ఏపీలో 25 నైపుణ్య శిక్షణా కళాశాలలు | Andhra Pradesh Government to Set up Skill Development Colleges | Sakshi
Sakshi News home page

యువతకు ఉద్యోగ అవకాశాలు: మంత్రి గౌతమ్‌రెడ్డి

Published Thu, May 21 2020 8:52 PM | Last Updated on Wed, Jun 10 2020 2:22 PM

Andhra Pradesh Government to Set up Skill Development Colleges - Sakshi

అమరావతి : రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో నైపుణ్య శిక్షణా కళాశాలల ఏర్పాటుకు సత్వర చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య, జౌళి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ పెట్టుబడులు, మౌలికవసతులు శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సచివాలయం నాల్గవ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం 7 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. త్వరితగతిన స్థల సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి జిల్లాలో కనీసం 5 ఎకరాలకు తగ్గకుండా నైపుణ్య కళాశాలల నిర్మాణాల కోసం భూమిని సేకరించాలని సూచించారు. అనంతరం పరిశ్రమలు, సాంకేతిక, ఐటి, మౌలిక వసతుల శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో నైపుణ్య శిక్షణ కళాశాలల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో మూత పడిన పరిశ్రమలను మళ్ళీ గాడిలో పెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ రాష్ట్రంలో చిన్న తరహా పరిశ్రమలకు ఊతమిచ్చేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈ మేరకు స్కిల్ డెవలప్ మెంట్, ఐటీ శాఖ, సాంకేతిక విద్య శాఖలకు చెందిన అధికారుల నుంచి సూచనలు, సలహాలను స్వీకరించారు.

ప్రధానంగా మూత పడ్డ పరిశ్రమలు, కోవిడ్-19 కారణంగా సొంత ప్రాంతాలకు తరలిపోయిన వలస కూలీల వివరాలతో పాటుగా నిరుద్యోగ యువతీ, యువకుల వివరాలను సేకరించాలని ఆదేశించారు. ఆయా శాఖల్లోని దరఖాస్తులు అన్నింటినీ కలిపి ఒకే ప్రామాణికంలో అప్లికేషన్ తయారు చేయాలన్నారు. దీనిని పంచాయితీరాజ్ విభాగంకు చెందిన గ్రామ, వార్డు వాలంటరీలు ద్వారా నిరుద్యోగ యువతీ, యువకుల వివరాలను సేకరించాలన్నారు. వారికున్న స్కిల్స్ ఆధారంగా ఆయా పరిశ్రమలలో నైపుణ్య శిక్షణను అందించి ఉపాధి అవకాశాలను కల్పించవచ్చునన్నారు. సాంకేతిక, నైపుణ్యతలను బట్టి యువతకు భారీ, చిన్న తరహా పరిశ్రమల్లో మెరుగైన ఉద్యోగాలను కల్పించవచ్చన్నారు. వీటి కోసం పారిశ్రామిక, సాంకేతిక, నైపుణ్య, ఉపాధి రంగాలకు చెందిన శాఖలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని ఆయా శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం గడచిన ఏడాది పాలనలో చేపట్టిన సంస్కరణలు, సంక్షేమ పధకాలు తదితర అంశాలపై ఈనెల 28న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో మేధోమదన సదస్సు జరగనున్న నేపధ్యంలో పరిశ్రమలు, సాంకేతిక, నైపుణ్య, ఐటీ రంగాల పురోగతిని తెలియజేసేలా కార్యక్రమాలను రూపొందించాలన్నారు. అధికారులు ఈమేరకు సత్వరం కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో పరిశ్రమలు, సాంకేతిక, నైపుణ్యాభివృద్ధి, ఐటీ శాఖలకు చెందిన అధికారులు, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ చల్లా మధుసూదనరెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, నైపుణ్యాభివృద్ధి సంస్ధ శిక్షణా శాఖ ప్రత్యేక కార్యదర్శి అనంతరాము, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల వలవన్, ఎపీఎస్ఎస్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో అర్జా శ్రీకాంత్, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉపాధి, శిక్షణాశాఖ అధికారిణి లావణ్య, ఏపీఎస్ఎస్‌డీసీ ఎగ్జిక్యూటివ్స్ మహేశ్వరరెడ్డి, నాగేశ్వరరావు, పలువురు నైపుణ్యాభివృద్ధి సంస్థ, శిక్షణ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement