సాక్షి, అమరావతి : అవ్వా తాతలకు శుభవార్త. ముఖ్యమంత్రిగా గురువారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాక వృద్ధ్యాప్య పెన్షన్‌ను నెలకు రూ.2,250లకు పెంచే ఫైలుపై ఆయన సీఎంగా తొలి సంతకం చేశారు. ఆ సంతకాన్ని తక్షణమే అమలుచేస్తూ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్ ఉత్తర్వులు జారీచేశారు. వృద్ధాప్య పెన్షన్ పొందడానికి గరిష్ఠ వయో పరిమితిని 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించారు. వితంతవులు, గీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్‌ను రూ.2,250కు పెంచారు. వికలాంగులకు ఇచ్చే పెన్షన్‌ను రూ.మూడు వేలకు పెంచారు. ప్రస్తుతం డయాలసిస్ రోగులకు నెలకు రూ.3,500 చొప్పున పెన్షన్ ఇస్తున్నారు. దాన్ని రూ.పది వేలకు పెంచారు.
ఈ పెన్షన్ల పెంపును తక్షణమే వర్తింపజేశారు. అంటే.. పెంచిన పెన్షన్‌ను జూలై 1న పంపిణీ చేస్తారు. ఈ పథకానికి వైఎస్సార్ పెన్షన్ కానుకగా ప్రభుత్వం నామకరణం చేసింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక చేసిన తొలి సంతకాన్ని అమలుచేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఎన్నికల ప్రచారంలోనూ నవరత్నాల్లో భాగంగా పెన్షన్‌ను రూ.మూడు వేలకు పెంచుకుంటూ పోతామని హామీ ఇచ్చారు. ఆ హామీని అమలుచేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలి సంతకం చేయడంపై అవ్వాతాతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, వికలాంగులను ప్రస్తుతం రెండు కేటగిరీలుగా విభజించి పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. ఇకపై వారిని ఒకే కేటగిరి కిందకు తెచ్చి నెలకు రూ.మూడు వేల చొప్పున పెన్షన్ పంపిణీ చేస్తారు.
అలాగే, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్న వారికి నెలకు రూ.3500 నుంచి రూ.పది వేల చొప్పున పెన్షన్ ఇవ్వనున్నారు. పెంచిన పెన్షన్‌ను వృద్ధాప్య, వికలాంగ, వితంతు, ఒంటరి మహిళ, డయాలసిస్ విభాగాల్లో 53,32,593 మందికి పంపిణీ చేస్తారు. కాగా, పెన్షన్ల పెంపు జూన్ నుంచి అమల్లోకి వస్తుందని.. జూలై నుంచి పెరిగిన రూ.250తో కలిపి మొత్తం రూ.2,250 చెల్లిస్తారని సెర్ప్ అధికారులు తెలిపారు. మే నెలకు సంబంధించిన పెన్షన్లు జూన్ ఒకటవ తేదీ నుంచి పంపిణీ జరుగుతుందని.. అలాగే, జూన్ నెల పెన్షన్లు జులై ఒకటవ తేదీ నుంచి పంపిణీ జరుగుతుందని వారు వివరించారు. కాగా, జూన్ నెల నుంచి పంపిణీ జరిగే మే నెల పెన్షన్ల నిధులు రూ.1,094.91కోట్లను గురువారమే మండలాల వారీగా ఆయా ఎంపీడీవోల ఖాతాలకు జమచేసినట్లు అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment