రక్షణలేని రాజధాని!
► శాంతిభద్రతల పరిరక్షణపై ప్రభుత్వానికి కొరవడిన చిత్తశుద్ధి
► కొత్త పోలీస్‌స్టేషన్ల ఏర్పాటుపై మీనమేషాలు
► రెండు జిల్లాల్లో పెరుగుతున్న నేరాలు...
► స్పష్టం చేసిన హోం శాఖ వార్షిక నివేదిక
‘అమరావతిని ప్రజా రాజధానిగా తీర్చిదిద్దుతాం. కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేస్తాం.’ – ఇవీ సీఎం చంద్రబాబు తరచూ చెప్పే మాటలు
‘రాష్ట్రంలో అత్యధిక క్రైం రేటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే ఉంది. రెండు జిల్లాల్లో అన్ని రకాల నేరాలు పెరిగాయి.’ – రాష్ట్ర హోంశాఖ వార్షిక నివేదిక ఇదీ.
సాక్షి, అమరావతిబ్యూరో: అమరావతి కమిషనరేట్ ఏర్పాటు... రాజధాని అవసరాలకు తగినట్లుగా కొత్త పోలీస్‌స్టేషన్లు... అసెంబ్లీ నియోజకవర్గాల ప్రాతిపదికన పోలీస్‌స్టేషన్ల పరిధి పునర్ వ్యవస్థీకరణ... ఇలా అనేక ప్రతిపాదనలను ప్రభుత్వం రెండేళ్లుగా పక్కన పడేసింది. రాజధానిలో భద్రతా వ్యవస్థ పటిష్టతపై చెబుతున్న మాటలకు... చేస్తున్న పనులకు పొంతన ఉండడం లేదు. ప్రజారాజధానిగా అమరావతిని నిర్మిస్తామని, ఇందులో భాగంగా పటిష్ట భద్రత చర్యలు చేపడతామని ప్రభుత్వం రెండేళ్ల కిందట చేసిన ప్రకటనల్లో నేటికీ ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు.
విజయవాడ కమిషరేట్‌ను విస్తరించి అమరావతి కమిషనరేట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను అటకెక్కించింది. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్లుగా పోలీసు వ్యవస్థను పటిష్టపరచడం లేదు. దీంతో రాజధానిలో శాంతిభద్రతల పరిస్థితి అదుపుతప్పుతోంది. ప్రజలకు రక్షణ కొరవడింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో క్రైం రేటు పెరుగుతోంది. ఈ విషయాన్ని ఇటీవల రాష్ట్ర హోం శాఖ తన వార్షిక నివేదికలో స్పష్టం చేసింది.
కొత్త పోలీస్‌స్టేషన్ల ఊసే లేదు...
రాజధాని అవసరాలకు తగినట్లుగా భద్రతా వ్యవస్థను తీర్చిదిద్దాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి కొరవడింది. కొత్త పోలీస్‌స్టేషన్ల ఏర్పాటుపై రెండేళ్లుగా కదలికే లేకుండాపోయింది. అమరావతి జిల్లాల పరిధిలో ప్రస్తుతం 80 పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. కృష్ణా జిల్లా, విజయవాడ కమిషనరేట్, గుంటూరు అర్బన్, గుంటూరు రూరల్ పోలీసు జిల్లాల్లో క్రైం రేటు కొన్నేళ్లుగా పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజధానిగా ఎంపిక అనంతరం అమరావతిలో భద్రత వ్యవస్థను మరింతగా పటిష్ట పరచాల్సిన అవసరం ఏర్పడింది.
హైదరాబాద్ నుంచి అధికార వ్యవస్థ అమరావతికి తరలివచ్చింది. వ్యాపార, అధికారిక కార్యకలాపాలు ఎక్కువయ్యాయి. అదే సమయంలో క్రైం రేటు కూడా బాగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అమరావతి పరిధిలో కొత్తగా 20 పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేయాలని రెండేళ్ల కిందట నిర్ణయించారు. వీటిలో విజయవాడలోని పటమట, మాచవరం, టూ టౌన్, పెనమలూరు పోలీస్‌స్టేషన్లను రెండు చొప్పున విభజించి కొత్తగా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇబ్రహీంపట్నం, గన్నవరం పోలీస్‌స్టేషన్ల పరిధిలో కూడా ఒక్కో కొత్త పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలో చేబ్రోలు, అరండల్‌పేటలో కొత్త పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాజధాని అమరావతి పరిధిలో మొదటి దశలో రెండు, తర్వాత మరో రెండు కొత్త పోలీస్‌స్టేషన్లు నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే గుంటూరులో రెండు కొత్త మోడల్ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేశారు. అమరావతి పరిధిలో ప్రతిపాదించిన సాధారణ పోలీస్‌స్టేషన్లలో కొత్తగా ఒక్కటి కూడా ఏర్పాటు చేయలేదు.
కట్టు తప్పుతున్న భద్రత వ్యవస్థ
విజయవాడ పటమట, మాచవరం పోలీస్‌స్టేషన్ల పరిధిలో నేరాల సంఖ్య ఏడాదికి వెయ్యి దాటుతోంది. అక్రమాలకు ఈ రెండు ప్రాంతాలు అడ్డాగా మారుతున్నాయి. పటమట పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వస్తున్న శివారు పంచాయతీల్లో శాంతిభద్రతల సమస్య తీవ్రంగా ఉంది. పటమట, మాచవరం పరిధిలోనే వైట్‌కాలర్ నేరాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. పెనమలూరులోనూ శాంతిభద్రతల పరిస్థితి అదుపు తప్పుతోంది. రౌడీమూకలు చెలరేగుతున్నాయి. వీధి పోరాటాలు నిత్యకృత్యంగా మారాయి.
విజయవాడ టూ టౌన్ పరిధిలో బలవంతపు వసూళ్లు, సెటిల్‌మెంట్లతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆందోళనకర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. గుంటూరు అర్బన్‌లో అసాంఘిక శక్తులు వ్యవస్థీకృతమవుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. కానీ పనిభారంతో ప్రస్తుత పోలీస్ అధికారులు శాంతిభద్రతల పరిరక్షణలో ఉదాసీనంగా వ్యవహరించాల్సి వస్తోంది. సకాలంలో కేసుల పరిష్కారం అన్నది ఎండమావిగానే మారిపోతోంది. దీంతో బాధితులు చట్టపరమైన పరిష్కారం కన్నా ప్రైవేటు సెటిల్‌మెంట్ల వైపే మొగ్గుచూపాల్సిన అగత్యం ఏర్పడుతోంది.
పోలీస్ వ్యవస్థ పునర్ వ్యవస్థీకరణ ఏదీ...!
అసెంబ్లీ నియోజకవర్గాల ప్రాతిపదికన పోలీస్‌స్టేషన్ల పరిధిని పునర్ వ్యవస్థీకరించాలని రెండేళ్ల కిందట నిర్ణయించారు. ఒక పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు, మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ప్రాంతాలు ఉన్నాయి. దీనివల్ల పాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాలు సమన్వయంతో పనిచేయాల్సిన సందర్భంలో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. దీంతో ఒక పోలీస్‌స్టేషన్ పూర్తిగా ఒక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉండేలా చూడాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలన్న ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమరావతి పరిధిలో ప్రారంభించాలని భావించారు. రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆ నిర్ణయాన్ని అమలు చేయనేలేదు.