన రూ.985 కోట్లు ఇన్‌పుట్‌సబ్సిడీ రైతులకు అందనుంది.
2018 రబీలో జీవాలకు వదిలిన పప్పుశనగ పంట
ఖరీఫ్‌లో రూ.937.40 కోట్లు
గత ఖరీఫ్‌లో జూన్ మినహా జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో వేరుశనగ, ఇతర పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఖరీఫ్‌లో 338.4 మి.మీ గానూ 37 శాతం తక్కువగా 212 మి.మీ వర్షం కురిసింది. హెక్టారుకు కేవలం 178 కిలోల వేరుశనగ పంట దిగుబడులు వచ్చినట్లు పంట కోత ప్రయోగాలు వెల్లడి చేస్తున్నాయి. దీంతో పెట్టుబడుల్లో సగం కూడా చేతికిరాక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు విడతల్లో జిల్లాలోని మొత్తం 63 మండలాలను కరువు జాబితాలో చేర్చింది.
పంట నష్టం తీవ్రత తెలుసుకునేందుకు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం పేరుతో కేంద్ర కరువు బృందం గత డిసెంబర్‌లో జిల్లాలో పర్యటించి వెళ్లింది. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ తరఫున పంట నష్టం కింద రూ.967 కోట్లు ఇన్‌పుట్ కావాలని అధికారులు కేంద్ర బృందానికి నివేదిక కూడా ఇచ్చారు. ఆతర్వాత మరోసారి క్షేత్రస్థాయిలో పంట నష్టం అంచనా వేసిన అధికారులు చివరకు రూ.937.40 కోట్లు ఇన్‌పుట్‌సబ్సిడీ కావాలని కోరారు. ఇందులో వేరుశనగ పంట నష్టం రూ.710.67 కోట్లు ఉండగా మిగతా 14 రకాల పంటల నష్టం రూ.226.73 కోట్లు చూపించారు. మొత్తంగా 6,95,403 మంది రైతులకు పరిహారం ఇవ్వాలని కోరారు.
రబీలోనూ అదే దుస్థితి
ఖరీఫ్ దెబ్బతిన్నా... రబీలోనైనా గట్టెక్కుదామనుకున్న జిల్లా రైతులపై ఈశాన్య రుతుపవనాలు కూడా నీళ్లు చల్లడంతో రబీ గల్లంతైపోయింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో సాధారణంగా 155.5 మి.మీ వర్షం పడాల్సి ఉండగా కేవలం 50 మి.మీ వర్షం కురిసింది. 67 శాతం మేర లోటు వర్షపాతం నమోదు కావడంతో 77 వేల హెక్టార్లలో వేసిన ప్రధానపంట పప్పుశనగ తుడిచిపెట్టుకుపోయింది. మిగతా పంటలు కూడా బాగా దెబ్బతినడంతో పెట్టుబడుల్లో సగం కూడా చేతికిరాలేదు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం రబీ కింద 32 మండలాలను కరువు జాబితాలోకి చేర్చింది. కరువు మండలాల జాబితాలో పప్పుశనగ సాగు చేసే వజ్రకరూరు, విడపనకల్లు, యల్లనూరు, పెద్దపప్పూరు లాంటి మండలాలను స్థానం లేకుండా పోయింది.
మిగతా మండలాల్లో పంట నష్టం అంచనా వేసిన అధికారులు 46,621 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. 43,750 మంది రైతులకు రూ.46.83 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ అవసరమని ప్రభుత్వానికి నివేదించారు. ఇలా ఖరీఫ్, రబీ కింద 7.23 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతినగా... 7.40 లక్షల మంది రైతులకు రూ.984.23 కోట్లు ఇన్‌పుట్‌సబ్సిడీ రావాల్సి ఉంది. రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి చంద్రబాబు సర్కార్..ఇన్‌పుట్ సబ్సిడీ ఫైలును గల్లంతు చేసి చేతులు దులిపేసుకున్నారు. అయితే తాజాగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రకటనతో రైతుల మోములో ఆనందం కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment