అర్ధరాత్రి ఏయూ ప్రొఫెసర్ అరెస్టు | Andhra University telugu professor Appa Rao, dentist held for Maoist links | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి ఏయూ ప్రొఫెసర్ అరెస్టు

Published Fri, Nov 7 2014 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 PM

అర్ధరాత్రి ఏయూ ప్రొఫెసర్ అరెస్టు

అర్ధరాత్రి ఏయూ ప్రొఫెసర్ అరెస్టు

మావోయిస్టులతో సంబంధాలున్నందుకేనన్న ఎస్పీ
 తెలుగు ప్రొఫెసర్ అప్పారావుతో పాటు మరో ముగ్గుర్ని అరెస్టు చేసినట్లు వెల్లడి
 
 సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ జర్రా అప్పారావును బుధవారం అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు. ప్రొఫెసర్ అరెస్టుకు నిరసనగా విద్యార్థులు ఆయన భార్యతో కలసి ఎస్పీ కార్యాలయం ఎదుట భారీయెత్తున ధర్నా నిర్వహించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రొఫెసర్ అరెస్టును ప్రజా, విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి.
 
 సంచలనం కలిగించిన ఈ ఉదంతం వివరాలు అప్పారావు కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... ఏయూ తెలుగు విభాగంలో అప్పారావు అసోసియేట్ ప్రొఫెసర్. వర్సిటీలోని సీ శాండ్ ఉద్యోగుల వసతిగృహాల్లోని ఆయన నివాసానికి బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో సివిల్ దుస్తుల్లో ఉన్న 8 మంది వచ్చారు. అప్పారావును తమ వెంట రమ్మన్నారు. పోలీసులని భావించి వారంట్ చూపాలని ఆయన అడిగినా విన్పించుకోలేదు. మీరెవరు? ఎక్కడి కి తీసుకెళుతున్నారని అప్పారావు భార్య మైనావతి, ఇతర బంధువులు ప్రశ్నిస్తున్నా పట్టించుకోకుండా తాము వచ్చిన టాటా సుమో వాహనంలోకి ఎక్కించుకుని తీసుకెళ్లారు. దీంతో వాహనం వెంటపడిన బంధువుల వద్దనున్న మూడు సెల్‌ఫోన్‌లను సైతం వారు లాక్కెళ్లారు. యువకుడైన అప్పారావును ఎవరు తీసుకెళ్లారో స్పష్టంగా తెలియకపోవడంతో తొలుత కిడ్నాప్‌గా సందేహించారు. దీంతో ఆయన భార్య 3వ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన భర్తను ఎవరో కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేశారు. విషయం వీసీ జీఎస్‌ఎన్ రాజు దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన పోలీసులను సంప్రదించడంతో నర్సీపట్నం నుంచి వచ్చిన పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడైంది.
 
 భగ్గుమన్న విద్యార్థులు
 
 తమ ప్రొఫెసర్ అరెస్టు గురించి తెలియడంతో ఏయూ విద్యార్థులు భగ్గుమన్నారు. వర్సిటీ బంద్‌కు పిలుపునిచ్చి గురువారం ఉదయం ఎస్పీ కార్యాలయం ఎదుట అప్పారావు భార్యతో కలసి ఆందోళనకు దిగారు. పౌరహక్కుల సంఘం, గిరిజన విద్యార్థుల సమాఖ్య, గిరిజన ఉద్యోగ సంఘం, మత్స్యకార సంఘం ప్రతినిధులు పెద్దసంఖ్యలో ఆందోళన చేపట్టారు. అప్పారావును బేషరతుగా విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. దాంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో సాయంత్రం మీడియా సమావేశంలో ఎస్పీ కోయ ప్రవీణ్ మాట్లాడుతూ అప్పారావు అరెస్టును ధ్రువీకరించారు. మావోయిస్టులతో సన్నిహిత సంబంధాలున్నందునే అప్పారావుతో పాటు వసపరి ప్రసాద్, గణపతి రాజు సుబ్బరాజు అలియాస్ వర్మ, జగదీష్‌లను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. విశాఖ జిల్లా న ర్సీపట్నం పోలీసులకు అందిన సమాచారం నేపథ్యంలో.. ప్రసాద్, గణపతిలను తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి నుంచి పేలుడు సామగ్రి తీసుకువస్తుండగా పట్టుకున్నట్టు తెలిసింది. వారివద్ద నుంచి కొన్ని పేలుడు పదార్థాలు, సెల్‌ఫోన్లు, మారుతి రిట్జ్ కారు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వెల్లడైన సమాచారం ఆధారంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జగదీష్‌ను, విశాఖలో అప్పారావును అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ముఠాగా ఏర్పడి  మావోయిస్టులకు కావాల్సిన సరంజామాను అందిస్తున్నట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు ఎస్పీ చెప్పారు.
 
 పలు సెక్షన్ల కింద కేసులు
 
 ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. నర్సీపట్నం మండలం చాపరాతిపాలెంనకు చెందిన ప్రసాద్ దగ్గర గణపతి, జగదీష్‌రెడ్డిలు మైనింగ్ కాంట్రాక్టర్లుగా పనిచేస్తున్నారు. గణపతితో అప్పారావుకు చిన్ననాటి స్నేహం ఉంది. ఈ నేపథ్యంలో అప్పారావు రెండుమూడు సార్లు మైనింగ్ కాంట్రాక్టర్లను కలసి పేలుడు పదార్థాల సరఫరాకు మధ్యవర్తిగా వ్యవహరించారని ఎస్పీ తెలిపారు. ఈ విషయాలన్నీ ఆయన సెల్‌ఫోన్ కాల్ డేటా రికార్డ్(సీడీఆర్)ను బట్టి తెలిసిందన్నారు. అమ్మోనియం నైట్రేట్‌కి పంచదార, డీజిల్ కలిపి ల్యాండ్ మైన్స్‌ను తయారు చేసి మనుషుల ప్రాణాలు తీసేందుకు వీరు సహకరిస్తున్నారని చెప్పారు. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరే కించేవారిని టార్గెట్ చేస్తున్నామనడంలో వాస్తవం లేదన్నారు. అప్పారావుతోపాటు నిందితులు నలుగురిపై ఐపీసీ, పీడీ యాక్ట్‌లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వీరిని శుక్రవారం కోర్టులో హాజరుపరచనున్నట్టు సమాచారం.
 
 సెంట్రల్ వర్సిటీ నుంచి డాక్టరేట్
 గిరిజనుడైన అప్పారావు కష్టపడి ఉన్నతస్థాయికి చేరుకున్నారు. విశాఖ జిల్లా జి.మాడుగుల మండలంలోని కోరపల్లి స్వగ్రామం. ఎం.ఏ తెలుగు, పీహెచ్‌డీలను హైదరాబాద్ సెంట్రల్‌వర్సిటీలో పూర్తిచేశారు. ఏయూలో ఎంకాం, ఎంఫిల్ చేశారు. 2006లో ఏయూలో ప్రొఫెసర్‌గా చేరారు. విద్యార్థులకు ఎంతో అండగా ఉంటారనే పేరుంది.  
 
 బాక్సైట్ తవ్వకాలపై పోరాటమే కారణమా?
 
 గిరిజన సమస్యలపై అప్పారావు పోరాడుతుంటారు. ఇదే క్రమంలో విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకరించే వారిపై మావోయిస్టు ముద్రవేసి పోలీసులు వేధిస్తున్నారని విద్యార్థి, గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. గతంలోనూ ఓసారి మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ అప్పారావును పోలీసులు విచారించారు. అప్పారావు దంపతులకు కుమారుడు ఐదేళ్ల సాయి, కుమార్తె మూడేళ్ల చరణ ఉన్నారు.
 
 అప్పారావు అరెస్టును పౌరహక్కుల, గిరిజన, ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండించాయి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement