వైఎస్‌ఆర్‌ సీపీ సోషల్‌ మీడియా విభాగంపై దాడి | Andhra pradesh police conduct searches in ysrcp digital media wing | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్‌ సీపీ సోషల్‌ మీడియా విభాగంలో సోదాలు

Published Sat, Apr 22 2017 1:01 PM | Last Updated on Mon, Aug 20 2018 1:46 PM

వైఎస్‌ఆర్‌ సీపీ సోషల్‌ మీడియా విభాగంపై దాడి - Sakshi

వైఎస్‌ఆర్‌ సీపీ సోషల్‌ మీడియా విభాగంపై దాడి

హైదరాబాద్‌ : ఓ వైపు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా...మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సోషల్‌ మీడియాపై దాడులు కొనసాగిస్తోంది. ఏపీ పోలీసులు శనివారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా విభాగంపై దాడి చేశారు. హైదరాబాద్‌ కార్యాలయంలోకి ప్రవేశించిన పోలీసులు సోదాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి,  ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే కన్నబాబు, జోగి రమేష్‌ తదితరులు హుటాహుటీన సోషల్‌ మీడియా కార్యాలయానికి చేరుకున్నారు. సోదాలు చేస్తున్న పోలీసుల చర్యలకు అభ్యంతరం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలే తప్ప, తాబేదారులుగా ఉండకూడదన్నారు. ఇవ్వాళ జరిగినవే రేపు జరుగుతాయని, ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అన్నారు.

చట్టబద్ధంగా వ్యవహరిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఊరుకునేది లేదని ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. పోలీసుల సమక్షంలోనే ఏపీ అసెంబ్లీ సెక్రటరీకి ఫోన్‌ చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ ఫిర్యాదుపై మీరెలా స్పందిస్తారంటూ ఈ సందర్భంగా అసెంబ్లీ కార్యదర్శిని విజయసాయిరెడ్డి నిలదీశారు.

వైఎస్‌ జగన్‌, ఆయన కుటుంబసభ్యులపై అనేక అవాకులు, చవాకులు పేలారని, సభ్య సమాజం హర్షించలేని పోస్టింగ్‌లు వైఎస్‌ జగన్‌పై పెట్టారన్నారు. ఈ విషయంలో టీడీపీ కార్యాలయంలో సోదాలు చేసే శక్తి మీకు ఉందా అని ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌ను దూషిస్తూ మంత్రి లోకేశ్‌ పెట్టిన ట్వీట్లను వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు పోలీసులకు చూపించారు. వైఎస్‌ఆర్‌ సీపీలోని అన్ని విభాగాలకు తానే ఇంఛార్జ్‌ని అని, నోటీసులు ఇవ్వదలిస్తే తనకు ఇవ్వాలని విజయసాయిరెడ్డి అన్నారు. చర్యలు తీసుకుంటే తనపై తీసుకోవాలని ఆయన పోలీసులుతో తెలిపారు.

కాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో సోషల్‌ మీడియాపై విపరీతంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల అనంతపురం పర్యటనలో ఆయన సోషల్‌ మీడియాపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వ తప్పులు, లోపాలను సోషల్‌ మీడియా ఎత్తిచూపడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సర్కార్‌  నేరుగా ఎదుర్కోలేకే అరెస్ట్‌లు చేసి భయభ్రాంతులను చేయాలని వ్యూహంతో ముందుకు వెళుతోంది.

దానిలో భాగంగానే పొలిటికల్‌ పంచ్‌ రవికిరణ్‌ అరెస్ట్‌ మరవక ముందే ఇవాళ వైఎస్‌ఆర్‌ సీపీ సోషల్‌ మీడియా కార్యాలయంలో పోలీసులు సోదాలు చేపట్టారు. మరోవైపు వైఎస్‌ఆర్‌సీపీ ఐటీ వింగ్‌కు చెందిన చల్లా మధుసూదన్‌ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని, ఈనెల 25న విచారణకు హాజరు కావాలని ఏపీ పోలీసులు తెలిపారు. ఆ మేరకు చల్లా మధుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.







Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement