
సాక్షి, అనంతపురం: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు ఏకపక్షంగా వ్యహరిస్తున్నారు. అధికార టీడీపీకి చెందిన నాయకులుకు సహకరిస్తూ.. వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలపై పోలీసుల మౌన వైఖరిపట్ల స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాప్తాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్‌కు ఓట్లు వేయకపోతే చంపుతామని ఓటర్లని బహిరంగంగా బెదిరించిన టీడీపీ నేత ముకుందనాయుడుపై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మంత్రి పరిటాల సునీత సమక్షంలోనే గతవారం రోజులుగా రాప్తాడు నియోజకవర్గంలో అలజడి చేస్తోన్న ముకుందనాయుడపై కేవలం బైండోవర్ కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు.
ఓటర్లను హెచ్చరిస్తూ.. భయభ్రాంతులకు గురిచేస్తోన్న టీడీపీ నేతలను అరెస్ట్ చేయకుండా.. పోలీసులకు వారికే అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. మంత్రి సునీత ఒత్తిళ్ల కారణంగానే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలావుడంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్తి తోపుదుర్తి రాజేశేఖర్ రెడ్డిపై అక్రమంగా మూడు సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు. దీంతో అనంతపురం పోలీసుల తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు టీడీపీకి మద్దతుగా నిలుస్తోన్న విషయం తెలిసిందే. దీనిని ఆసరాగా తీసుకున్న చంద్రబాబు నాయుడు ఓటర్లకు డబ్బులు పంచడానికి ఏకంగా పోలీసు వాహనాలనే ఉపయోగిస్తున్నారు.
పోలీసు నిఘా వ్యవస్థ చర్యలు శూన్యం
పోలీసుశాఖలో నిఘా వ్యవస్థ దారుణంగా విఫలమైంది. నేరస్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రౌడీషీటర్లు, హత్యకేసు నిందితులు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలి. అయితే జిల్లాలో పోలీసు నిఘా వ్యవస్థ పెద్దగా దృష్టి సారించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అధికారపార్టీ అనుయాయులుగా చెలమాణి అవుతున్న రౌడీషీటర్ల విషయంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో నాల్గవ పట్టణ పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న ఓ సీఐ నేరస్తులకు రాచమర్యాదలు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో చాలావరకు వారిని బైండోవర్లు కూడా చేయలేదని తెలుస్తోంది. అంతేకాకుండా ప్రజలను భయాబ్రాంతులకు గురిచేసేలా వ్యవహరిస్తున్నా పట్టించుకోవడం లేదు.