‘అసమాన త్యాగ ఫలితమే ఆంధ్రప్రదేశ్. మూడు ప్రాంతాల ప్రజల కష్టార్జితమే సౌ‘భాగ్య’నగరం హైదరాబాద్. నేడు రాజకీయ కుట్రలతో తెలుగు జాతిని రెండుగా చీల్చే దుస్సాహసానికి ఒడిగట్టారు.
సాక్షి, అనంతపురం : ‘అసమాన త్యాగ ఫలితమే ఆంధ్రప్రదేశ్. మూడు ప్రాంతాల ప్రజల కష్టార్జితమే సౌ‘భాగ్య’నగరం హైదరాబాద్. నేడు రాజకీయ కుట్రలతో తెలుగు జాతిని రెండుగా చీల్చే దుస్సాహసానికి ఒడిగట్టారు. రాష్ట్ర విభజనను ప్రతిఘటిస్తాం. అప్పటిదాకా పోరు ఆపేది లేదం’టూ సమైక్యవాదులు స్పష్టీకరిస్తున్నారు. 52వ రోజైన శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఉద్యమకారులు కదం తొక్కారు. జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు డీఈఓ కార్యాలయానికి తాళం వేశారు.
వెనక్కు నడుస్తూ నగరంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల అధ్యాపకులు ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో రాజ్‌గోపాల్ అనే అధ్యాపకుడు అంబేద్కర్ వేషధారణతో ఆకట్టుకున్నారు. విద్యుత్ ఉద్యోగులు గొడుగులతో ర్యాలీ చేపట్టారు. ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో నగరంలోని మూడో రోడ్డు క్రాస్‌లో బహిరంగ సభ నిర్వహించారు. విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణలో ‘జై సమైక్యాంధ్ర’ అంటూ నినదించారు. ఏపీఎన్‌జీఓలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు. చైతన్య గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో తపోవనం వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. న్యాయవాదులు భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం కోర్టు ఆవరణలో కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. శ్రీషిరిడీ సాయి మోక్షిత్ స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖ, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల సిబ్బంది బైక్ ర్యాలీ చేపట్టారు. జేఎన్‌టీయూ(ఏ) ఎదుట విద్యార్థులు గొడుగులు పట్టుకుని నిరసన తెలిపారు. ఓటీఆర్‌ఐ ఉద్యోగులు పంచెకట్టుతో నగరంలో ర్యాలీ చేశారు. మునిసిపల్ కార్పొరేషన్ సిబ్బంది బ్యాంకులు బంద్ చేయించారు. హౌసింగ్, నీటి పారుదల, పీఏసీఎస్, పంచాయతీ రాజ్, పశుసంవర్ధక, రెవెన్యూ, వాణిజ్య పన్నుల శాఖ జేఏసీలు, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
ఎస్కేయూలో విద్యార్థులు రిలే దీక్షలను కొనసాగిస్తున్నారు. ఎస్కేయూ జేఏసీ నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించి వాహన రాకపోకలను అడ్డుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రుల చిత్రపటాలను రోడ్డుపై ఉంచి కర్మకాండ చేశారు. ధర్మవరం, ముదిగుబ్బ, బత్తలపల్లి, తాడిమర్రి, గుంతకల్లు, పామిడిలో రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. గుంతకల్లులో మేదర కులస్తులు రోడ్డుపైనే బుట్టలు అల్లుతూ, ట్రాన్స్‌కో ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. గుత్తిలో ఉపాధ్యాయులు అష్టదిగ్గజ కవుల వేషధారణలో సమైక్య వాదాన్ని చాటిచెప్పారు. హిందూపురంలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో బతుకమ్మ పండగ నిర్వహించారు. ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థులు రోడ్డుపై ఆటా..పాటలతో హోరెత్తించారు. ఏపీ ఎన్‌జీవోలు బైక్ ర్యాలీ నిర్వహించారు. చిలమత్తూరులో జేఏసీ నాయకులు ర్యాలీ చేశారు. కదిరిలో వేలాది మందితో ‘రైతు ఆవేదన’ సభ నిర్వహించారు. కళ్యాణదుర్గంలో ఎరుకల కులస్తులు ర్యాలీ చేపట్టారు. జేఏసీ నాయకులు రాష్ట్ర విభజనకు సంబంధించి.. ‘కేబినెట్ నోట్ కాపీ’ అని రాసి ఉన్న కాగితాలను తగులబెట్టారు. మడకశిరలో జేఏసీ నాయకులు ర్యాలీ నిర్వహించి... కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. సమైక్యాంధ్రను పరిరక్షించాలని గాడిదకు వినతిపత్రం అందజేశారు. అనంతరం గొర్రెలను రోడ్డుపై తోలి నిరసన తెలిపారు. సమైక్యవాదులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి.. రోడ్డుపై శీర్షాసనం వేశారు. అమరాపురంలో సమైక్యవాదులు గుగ్గిళ్లు అమ్ముతూ నిరసన తెలిపారు. పుట్టపర్తిలో జేఏసీ నాయకులు రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్యవాదులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.
బుక్కపట్నంలో ఉపాధ్యాయులు బుట్టలు అల్లుతూ నిరసన తెలిపారు. ఓడీ చెరువులో సమైక్యవాదులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు బంద్ చేయించి.. రాస్తారోకో చేపట్టారు. పెనుకొండలో సోనియాకుదెయ్యం పట్టిందంటూ నినదిస్తూ.. సమైక్య వాదులు ర్యాలీ చేశారు. తెలుగుతల్లి విగ్రహం వద్ద గుంజీలు తీశారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. సోమందేపల్లిలో చాలకూరు గ్రామస్తులు రాస్తారోకో చేశారు.
రొద్దం, పరిగి మండలాల్లో ఉపాధ్యాయులు, సమైక్యవాదుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. రాయదుర్గంలో జోరువానలోనూ ఉపాధ్యాయులు, జూనియర్ కళాశాల విద్యార్థులు ర్యాలీ చేశారు. కణేకల్లులో జేఏసీ నాయకులు వర్షంలో నిలబడి నిరసన తెలిపారు. కణేకల్లుతో పాటు రాప్తాడులో జేఏసీ నాయకులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు. ధర్మవరం, శింగనమల, పుట్లూరు, గార్లదిన్నె, నార్పల మండలాల గ్రామ కార్యదర్శులు, సర్పంచులు సమైక్యాంధ్రకు మద్దతుగా తీర్మానాలు చేసి... ఆ ప్రతులను ప్రభుత్వానికి కొరియర్ ద్వారా పంపారు. నార్పలలో జేఏసీ నాయకులు ర్యాలీ చేశారు.
తాడిపత్రిలో ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు 1,200 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ చేపట్టారు. జేఏసీ నాయకులు స్థానిక పోలీసుస్టేషన్ సర్కిల్‌లో మానవహారం నిర్మించారు. మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. పెద్దవడుగూరులో వైఎస్సార్‌సీపీ నాయకులు, యాడికిలో విద్యార్థుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పెద్దపప్పూరు మండలంలో సమైక్యాంధ్రపై గ్రామ సభలు నిర్వహించారు. ఉరవకొండలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల రిలే దీక్షలు మూడోరోజుకు చేరాయి. కమ్మసేవా సంఘం, జాక్టో ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కూడేరులో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు. విడపనకల్లులో సమైక్యవాదులు, వజ్రకరూరులో బంజారాలు ర్యాలీలు నిర్వహించారు.