హైదరాబాద్:ఈ రోజు సుదీర్ఘంగా జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ సమావేశంలో రాష్ట్ర రాజధానిపై మంత్రి వర్గ ఉప సంఘం వేయాలని కేబినెట్ నిర్ణయించింది. త్వరలో ఏర్పాటు కాబోయే ఈ కమిటీ విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటుకు అవసరమైన స్థలసేకరణపై దృష్టి సారించనుంది. ఐదు గంటలపాటు జరిగిన సమావేశంలో ఎయిడెడ్ టీచర్ల పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచగా, డీఎస్సీ అభ్యర్థుల వయోపరిమితిన 40 ఏళ్లకు పెంచారు.
విశాఖలో 400 మెగావాట్లతో థర్మల్ విద్యుత్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే భూముల సేకరణకు రైతులు సహకరిస్తే మంగళగిరి లేదా నూజివీడులో రాజధాని ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు మంత్రులకు తెలిపారు.