=స్వచ్ఛందంగా దుకాణాలు, విద్యా సంస్థల మూసివేత
=వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు
=ర్యాలీలు, రాస్తారోకోలతో దద్దరిల్లిన మండల కేంద్రాలు
సాక్షి, విశాఖపట్నం : తెలంగాణ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీతో పాటు వివిధ రాజకీయ పార్టీలు, ఏపీ ఎన్జీవోలు, విద్యార్థి సంఘాలు శుక్రవారం చేపట్టిన బంద్ విజయవంతమైంది. వివిధ పార్టీల పిలుపు మేరకు బంద్‌కు అన్ని వర్గాలు మద్దతు పలికాయి. వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు పార్టీ శ్రేణులు జిల్లా అంతటా ఆందోళనలు చేపట్టాయి.
అరెస్టులతో బంద్ భగ్నానికి పోలీసులు ఎంత ప్రయత్నించినా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు వెనక్కి తగ్గలేదు. పాఠశాలలు, దుకాణాల్ని స్వచ్ఛందంగా మూసివేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. పలుచోట్ల థియేటర్లు, పెట్రోల్ బంకులు మూతపపడ్డాయి. ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, బైటాయింపు, రోడ్లు దిగ్బంధంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో 39 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
బంద్‌కు మంత్రి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చినా కాంగ్రెస్ శ్రేణులు పట్టించుకోలేదు. తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం అక్కడక్కడ ఆందోళనలు నిర్వహించారు. న్యాయవాదులు కోర్టుకు తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఏపీ ఎన్జీవో నేతలు ఆందోళనలు చేశారు. విద్యుత్ జేఏసీ నేతలు విశాఖలోని ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు.
వైఎస్సార్‌సీపీ పిలుపు మేరకు చోడవరం, రావికమతంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకట్రావు, సమన్వయకర్త బలిరెడ్డి సత్యారావు పాల్గొన్నారు. బంద్ భగ్నానికి పోలీసులు ప్రయత్నించినా నిరసనకారులు ప్రతిఘటించారు. దీంతో 39మందిని అరెస్టు చేశారు.
మాడుగుల నియోజకవర్గం కేజేపురంలో జరిగిన కార్యక్రమంలో చొక్కాకుల వెంకట్రావు, దేవరాపల్లిలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కన్వీనర్ బూడి ముత్యాలనాయుడు, కె.కోటపాడులో సమన్వయకర్త పూడి మంగపతిరావు ఆధ్వర్యంలో బంద్ జరిగింది.
నర్సీపట్నంలో బస్సులు నిలిచిపోయాయి. ప్రభుత్వ కార్యాలయాలు బోసిపోయాయి. రహదారుల్ని వైఎస్సార్‌సీపీ శ్రేణులు దిగ్బంధం చేశాయి. సినిమా థియేటర్లు, పెట్రోలు బంకులు మూతపడ్డాయి. వైఎస్సార్ సీపీ సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో బంద్ పాటించారు.
అనకాపల్లిలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ, ఏపీఎన్జీవో ఆధ్వర్యంలో బంద్ జరిగింది. ఎక్కడికక్కడ ర్యాలీలు నిర్వహించారు. వైఎస్సార్‌సీపీనాయకుడు కొణతాల లక్ష్మీనారాయణ, టీడీపీ నేత బుద్ద నాగజగదీశ్వరరావు, ఏపీ ఎన్జీవో నేతలు ఎం.పరమేశ్వరరావు, కె.ఎన్.వి. సత్యనారాయణ పాల్గొన్నారు. కాంగ్రెస్ నేత కడింశెట్టి రాంజీ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు పట్టణంలో ర్యాలీ చేపట్టారు. కొండకొప్పాకలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. కశింకోట, తాళ్లపాలెంలో కూడా బంద్ నిర్వహించారు.
యలమంచిలిలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు బొడ్డేడ ప్రసాద్, ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు జరిగాయి. పలుచోట్ల యూపీఏ, కాంగ్రెస్ నేతల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. రాంబిలి, మునగపాకల్లోనూ బంద్ విజయవంతమైంది.
పాయకరావుపేట వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చెంగల వెంకట్రావు ఆధ్వర్యంలో పాయకరావుపేట,ఎస్.రాయవరం, నక్కపల్లిలో బంద్ నిర్వహించారు. జాతీయ రహదారిని పార్టీ శ్రేణులు దిగ్బంధం చేశాయి.
రాస్తారోకో, బైటాయింపు, ర్యాలీలతో పాడేరు నియోజకవర్గం దద్దరిల్లింది. వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలు వంజంగి కాంతమ్మ, జి.ఈశ్వరి, సీకరి సత్యవాణి ఆధ్వర్యంలో పాడేరులో బంద్ జరిగింది. టీడీపీ నేతలు కూడా బంద్ పాటించారు. మాజీ మంత్రి మత్సరాస మణికుమారి, టీడీపీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొర్రా నాగరాజు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి.
అరకు నియోజకవర్గం పరిధిలోని అరకు, అనంతగిరి, డుంబ్రిగుడలో బంద్ జరిగింది. వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు కుంబా రవిబాబు, కిడారి సర్వేశ్వరరావు, దన్ను దొర ఆధ్వర్యంలోధర్నాలు, ర్యాలీలు జరిగాయి.
బంద్ ప్రశాంతం
Published Sat, Dec 7 2013 2:35 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement