Ainavilli
-
నీకోసం వెలిసిందీ.. ప్రేమ మందిరం!
అయినవిల్లి (పి.గన్నవరం): ఐదున్నర దశాబ్దాల వైవాహిక జీవితంలో అన్యోన్యంగా, ప్రేమానురాగాలతో మెలిగారు ఆ దంపతులు. ఏడాది కిందట భార్య మరణించగా ఆమె తీపి గురుతులు మరువలేని భర్త.. సంవత్సరీకాన్ని పురస్కరించుకొని భార్యకు ప్రేమ మందిరాన్ని నిర్మించాడు. ఊరు, వాడా.. ఇంటింటికీ తిరిగి ఆహ్వాన పత్రికలు పంచాడు. తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం నల్లచెరువుకు చెందిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మోటూరి భైరవస్వామి భార్య సత్యవతి ఏడాది కిందట మృతి చెందారు. ఆమె జ్ఞాపకార్థం గ్రామంలో ప్రేమ మందిరాన్ని రూ.3.5 లక్షలతో నిర్మించారు. శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు. ఇందుకు కరపత్రాలను ముద్రించి ఇంటింటికీ వెళ్లి ‘నా భార్య ప్రసాదాన్ని తిని, ఆత్మకు శాంతి చేకూరాలని ఆశీర్వదించాలని కోరాడు. తన భార్య మృతి చెందిన సమయంలో అవయవ దానం కోసం అమలాపురంలోని కిమ్స్ ఆసుపత్రికి దేహాన్ని అప్పగించామని, మరణానంతరం తన దేహన్ని కూడా అమలాపురం కిమ్స్ వైద్యశాలకు దానం ఇచ్చేందుకు అంగీకార పత్రం రాసిచ్చానన్నారు. తన భార్య 55 ఏళ్ల ప్రేమ, అనురాగాలతో నడుచుకుందని, ఇందుకు నిదర్శనంగా ఈ ప్రేమ మందిరాన్ని కుటుంబ సభ్యుల సహకారంతో నిర్మించానని చెప్పారు. -
మంత్రి పేరిట మట్టి అక్రమ తరలింపు!
అయినవిల్లి :డీప్యూటీ సీఎం, హో మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేరుతో కొందరు అక్రమార్కులు లంక మట్టిని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన కొందరు ఈ వ్యవహారాన్ని నడుపుతున్నట్టు తెలిసింది. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మద్దాల సుబ్బారావు అయినవిల్లిలంక వీఆర్ఓ పట్టెం నాగేశ్వరరావును సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో తహశీల్దార్ కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో నిలదీయగా ఈ విషయం బయట పడింది. డీప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప అమలాపురంలోని తన నివాసంలో పూలమొక్కలు పెంచుకునేందుకు గార్డెన్ ఏర్పాటు చేస్తున్నారని, అందుకోసం మట్టి కావాలని కొందరు వ్యక్తులు తన వద్దకు వచ్చారని వీఆర్ఓ బదులిచ్చారు. తొత్తరమూడికి చెందిన అమరా పెద్దబ్బులు పొక్లైయిన్, నాలుగు ట్రాక్టర్ల సాయంతో మట్టిని తరలించుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడని చెప్పారు. మంత్రికి మట్టి కావాలనడంతో తాను పట్టించుకోలేదన్నారు. మంత్రి పేరిట పెద్దబ్బులు కొందరి ప్రోద్బలంతో లంక మట్టిని అక్రమంగా తరలించి, సొమ్ము చేసుకున్నారని మద్దాల సుబ్బారావు ఆరోపించారు. రెండు రోజులుగా మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయన్నారు. అయినవిల్లిలంక, మాగాం, ముక్తేశ్వరం తదితర గ్రామాల్లో సుమారు 50 ట్రాక్టర్ల మట్టిని ఇటుక బట్టీలకు, కొబ్బరి తోటల్లో తరలించారని తహశీల్దార్ కె.చంద్రశేఖర్‌రావుకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని కోరారు. -
జెండా పండుగ వేళ విషాదం
అయినవిల్లి, న్యూస్‌లైన్ : స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఆనందంగా గడపాల్సిన ఇద్దరు విద్యార్థులు జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాతపడ్డారు. కపిలేశ్వరపురం మండలం అద్దంకి వారిలంకకు చెందిన కొండేటి ఏసు, దుర్గ దంపతులకు కుమారుడు ప్రకాష్, కుమార్తె అనసూయ (7) ఉన్నారు. వీరవల్లిపాలెం స్కూల్లో జరుగుతున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు వీరిద్దరూ మేనమామ అత్తిలి నాగబాబుతో మోటార్‌సైకిల్‌పై బయలుదేరారు. అద్దంకివారిలంక-వీరవల్లిపాలెం మార్గ మధ్యం లోకి వచ్చే సరికి ఎదురుగా వస్తున్న కొబ్బరి లోడు లారీ ఢీకొనడంతో అనసూయ లారీ వెనుక భాగంలో టైర్ల కింద పడి అక్కడి కక్కడే మృతి చెందింది. నాగబాబు, ప్రకాష్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. కుమార్తె మరణ వార్త తెలియడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఏడో తరగతి విద్యార్థి మృతి కిర్లంపూడి : కిర్లంపూడి మండలంలోని భూపాల పట్నం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతిచెందాడు. ఎస్సై ఎస్.జి.వలి కథనం ప్రకారం. మండలంలోని శృంగరాయునిపాలెం గ్రామానికి చెందిన మాదారపు గోపాలకృష్ణ (12) జగ్గంపేటలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఏడో తరగతి చదువుతున్నాడు. ఆగస్టు 15 సెలవు రోజు కావడంతో తన స్నేహితులతో కలసి గెద్దనాపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జెండా వందన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లాడు. తిరిగి స్నేహితుడు తోట నాగేంద్రతో కలిసి సైకిల్‌పై వస్తుండగా భూపాలపట్నం ఎస్సీపేట సమీపంలో ట్రాక్టర్ ఢీకొని అక్కడికక్కడే మృ తి చెందాడు. నాగేంద్రకు స్వల్పగాయమైంది. భూపాలపట్నం మాజీ సర్పంచ్ వీరంరెడ్డి కాశీ బాబు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రత్తిపాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జ్యోతుల పరామర్శ విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ సంఘటన స్థలానికి చేరుకుని విద్యార్థి మృతికి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన వివరాలను గ్రామ మాజీ సర్పంచ్ వీరంరెడ్డి కాశీబాబును, గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. జ్యోతుల వెంట భూపాలపట్నం ప్రసాద్, గొడే బాల తదితరులు ఉన్నారు.