లక్షన్నర ఖాళీలు! | Andhra pradesh government neglects to announce employment notice | Sakshi
Sakshi News home page

లక్షన్నర ఖాళీలు!

Published Sun, Dec 14 2014 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 6:07 PM

లక్షన్నర ఖాళీలు!

లక్షన్నర ఖాళీలు!

* రాష్ట్రంలో ఖాళీగా 1.39 లక్షల ఉద్యోగాలు.. భర్తీపై తాపీగా కదులుతున్న ప్రభుత్వం
* నిరుద్యోగుల్లో అంతకంతకూ పెరుగుతున్న ఆందోళన
* ఎన్నికల హామీ మేరకు బాబు ఉద్యోగాలిస్తారని నిరుద్యోగుల ఎదురుచూపు
* అవసరం లేని పోస్టుల పేరుతో భర్తీ ప్రక్రియనే నిలిపేయడం తగదంటున్న అధికారులు

 
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు లక్షన్నర ఉద్యోగాల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఖాళీ పోస్టు ల భర్తీ విషయంలో ప్రభుత్వం చాలా నిదానంగా కదులుతుండటంతో లక్షలాది నిరుద్యోగుల్లో ఆందోళన పెరుగుతోంది. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1.39 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తంలో ఖాళీలు ఉండటంతో నిరుద్యోగులూ ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకున్నారు. పైగా, అధికారంలోకి రాగానే ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2.000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. అయితే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగా నే ఇందుకు విరుద్ధమైన నిర్ణయం తీసుకుంది.
 
 ఎటువంటి భర్తీలు చేయరాదంటూ ఏపీపీఎస్సీకి ముఖ్యమంత్రి కార్యాలయం లేఖ రాసింది. దీంతో నిరుద్యోగులు కంగుతిన్నారు. అయితే, గత ప్రభుత్వం పోస్టులు భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగుల వయస్సు మీరిపోయిందనే కారణంతో చంద్రబాబు సర్కారు గరిష్ట వయో పరిమితిని 34 సంవత్సరాల నుంచి 39 సంవత్సరాలకు పెంచింది. ఈ నిర్ణయం నిరుద్యోగుల్లో మళ్లీ ఆశలు రేకెత్తించింది. వయస్సయితే పెంచా రు కానీ, ఆ తర్వాత ఉద్యోగాల భర్తీకి వేగవంతమైన చర్యలు చేపట్టలేదు. మరోపక్క.. ఈ పోస్టు ల్లో ప్రస్తుత అవసరాలకు పనికి రానివెన్నో తేల్చడానికి సర్కారు ఓ కమిటీని నియమించింది.  ఆ కమిటీకి మూడు నెలలు గడువిచ్చింది. దీంతో అప్పటివరకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉండకపోవచ్చునన్న ఆందోళన నిరుద్యోగుల్లో నెలకొం ది. రాష్ట్ర విభజనతో సంబంధం పోస్టుల పంపిణీ ఇంకా జరగలేదు. వాటిలో ఖాళీలెన్నో పంపిణీ పూర్తయ్యే వరకు తెలియదు. రాష్ట్ర విభజనతో సంబంధం లేని జిల్లా, జోనల్, మల్టీ జోనల్‌లో ఖాళీగా ఉన్న పోస్టులనైనా భర్తీ చేస్తారేమోనని నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.
 
 ఈ మూడు విభాగాల్లో ఏకంగా 1,39,507 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మల్టీ జోనల్ పోస్టులు 1,944, జోనల్ పోస్టులు 22,462, జిల్లా స్థాయివి 1,15,101 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో మల్టీ జోనల్ పోస్టుల్లో అతి తక్కువ పోస్టులు మాత్రం విభజన ప్రక్రియలో భాగంగా పంపిణీ జరుగుతాయి. ఈ పోస్టులను మినహాయించి, మిగతా వాటిని భర్తీ చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. వెంట నే ఈ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని నిరుద్యోగులు కోరుతున్నారు. లేదంటే వయోపరిమితిని పెంచిన ఫలితం ఉండదని అభిప్రాయపడుతున్నారు. గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం విషయంలోనూ ఇదే జరిగిందని వివరిస్తున్నారు. కిరణ్ సర్కారు గరిష్ట వయోపరిమితిని 34 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాలకు పెంచినప్పటికీ, ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. ఈలోగా లక్షలాది నిరుద్యోగుల వయస్సు మీరిపోయింది. ఈసారి అలా కాకుండా వెంటనే పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టాలని కోరుతున్నారు. మరోపక్క.. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై ఎటువంటి కసరత్తు చేయని రాష్ట్ర ప్రభుత్వం.. మారిన అవసరాలకు తగినట్లుగా లేని పోస్టులను గుర్తించాలని నిర్ణయించింది. భవిష్యత్‌లో వాటిని రద్దు చేసేం దుకు తగిన సిఫార్సులు చేసేందుకు 10 ప్రధాన శాఖల ఉన్నతాధికారులతో ఒక కమిటీని నియమిస్తూ ఈ నెల 3వ తేదీన జీవో (నంబర్ 3917) జారీ చేసింది.  
 
 ఈ కమిటీ పలు ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఉన్న పోస్టులను అధ్యయనం చేసి, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా లేని పోస్టుల రద్దుకు సిఫార్సులు చేస్తుంది. ఇందుకు ప్రభుత్వం కమిటీకి మూడు నెలలు గడువిచ్చింది. అంటే మార్చి వరకు పోస్టుల భర్తీ ఉండదేమోనని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మూడు నెలల తర్వాత భర్తీ ప్రక్రియ చేపడితే చాలా సమయం వృథా అవడంతోపాటు వేలాది మంది అనర్హులయ్యే అవకాశముంటుందని అధికారులు కూడా చెబుతున్నారు. పైగా, రద్దు చేయడానికి అవకాశమున్న పోస్టుల పేరుతో భర్తీ ప్రక్రియనే ఆపడం భావ్యం కాదని కూడా అంటున్నారు. అందువల్ల వెంటనే ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపడితే రాష్ట్రంలోని యువతకు ప్రయోజనం కలుగుతుందని అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement