సాక్షి, అమరావతి : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దగ్గర ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తూ వైఎస్‌తోపాటు హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ పి. సుబ్రహ్మణ్యం కుమార్తె పి. సింధు సుబ్రహ్మణ్యంను ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌గా నియమించింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన వద్ద ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన సుబ్రహ్మణ్యం.. చిత్తూరు జిల్లాలో జరగాల్సిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు వైఎస్‌తో కలిసి హెలికాప్టర్‌లో వెళ్తూ 2009 సెప్టెంబరు రెండున హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కుమార్తె పి. సింధు సుబ్రహ్మణ్యంకు కారుణ్య నియామకం కింద డిప్యూటీ కలెక్టరు పోస్టు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీఏ చదివిన సింధు సుబ్రహ్మణ్యంను డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. నియామక ఉత్తర్వులు అందుకున్న తర్వాత నెలరోజుల్లోగా ఆమె డ్యూటీలో చేరాల్సి ఉంటుంది. ఆమెకు రిజిస్టర్ పోస్టులో నియామక ఉత్తర్వులు పంపుతారు.
Comments
Please login to add a commentAdd a comment