జెండా పండుగ వేళ విషాదం
Published Fri, Aug 16 2013 4:15 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
అయినవిల్లి, న్యూస్‌లైన్ : స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఆనందంగా గడపాల్సిన ఇద్దరు విద్యార్థులు జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాతపడ్డారు. కపిలేశ్వరపురం మండలం అద్దంకి వారిలంకకు చెందిన కొండేటి ఏసు, దుర్గ దంపతులకు కుమారుడు ప్రకాష్, కుమార్తె అనసూయ (7) ఉన్నారు. వీరవల్లిపాలెం స్కూల్‌లో జరుగుతున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు వీరిద్దరూ మేనమామ అత్తిలి నాగబాబుతో మోటార్‌సైకిల్‌పై బయలుదేరారు. అద్దంకివారిలంక-వీరవల్లిపాలెం మార్గ మధ్యం లోకి వచ్చే సరికి ఎదురుగా వస్తున్న కొబ్బరి లోడు లారీ ఢీకొనడంతో అనసూయ లారీ వెనుక భాగంలో టైర్ల కింద పడి అక్కడి కక్కడే మృతి చెందింది. నాగబాబు, ప్రకాష్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. కుమార్తె మరణ వార్త తెలియడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఏడో తరగతి విద్యార్థి మృతి
కిర్లంపూడి : కిర్లంపూడి మండలంలోని భూపాల పట్నం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతిచెందాడు. ఎస్సై ఎస్.జి.వలి కథనం ప్రకారం. మండలంలోని శృంగరాయునిపాలెం గ్రామానికి చెందిన మాదారపు గోపాలకృష్ణ (12) జగ్గంపేటలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఏడో తరగతి చదువుతున్నాడు. ఆగస్టు 15 సెలవు రోజు కావడంతో తన స్నేహితులతో కలసి గెద్దనాపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జెండా వందన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లాడు. తిరిగి స్నేహితుడు తోట నాగేంద్రతో కలిసి సైకిల్‌పై వస్తుండగా భూపాలపట్నం ఎస్సీపేట సమీపంలో ట్రాక్టర్ ఢీకొని అక్కడికక్కడే మృ తి చెందాడు. నాగేంద్రకు స్వల్పగాయమైంది. భూపాలపట్నం మాజీ సర్పంచ్ వీరంరెడ్డి కాశీ బాబు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రత్తిపాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
జ్యోతుల పరామర్శ
విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ సంఘటన స్థలానికి చేరుకుని విద్యార్థి మృతికి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన వివరాలను గ్రామ మాజీ సర్పంచ్ వీరంరెడ్డి కాశీబాబును, గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. జ్యోతుల వెంట భూపాలపట్నం ప్రసాద్, గొడే బాల తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement