
మోడీతో పెట్టుకుంటే కేసీఆర్ తుక్కుతుక్కే
కడప: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావుపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోడీతో పెట్టుకుంటే కేసీఆర్ తుక్కు తుక్కు అవుతాడని మంత్రి రావెల కిషోర్ బాబు హెచ్చరించారు. ఆంధ్రప్రజలను కేసీఆర్ భయాందోళనలకు గురిచేస్తున్నాడని, అతనో ఫాసిస్ట్ అని విజయవాడలో కిశోర్ బాబు విమర్శించారు.
కడపలో మరో మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రజల కష్టార్జితమైన హైదరాబాద్ను తీసుకున్న కేసీఆర్ విద్యార్థుల ఫీజులు చెల్లించకపోవడం ఆయన స్థాయికి తగదని అన్నారు. అసలైన ఫ్యాక్షనిస్ట్ కేసీఆరేనని మండిపడ్డారు.
మరో మంత్రి గంటా శ్రీనివాసరావు కేసీఆర్పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ పాలన తుగ్లక్ పాలనను గుర్తుకు తెస్తోందని విమర్శించారు. సెలవు ప్రకటించి సమగ్ర సర్వే నిర్వహించడం ఎమర్జన్సీని తలపిస్తోందని, అందులోని కొన్ని ప్రశ్నలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్కు దమ్ముంటే పాతబస్తీలో సర్వే ప్రారంభించాలని గంటా సవాల్ విసిరారు.