టీ గరంగరం! | Andhra Pradesh assembly to resume debate on Telangana | Sakshi
Sakshi News home page

టీ గరంగరం!

Published Thu, Jan 2 2014 11:50 PM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

Andhra Pradesh assembly to resume debate on Telangana

  • గొంతు విప్పుతాం
  •      బిల్లు ఆమోదం పొందేలా చూస్తాం
  •      అవసరమైతే అన్ని పార్టీల సహకారం
  •      ‘సాక్షి’తో జిల్లా శాసనసభ్యులు
  •      నేటినుంచే అసెంబ్లీ సమావేశాలు
  •  ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు శుక్రవారం నుంచి పునః ప్రారంభం కానున్నాయి. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ’ ప్రధాన ఎజె ండాగా అసెంబ్లీ వేడెక్కనుంది. గత నెల 12న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లుపై చర్చ ప్రస్తావనకు వచ్చినా గందరగోళం నడుమ సభ వాయిదా పడింది. 19న వాయిదా పడిన సభ తిరిగి శుక్రవారం ప్రారంభమవుతున్న నేపథ్యంలో అందరి దృష్టి అసెంబ్లీ సమావేశాలపైనే ఉంది. డ్రాఫ్టు బిల్లుపై అసెంబ్లీలో చర్చించే విషయంలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత నేతలు నిట్టనిలువునా చీలిపోయారు. ఈ నేపథ్యంలో జిల్లా నుంచి శాసనసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న నేతలు ‘తెలంగాణం’ వినిపిస్తామని చెప్తున్నారు.
     - సంగారెడ్డి, సాక్షి ప్రతినిధి
     
     చర్చ ప్రారంభమైంది
    రాష్ట్ర పునర్విభజన బిల్లుపై మంత్రి శ్రీధర్ బాబు ఇప్పటికే చర్చ ప్రారంభించారు. ప్రస్తుత సమావేశాల్లో చర్చను కొనసాగించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ స్ఫూర్తికి ఎవరూ విరుద్ధంగా వ్యవహరించొద్దు. ఇతర అంశాలను చర్చకు తెచ్చే ప్రయత్నం చేయొద్దు. సీమాంధ్ర ప్రాంత సభ్యులు అక్కడి ప్రజల మనోభావాలు చర్చల ద్వారా వెల్లడించాలి.
     - టి.హరీష్‌రావు(టీఆర్‌ఎస్), ఎమ్మెల్యే, సిద్దిపేట
     
    తెలంగాణ ఎవరూ ఆపలేరు
    తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవరూ అడ్డుకోలేరు. బిల్లు అసెంబ్లీ వరకు వచ్చిన తర్వాత చర్చను అడ్డుకోవాలనుకోవడం మూర్ఖత్వం. రెండు రాష్ట్రాలు ఏర్పడితేనే సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని అసెంబ్లీలో చర్చ సందర్భంగా నొక్కి చెప్తా. ఇప్పటికే రెండు ప్రాంతాల్లో అభివృద్ధి నిలిచిపోయింది.
     - మైనంపల్లి హన్మంతరావు (టీడీపీ), ఎమ్మెల్యే, మెదక్
     
    ఐక్యతతో ముందుకు సాగుతాం
    ఆరు దశాబ్దాలుగా సాగుతున్న తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో డ్రాఫ్టు బిల్లు అసెంబ్లీకి చర్చకు వచ్చింది. రాష్ట్ర ఏర్పాటుతోనే తెలంగాణ ప్రాంతంలో అన్ని వర్గాలకు న్యాయం దక్కుతుంది. సీనియర్ సభ్యుడిగా అసెంబ్లీలో బిల్లు చర్చకు వచ్చేలా ఒత్తిడి చేస్తాం. ఈ దిశగా ఇతర పార్టీ ఎమ్మెల్యేలనూ కలుపుకుపోతాం.
     - చెరుకు ముత్యంరెడ్డి (కాంగ్రెస్), ఎమ్మెల్యే, దుబ్బాక
     
    త్వరగా పూర్తయ్యేలా చూస్తాం
    అసెంబ్లీలో త్వరగా తెలంగాణ డ్రాఫ్టు బిల్లుపై చర్చ పూర్తయ్యేలా ఒత్తిడి తెస్తాం. చర్చ సందర్భంగా సమస్యలు తలెత్తకుండా చూస్తాం. బిల్లు ఆమోదం పొందేలా చూడటమే అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా మా ముందున్న లక్ష్యం. అధిష్టానం సూచనల మేరకు బిల్లుపై చర్చ సజావుగా సాగుతుందని భావిస్తున్నా. పార్లమెంటులో బిల్లు ఆమోదానికి ఎలాంటి అడ్డంకులూ ఉండబోవు.
          - టి.నందీశ్వర్ గౌడ్ (కాంగ్రెస్), ఎమ్మెల్యే, పటాన్‌చెరు
     
    చర్చించేలా చూస్తాం
    తెలంగాణ బిల్లుపై చర్చ మొదలయ్యే సమయంలో సహచర మంత్రి శ్రీధర్‌బాబు శాఖను మార్చడం అప్రజాస్వామి కం. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని నిరసిస్తూ గవర్నర్‌ను కలిసి మా అభిప్రాయాలు చెప్పాం. ఈ నెల 23లోపు డ్రాఫ్టు బిల్లుపై చర్చ ముగియాల్సి ఉన్నందున సమావేశాలు సజావుగా సాగేలా తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం.
     - సునీతా లక్ష్మారెడ్డి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి
     
    తొలగింపుపై నిరసన తెలుపుతాం
    తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్దేశించిన డ్రాఫ్టు బిల్లుపై చర్చ జరిగేలా అసెంబ్లీలో పట్టుబడతాం. మంత్రి శ్రీధర్‌బాబు శాఖను మార్పిడి చేయడంపై నిరసన తెలుపుతాం. బిల్లు చర్చకు రావద్దనే దురుద్దేశంతోనే శ్రీధర్ బాబు శాఖ మార్పిడి జరిగినట్లు స్పష్టమవుతోంది. పార్లమెం టులో బిల్లు ఆమోదం పొందే వరకు పట్టు వదిలేది లేదు.
     - పి. కిష్టారెడ్డి (కాంగ్రెస్), ఎమ్మెల్యే, నారాయణఖేడ్
     
    కుట్రలు చేస్తే అడ్డుకుంటాం
    అసెంబ్లీలో తెలంగాణ బిల్లు చర్చకు వచ్చేలా చూస్తాం. సీమాంధ్ర ప్రాంత ప్రతినిధుల అభిప్రాయాలు వినిపించాలని కోరుతాం. అసెంబ్లీలో బిల్లుపై చర్చను అడ్డుకునే కుట్రలపై అప్రమత్తంగా ఉంటూ అడ్డుకుంటాం. అన్ని పార్టీల ప్రతినిధులను కలిసి చర్చ జరిగేలా చూడాలని నిర్ణయించాం.  
     - టి. నర్సారెడ్డి(కాంగ్రెస్), ఎమ్మెల్యే, గజ్వేల్
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement