రుణమాఫీ వివరాలు ఆన్‌లైన్లో ఉంచిన సర్కారు
ఆదివారం రాత్రి వరకూ తెరచుకోని వెబ్‌సైటు
భారం విరగడైందో, లేదో తెలియక అన్నదాతల గుబులు
సాక్షి, రాజమండ్రి :అన్నదాతలను రుణమాఫీ గందరగోళం ఇంకా వీడలేదు. వ్యక్తిగతంగా కూడా రైతుల రుణ మాఫీ వివరాలను తెలుసుకునేందుకు ఆదివారం మధ్యాహ్నం http:// apcbs portal.ap.gov.in/loanstatus/LoanStatus.aspx(ఏపీసీబీఎస్‌పీఓఆర్‌టీఏఎల్.ఏపీ.జీఓవీ.ఐఎన్/లోన్ స్టేటస్.ఏఎస్‌పీఎక్స్) అనే వెబ్‌సైట్లో ఉంచి నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రైతులు ఆతృతగా ఇంటర్‌నెట్ సెంటర్ల వద్దకు చేరుకునా రాత్రి వరకూ ఆ వెబ్‌సైట్ తెరుచుకోలేదు. బ్యాంకు బ్రాంచీల వారీగా మాఫీ పొందిన రైతుల వివరాలు కూడా ఇదే వెబ్‌సైట్లో పెట్టారు. అయితే బ్యాంకుల్లో నిర్దేశించిన అధికారి మాత్రమే వివరాలు రాబట్టే అవకాశం కల్పించారు. ఆదివారం కావడంతో సోమవారం బ్యాంకులు తెరుచుకునే వరకూ ఏమీ చెప్పలేమని బ్యాంకు అధికారులు అనడంతో రైతులకు ఉత్కంఠ తప్పలేదు.
లబ్ధిదారుల్లో భారీ కోత!
రుణ మాఫీ తొలి జాబితాలో వాస్తవంగా ఎంత మందికి చోటు లభించిందనే అంశంపై స్పష్టత లేదు. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రభుత్వం ఆన్‌లైన్‌లో ఉంచిన అర్హుల జాబితాలో భారీగా కోత పెట్టింది. జిల్లాలో 3.60 లక్షల మంది పంట రుణాలు, 4.5 లక్షల మంది బంగారం తాకట్టు పెట్టి రుణాలు పొందారు. మొత్తం సుమారు రూ.1260 కోట్ల మేర రుణాలు తీసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల వాగ్దానంగా ఎలాంటి షరతులు లేకుండా అందరికీ రుణాలు మాఫీ చేస్తామన్నారు. అయితే అధికారంలోకి వచ్చాక రోజుకో ఆంక్ష పెడుతూ వచ్చారు. 20 శాతం నగదు, 80 శాతం సర్టిఫికెట్ల రూపంలో మాఫీ చెల్లిస్తామని చెప్పారు.
అనంతరం ముందుగా రూ.50 వేల లోపు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ జాబితాలో కూడా వడబోత అమలు చేశారు. అర్హత ఉన్నా సాకులు వెతికి మరీ పేర్ల తొలగింపునకు పాల్పడింది ప్రభుత్వం. ఆన్‌లైన్ జాబితాపై అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఆధార్, రేషన్ కార్డుల్లో పేర్ల తేడాలతో కొందరిని తొలగించినట్టు తెలుస్తోంది. మొత్తం 14 కాలమ్‌లతో కూడిన ప్రొఫార్మాలో వడబోత విధానం అమలు చేశారు. ప్రధానంగా రుణ పరిమితి (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) నిబంధనతో 25 శాతానికి పైగా రైతులను తొలగించినట్టు తెలుస్తోంది.
బ్యాంకర్లలోనూ అయోమయం
బ్యాంకర్లు కూడా రుణమాఫీ అర్హుల జాబితాలపై రైతులే కాక అధికారులు కూడా ‘ఈ చిక్కుముడి ఏంటబ్బా’ అంటూ తలలు పట్టుకుంటున్నారు. ‘రుణ మాఫీ వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టినట్టు తెలుస్తోంది. కానీ సోమవారం బ్యాంకులు తెరుచుకునే వరకూ వివరాలు వెల్లడించలేం. బ్యాంకుల వారీగా వివరాలు శాఖాధిపతులకు అందుతాయి. రైతులు బ్రాంచిలకు వెళ్తే పూర్తి సమాచారం ఇస్తారు’ అని ఎస్‌బీఐ రాజమండ్రి రీజనల్ మేనేజర్ పి.రాజేంద్రప్రసాద్ చెప్పారు.
‘మాఫీ’పై వీడని చిక్కుముడి
Published Mon, Dec 8 2014 12:38 AM | Last Updated on Mon, Oct 1 2018 1:21 PM
Advertisement
Advertisement