తన భార్య సత్యవతి, తన విగ్రహం వద్ద మోటూరి భైరవస్వామి
అయినవిల్లి (పి.గన్నవరం): ఐదున్నర దశాబ్దాల వైవాహిక జీవితంలో అన్యోన్యంగా, ప్రేమానురాగాలతో మెలిగారు ఆ దంపతులు. ఏడాది కిందట భార్య మరణించగా ఆమె తీపి గురుతులు మరువలేని భర్త.. సంవత్సరీకాన్ని పురస్కరించుకొని భార్యకు ప్రేమ మందిరాన్ని నిర్మించాడు. ఊరు, వాడా.. ఇంటింటికీ తిరిగి ఆహ్వాన పత్రికలు పంచాడు.
తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం నల్లచెరువుకు చెందిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మోటూరి భైరవస్వామి భార్య సత్యవతి ఏడాది కిందట మృతి చెందారు. ఆమె జ్ఞాపకార్థం గ్రామంలో ప్రేమ మందిరాన్ని రూ.3.5 లక్షలతో నిర్మించారు. శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు. ఇందుకు కరపత్రాలను ముద్రించి ఇంటింటికీ వెళ్లి ‘నా భార్య ప్రసాదాన్ని తిని, ఆత్మకు శాంతి చేకూరాలని ఆశీర్వదించాలని కోరాడు.
తన భార్య మృతి చెందిన సమయంలో అవయవ దానం కోసం అమలాపురంలోని కిమ్స్ ఆసుపత్రికి దేహాన్ని అప్పగించామని, మరణానంతరం తన దేహన్ని కూడా అమలాపురం కిమ్స్ వైద్యశాలకు దానం ఇచ్చేందుకు అంగీకార పత్రం రాసిచ్చానన్నారు. తన భార్య 55 ఏళ్ల ప్రేమ, అనురాగాలతో నడుచుకుందని, ఇందుకు నిదర్శనంగా ఈ ప్రేమ మందిరాన్ని కుటుంబ సభ్యుల సహకారంతో నిర్మించానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment