‘పవర్’ పోతోంది | Andhra pradesh government to buy electricity from private power plants | Sakshi
Sakshi News home page

‘పవర్’ పోతోంది

Published Mon, Dec 23 2013 1:27 AM | Last Updated on Fri, Nov 9 2018 6:16 PM

Andhra pradesh government to buy electricity from private power plants

* చేతికందిన ప్లాంట్లు వద్దంటున్న సర్కారు!
* ప్లాంట్లు మీరే ఉంచుకోండి.. మేం కరెంటు కొంటాం
* గడువు ముగుస్తున్న ప్రైవేటు విద్యుత్ ప్లాంట్లకు సర్కారు ఆఫర్
* విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లోని ‘బై బ్యాక్’ నిబంధనకు తూట్లు
* ప్రజలపై భారీగా చార్జీలు వడ్డించి.. ప్రైవేటుకు దోచిపెట్టే యత్నం
* ఆర్‌అండ్‌ఎం ప్రతిపాదనలతో ప్లాంట్లకు నోటీసుల జారీకి ఏర్పాటు
* ల్యాంకో, జీవీకే, స్పెక్ట్రమ్ ప్లాంట్లపై సర్కారు అవ్యాజ ప్రేమ
 
రూ. 300 కోట్లు ప్రభుత్వం  ఖర్చు పెడితే 778 మె.వా. ప్లాంట్లు సొంతమవుతాయి
*   అవి ప్రభుత్వపరమైతే .. ప్రైవేటు విద్యుత్ ప్లాంట్ల నుంచి అధిక ధరలు పెట్టి కరెంటు కొనాల్సిన గత్యంతరం తప్పుతుంది
*    చార్జీల పెంపు పేరుతో ప్రజల నుంచి ముక్కుపిండి వేల కోట్లు వసూలు చేయాల్సిన పని లేదు
*   ‘తాము చెప్పిందే రేటు’ అనే ప్రైవేటు ప్లాంట్ల పప్పులు ఉడకవు
*    చక్కగా ప్రభుత్వమే విద్యుత్‌ను ఉత్పత్తి చేసి.. వీలైనంత తక్కువ ధరకు వినియోగదారులకు అందివ్వవచ్చు
*    గడువు ముగిశాక ప్రభుత్వపరం కావాల్సిన ప్లాంట్లవి.. కానీ ఏం జరుగుతోంది.. ‘మీ ప్లాంట్లు మీ దగ్గరే ఉంచుకోండి.. కొంచెం మరమ్మతులు చేసుకోండి.. మీతో మళ్లీ మేం విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంటాం’ అంటూ ట్రాన్స్‌కో ఆ మూడు  ప్రైవేటు ప్లాంట్లకు బంపర్ ఆఫర్ ఇస్తోంది
*    ఆ ప్లాంట్లతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు  ముగుస్తున్నా మళ్లీ వాటికే కట్టబెట్టాలని చూస్తోంది.
*    అంతేనా.. ఆ ప్లాంట్లకు మరమ్మతు ఖర్చులు కూడా తానే ఇస్తాను అంటోంది.  నిర్వహణ వ్యయం కూడా చెల్లిస్తామని చెబుతోంది.
*    స్వల్ప వ్యయంతో మరమ్మతులు చేసి, ఉత్పత్తి చేపట్టి ప్రజలపై భారం తగ్గించే  అవకాశాన్ని సర్కారు కావాలనే జారవిడుచుకుంటోంది
 
సాక్షి, హైదరాబాద్: ఆ ప్రయివేటు కంపెనీలు విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పాయి. ఆ ప్లాంట్లకు అడ్డూ అదుపూలేని ప్రోత్సాహకాలు అందించింది రాష్ట్ర సర్కారు. అవి పెట్టిన అలవిమాలిన షరతులకు అంగీకరిస్తూ వాటి నుంచి విద్యుత్ కొనుగోళ్లకు ఒప్పందాలు కుదుర్చుకుంది ట్రాన్స్‌కో. ఆ ప్లాంట్లు పెట్టుబడి వ్యయంపై అడ్డగోలు లెక్కలు చెప్పినా కిమ్మనలేదు. ప్రజలపై చార్జీల మీద చార్జీలు బాదేస్తూ వినియోగదారుల ముక్కుపిండి వసూలు చేస్తోంది. ఆ ప్లాంట్లకు వేల కోట్ల రూపాయలు దోచిపెడుతోంది. అలాంటి ఓ మూడు ప్లాంట్లతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల గడువు మరో ఏడాదిన్నర, రెండేళ్లలో ముగియనుంది.

ఆ ఒప్పందాల ప్రకారం.. గడువు ముగిశాక ఆయా ప్లాంట్ల యజమానులకు నిబంధనల ప్రకారం కొంత సొమ్ము చెల్లించి వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. అలా స్వాధీనం చేసుకుంటే.. స్వల్ప మరమ్మతులతో వాటిని సర్కారే నడుపుకోవచ్చు. ప్రజలపై విద్యుత్ భారం తగ్గించవచ్చు. కానీ.. మన ట్రాన్స్‌కో ఏం చేయబోతోందో తెలుసా?! ‘మీ ప్లాంట్లు మీ దగ్గరే ఉంచుకోండి.. కొంచెం మరమ్మతులు చేసుకోండి.. కాస్త ఆధునీకరించండి.. మీతో మళ్లీ విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంటాం.. మీ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తాం’ అంటూ బంపర్ ఆఫర్ ఇస్తోంది!

అంటే దీని అర్థం.. ఒప్పందం ప్రకారం జాతిపరం కావాల్సిన విద్యుత్ ప్లాంట్లను అక్రమంగా ఆయా యజమానులకే అప్పగించటం.. వాటి నుంచి మళ్లీ అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయటం ద్వారా ఇంకా ఇంకా దోచిపెట్టటానికి సిద్ధమవటమే! అంతేకాదు.. ఆయా ప్లాంట్లకు మరమ్మతులు చేసినందుకు అయ్యే వ్యయాన్ని.. తూతూమంత్రంగా మరమ్మతులు చేసి భారీగా చూపిన వ్యయాన్ని కూడా ట్రాన్స్‌కోనే చెల్లిస్తుంది. ఈ దోపిడీ ఇంతటితో కూడా ఆగిపోదు. ఆయా ప్లాంట్ల ప్రస్తుత విలువను కూడా ఫిక్స్‌డ్ చార్జీల రూపంలో ట్రాన్స్‌కోనే చెల్లిస్తుంది.

ఇక ప్లాంట్ల నిర్వహణ వ్యయం ఎలాగూ ఎప్పటిలానే చెల్లించక తప్పదు! అంటే.. దాదాపు రూ. 300 కోట్లు చెల్లించి, మొత్తం 778 మెగావాట్ల సామర్థ్యం గల మూడు ప్లాంట్లను స్వాధీనం చేసుకుని, స్వల్ప వ్యయంతో మరమ్మతులు చేసుకుని, సొంతంగా నడుపుకుంటూ ప్రజలపై భారం తగ్గించే అవకాశాన్ని సమాధి చేసేసి.. ఆ ప్లాంట్లను వాటి యజమానులకే ఇచ్చేసి, వాటి మరమ్మతులు, నిర్వహణకు అయ్యే వ్యయాన్ని కూడా తానే చెల్లించి, వాటి నుంచి భారీ ధరలకు విద్యుత్ కొనుగోలు చేసి.. చార్జీల పేరుతో ప్రజల నడ్డివిరిచి వసూలు చేసి.. ఆ ప్లాంట్లకు దోచిపెట్టటం కాక మరేమవుతుంది?! ఇలాంటి బంపర్ ఆఫర్ అందుకోబోతున్న ఆ మూడు ప్లాంట్లూ ఏవంటే.. కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు చెందిన లాంకో పవర్ ప్లాంటుతో పాటు జీవీకే పవర్ ప్లాంటు, స్పెక్ట్రమ్ పవర్ ప్లాంటు!! ఈ ప్లాంట్లకు ట్రాన్స్‌కో బంపర్ ఆఫర్ వెనుక భారీ కుంభకోణం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

రూ. 300 కోట్లతో మూడు ప్లాంట్లు జాతికి సొంతం...
బై బ్యాక్..! ప్రైవేటు ప్లాంట్లతో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల్లో (పీపీఏ) ఉన్న ఈ కీలక ఒప్పందం గురించి చాలా మందికి తెలియదు. ఒప్పందంలో పేర్కొన్న నిర్ణీత కాలం గడిచిన తరువాత ఆయా ప్లాంట్లను రాష్ట్రం డిప్రిసియేషన్ (విలువ క్షీణత) అనంతర విలువను చెల్లించి సొంతం చేసుకునేందుకు వీలు కల్పించే నిబంధన ఇది. 216 మెగావాట్ల జీవీకే-1 ప్లాంట్ నుంచి విద్యుత్తు కొనుగోలుకు కాల పరిమితి 2015 జూన్‌తో, 354 మెగావాట్ల ల్యాంకో ప్లాంట్ కాల పరిమితి 2015 డిసెంబర్‌తో, 208 మెగావాట్ల స్పెక్ట్రమ్ ప్లాంట్‌కాల పరిమితి 2016 జనవరితో ముగియనున్నాయి.

ఈ ప్లాంట్ల నుంచి విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల గడువు ముగిసిన తరువాత ఆ ప్లాంట్లను ప్రభుత్వం కొనుగోలు చేయడానికి పూర్తి హక్కు ఉంది. పీపీఏ కాల పరిమితి ముగిసే సమయానికి ఈ విద్యుత్ ప్లాంట్ల డిప్రిసియేషన్‌ను లెక్కించిన తరువాత స్పెక్ట్రమ్‌కు రూ.82 కోట్లు, జీవీకేకు రూ. 87 కోట్లు, ల్యాంకోకు రూ. 131 కోట్లు విలువ ఉంటుందని ట్రాన్స్‌కో అంచనా కట్టినట్లు సమాచారం. ఈ మొత్తాన్ని ట్రాన్స్‌కో లేదా ఏదేని డిస్కం గనుక చెల్లిస్తే పీపీఏల్లోని బయ్ బ్యాక్ క్లాజు ప్రకారం ఆ ప్లాంట్లు రాష్ట్రం సొంతవువుతారుు.

మొత్తంగా దాదాపు రూ. 300 కోట్ల లోపు చెల్లిస్తే చాలు.. 778 మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లు ప్రభుత్వపరం అవుతాయి. అంటే.. ఇన్నేళ్లు వినియోగదారుల నుంచి భారీ గా డబ్బును పిండిన ఆ ప్లాంట్లను రాష్ట్రమే సొంతం చేసుకుని, కాసిన్ని నిధులతో మరమ్మత్తులు చేసుకుంటే కొన్నేళ్లపాటు కారుచౌకగా కరెంటును ఉత్పత్తి చేసుకోవటానికి వీలు కలుగుతుంది. ప్లాంట్లకు ఫిక్స్‌డ్ చార్జీలు వంటి భారం ఉండదు.

ప్రయివేటుకే ఉంచేసి.. సొమ్ములు చెల్లిస్తారట!
కానీ.. ఈ మూడు ప్లాంట్లను సొంతం చేసుకోకుండా.. ఆయా సంస్థలే మరమ్మతులు, ఆధునికీకరణ (రినోవేషన్ అండ్ మోడర్నైజేషన్ - ఆర్ అండ్ ఎం) చేసుకుని, నిర్వహించుకునేందుకు అవకాశమిస్తూ నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ట్రాన్స్‌కో ఈ నోటీసులు ఇచ్చిన తరువాత ఈ ప్రయివేటు విద్యుత్ ప్లాంట్లు మరమ్మతులు, ఆధునికీకరణకు సంబంధించి పూర్తి ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్లాంట్లతో కుదుర్చుకున్న పీపీఏల ప్రకారం.. ఈ ప్లాంట్లకు అయిన మొత్తం వ్యయాన్ని ట్రాన్స్‌కో పదేళ్ల వ్యవధిలోనే పూర్తిగా చెల్లించింది. 11వ ఆర్థిక సంవత్సరం నుంచి ఈ విద్యుత్ ప్లాంట్లకు మూలధన చెల్లింపు, బీమా, రోజువారీ నిర్వహణ (ఒ అండ్ ఎమ్) వ్యయం, నిర్వహణ వ్యయం (వర్కింగ్ కేపిటల్), కన్స్యూమబుల్ భాగాలు, వేరియబుల్ ధరతో పాటు స్థిర చార్జీలను రాష్ట్ర వినియోగదారులు చెల్లిస్తూనే ఉన్నారు. పీపీఏ కాలపరిమితి ముగియడానికి 340 నుంచి 520 రోజుల వుుందే ట్రాన్స్‌కో ఈ ప్లాంట్ల బై బ్యాక్‌కు సంబంధించి ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది. ఇప్పుడు ‘ఆర్ అండ్ ఎమ్’ అవకాశం ఇవ్వటానికి ట్రాన్స్‌కో సిద్ధపడటవుంటే.. జాతిపరం కావల్సిన ప్లాంట్లను వుళ్లీ ఆ యూజవూన్యాలకే వదిలేయుటం.. మళ్లీ ఈ పీపీఏల కాలపరిమితిని పొడిగించడం.. ఆర్ అండ్ ఎంకు అయ్యే వ్యయంతో పాటు, వాటికి స్థిరచార్జీలు కూడా చెల్లించడం.. వుళ్లీ వుళ్లీ అధికధరలకు కరెంటు కొని వినియోగదారులపై వురింత భారం మోపటమే అవుతుంది!

ఆ విధానంతో ప్రజలపై మరింత భారం...
ప్రస్తుతం విద్యుత్ ప్లాంట్లలో స్పెక్ట్రమ్, జీవీకేల స్టేషన్ హీట్ రేట్ (ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే ఉష్ణశక్తి) రెండు వేల కిలోకేలరీలకు ఒక యూనిట్. లాంకో ప్లాంటులో 1,900 కిలోకేలరీలకు ఒక యూనిట్‌గా ఉంది. ఈ హీట్ రేట్ తగ్గితే.. విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించే గ్యాస్ వ్యయం తగ్గుతుంది. కానీ.. ఈ సంస్థలు వినియోగిస్తున్న విద్యుత్ ఉత్పాదన  యంత్రాలు 90వ దశకానివి. వాటిని తిరిగి మరమ్మతు చేయడం వల్ల వీటి స్టేషన్ హీట్‌రేట్ పెద్దగా తగ్గే అవకాశాలు లేకపోయినా.. ఇందుకోసం ఒక్కో ప్లాంటు మరమ్మతులు, ఆధునీకరణకు కనీసం రూ. 300 కోట్ల నుంచి రూ. 450 కోట్ల మేర వ్యయం అవుతుంది. ఈ వ్యయాన్ని ట్రాన్స్‌కో తిరిగి కుదుర్చుకునే విద్యుత్  కొనుగోలు ఒప్పందం కాలపరిమితిలోగా చెల్లించడమేకాక, ప్రస్తుతం డిప్రిసియేషన్‌కు పోగా లెక్కించిన మొత్తానికి స్థిర చార్జీలు (ఫిక్స్‌డ్ చార్జీలు) కూడా చెల్లించాల్సి ఉంటుంది.

అంటే భారీగా కరెంటు కొనుగోలు భారం మళ్లీ ప్రజలపై పడుతూనే ఉంటుంది. ప్రభుత్వమే ఈ విద్యుత్ ప్లాంట్లను బయ్ బ్యాక్ నిబంధనలో భాగంగా స్వాధీనం చేసుకుంటే.. ఎలాంటి స్థిరచార్జీలు చెల్లించాల్సిన అవసరం లేకుండా, చిన్నపాటి మరమ్మతులతో తక్కువ ధరకు విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంతకాలం ప్రజల నుంచి భారీగా చార్జీలు పిండి ఈ విద్యుత్ సంస్థలకు కట్టబెట్టిన మొత్తం నుంచి కొంతమేరకైనా ప్రజలకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయకుండా ఈ సంస్థలకే ఆర్ అండ్ ఎమ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నోటీసులు సిద్ధం చేసినట్లు సమాచారం. వచ్చే వారంలో వీటిని ఆయా విద్యుత్ ప్లాంట్లకు పంపించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
 
ఓ అండ్ ఎమ్ మరీ ఎక్కువ...
ప్రయివేటు విద్యుత్ ప్లాంట్లకు ట్రాన్స్‌కో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) కింద చెల్లిస్తున్న వ్యయం మరీ ఎక్కువ ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రైవేట్ సంస్థలకు ఏడాదికి అయ్యే వ్యయం రూ. 10 కోట్లకు మించకపోయినా.. వీటికి మాత్రం రూ. 40 కోట్ల నుంచి రూ. 60 కోట్ల వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం.

ఈ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు దశలోనే పెట్టుబడి వ్యయాన్ని అధికంగా చూపించడం వల్ల వందల కోట్ల రూపాయలు ప్రజల నుంచి పిండి మరీ ఈ విద్యుత్ ప్లాంట్ల యాజమాన్యాలకు ప్రభుత్వాలు చెల్లించాయి. ప్రస్తుతం వాటి కాలపరిమితి ముగియడానికి వచ్చిన సమయంలోనూ ప్రజలకు ఉపయోగపడేలా కాకుండా విద్యుత్ ప్లాంట్ల యజమానులకే దాసోహం అనే విధంగా వ్యవహరించడం రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేయుడమేనని ఓ చీఫ్ ఇంజనీర్ వ్యాఖ్యానించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement